త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ద‌లాల్ స్ట్రీట్‌లో దీపావ‌ళి ధ‌మాకా.. సెన్సెక్స్‌, నిఫ్టీ50 బుల్ ర్యాలీ..

Stock Markets | అంతర్జాతీయ మార్కెట్లలో టెక్నాలజీ షేర్ల పతనం, కృత్రిమ మేధ (ఏఐ) పెట్టుబడులపై ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్లు మాత్రం భారీ లాభాలతో దూసుకెళ్లాయి. వరుసగా ఏడో సెషన్‌లోనూ లాభాలను నమోదు చేస్తూ దీపావళి పండుగకు ముందు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. సెన్సెక్స్ 1,718 పాయింట్లు, నిఫ్టీ 493 పాయింట్లకు పైగా పెరిగి 25,000 మార్కును తిరిగి అందుకుంది.

S

Business | Published On Nov 6, 2026, 4.11 pm IST

Stock Markets | ద‌లాల్ స్ట్రీట్‌లో దీపావ‌ళి ధ‌మాకా.. సెన్సెక్స్‌, నిఫ్టీ50 బుల్ ర్యాలీ..
Advertisement

Stock Markets | అంతర్జాతీయ మార్కెట్లలో టెక్నాలజీ షేర్ల పతనం, కృత్రిమ మేధ (ఏఐ) పెట్టుబడులపై ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్లు మాత్రం భారీ లాభాలతో దూసుకెళ్లాయి. వరుసగా ఏడో సెషన్‌లోనూ లాభాలను నమోదు చేస్తూ దీపావళి పండుగకు ముందు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. సెన్సెక్స్ 1,718 పాయింట్లు, నిఫ్టీ 493 పాయింట్లకు పైగా పెరిగి 25,000 మార్కును తిరిగి అందుకుంది.

భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..

అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,718.01 పాయింట్లు (2.17 శాతం) పెరిగి 81,028.02 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 493.75 పాయింట్లు (2.01 శాతం) లాభపడి 25,030.35 వద్ద ముగిసింది. దీంతో నిఫ్టీ మరోసారి 25,000 కీలక స్థాయిని అధిగమించింది. సెన్సెక్స్ 79,413.66 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్ఠంగా 81,028.02 స్థాయిని తాకింది. నిఫ్టీ 24,538.20 వద్ద ప్రారంభమై 24,388.05 కనిష్ఠ స్థాయి నుంచి పుంజుకుని 25,030.35 వద్ద ముగిసింది. వరుసగా ఏడో సెషన్‌లోనూ మార్కెట్లు లాభాలను నమోదు చేయడం విశేషం.

ప్రైవేటు బ్యాంకుల షేర్లలో ర్యాలీ..

ప్రైవేట్ బ్యాంకుల షేర్లలో కొనుగోళ్ల జోరు మార్కెట్ ర్యాలీకి ప్రధానంగా దోహదపడింది. సెన్సెక్స్ షేర్లలో మహీంద్రా అండ్ మహీంద్రా 6.15 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ 4.65 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3.56 శాతం, టైటాన్ 3.36 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.19 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.68 శాతం చొప్పున పెరిగాయి. టాటా స్టీల్ 2.20 శాతం, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్ 2.09 శాతం చొప్పున లాభపడ్డాయి. సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ 1.90 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు విస్తృత మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. నిఫ్టీ 100 1.62 శాతం, నిఫ్టీ 200 1.30 శాతం, నిఫ్టీ 500 ఒక శాతం పెరిగాయి. అయితే నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 స్వల్పంగా 0.02 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఏకంగా 0.82 శాతం నష్టపోయాయి. మార్కెట్ ఒడిదుడుకులను సూచించే ఇండియా విక్స్ 13.35 శాతం పెరిగి 17.66కు చేరడం గమనార్హం. రంగాల వారీగా నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 3.22 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 25/50 సూచీ 2.54 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మీడియా మాత్రం 1.52 శాతం నష్టపోయింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మాత్రమే సెన్సెక్స్‌లో నష్టాలతో ముగిసిన షేర్‌గా నిలిచింది.

అంత‌ర్జాతీయ ప‌త‌నాన్ని త‌ట్టుకుని మ‌రీ..

భారత మార్కెట్లు అంతర్జాతీయ పతనాన్ని తట్టుకుని నిలవడానికి పలు కారణాలు దోహదపడ్డాయి. అమెరికా మార్కెట్లలో టెక్నాలజీ షేర్లు భారీగా పడిపోవడం, కృత్రిమ మేధ, డేటా సెంటర్లలో పెట్టుబడులపై రాబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఆందోళన చెందడం ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపాయి. అయితే భారత మార్కెట్లలో పెద్ద ప్రైవేట్ బ్యాంకుల షేర్లకు వచ్చిన డిమాండ్, ముడి చమురు ధరల తగ్గుదల, అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ తగ్గడం, రూపాయి బలపడడం దేశీయ మార్కెట్లకు మద్దతునిచ్చాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. విదేశీ పెట్టుబడుల ప్రవాహాలు, చమురు ధరలు, రూపాయి కదలికలు కొత్త సంవత్‌లోనూ మార్కెట్ దిశను ప్రభావితం చేయనున్నాయని పేర్కొన్నారు. కాగా అమెరికా ఉద్యోగ గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారని, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు కూడా మార్కెట్లకు కీలకంగా మారనున్నాయని తెలిపారు.

ప‌త‌న‌మైన చ‌మురు ధ‌ర‌లు..

ముడి చమురు ధరలు తగ్గడం కూడా భారత మార్కెట్లకు ఊరటనిచ్చింది. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 89.74 డాలర్లకు చేరి 0.86 శాతం తగ్గింది. బ్రెంట్ క్రూడ్ ధర 0.84 శాతం తగ్గి 97.46 డాలర్ల వద్ద ట్రేడయింది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌కు ఈ తగ్గుదల సానుకూల పరిణామంగా మారింది. దీపావళి ముందు మార్కెట్లలో నెలకొన్న ఈ ఉత్సాహం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చినప్పటికీ, ఇండియా విక్స్ పెరుగుదల, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో బలహీనత అంతర్జాతీయ పరిణామాలపై ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియ‌జేస్తున్నాయి.

Advertisement
Advertisement