UPI | యూపీఐ చెల్లింపుదారులకు షాక్..? లావాదేవీలకు ఫీజు వసూలు..?
UPI | దేశంలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే కోట్లాది మంది వినియోగదారులను ప్రభావితం చేసే కీలక మార్పు త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వ్యాపార సంస్థలకు రూ.2వేలకు పైగా చేసే యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
UPI | దేశంలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే కోట్లాది మంది వినియోగదారులను ప్రభావితం చేసే కీలక మార్పు త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వ్యాపార సంస్థలకు రూ.2వేలకు పైగా చేసే యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే వ్యక్తి నుంచి వ్యక్తికి (పీ2పీ) జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండే అవకాశం లేదని సమాచారం. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్లులో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎలక్ట్రానిక్ చెల్లింపులపై ఎండీఆర్ వసూలు చేయకుండా ఉన్న నిబంధనను తొలగించే ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే ఈ మార్పులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు.
వినియోగదారులే చెల్లించాలా..?
కాగా ఈ చర్యతో స్థానిక దుకాణంలో యూపీఐ ద్వారా కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులే అదనపు ఛార్జీ చెల్లించాల్సి వస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశంపై ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందిస్తూ.. ప్రస్తుతం దీనిపై స్పష్టంగా చెప్పడం తొందరపాటేనని అన్నారు. ప్రభుత్వం ఇంకా సవరణ ప్రక్రియలో ఉందని, యూపీఐ వంటి ప్రజా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కావాలంటే వాటి నిర్వహణ ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో పరిస్థితి ఎలా మారుతుందో వేచి చూడాలని సూచించారు. చివరికి ఈ ఖర్చు వినియోగదారులపైనే పడుతుందా అనే ప్రశ్నకు స్పందించిన ఆయన.. ఏ రూపంలో అయినా చివరకు ఖర్చును వినియోగదారులే భరిస్తారని చెప్పారు. అయితే అది నేరుగా అదే వినియోగదారుడి నుంచి వసూలు చేయకపోవచ్చని, ఆర్థిక వ్యవస్థలో వేరే రూపంలో కూడా ఆ భారాన్ని మళ్లించే అవకాశం ఉందని వివరించారు.
మౌలిక వసతులకు నిధులు అవసరం..
యూపీఐ వ్యవస్థ నిర్వహణకు ఇప్పటికే ఖర్చులు ఉన్నాయని, వాటిని ప్రస్తుతం కూడా ఎక్కడో ఒకచోట భరిస్తున్నారని మల్హోత్రా పేర్కొన్నారు. ఎండీఆర్ ద్వారా లేదా ఇతర మార్గాల్లో ఈ మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూరేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం పరిశీలిస్తున్న ప్రతిపాదన ప్రకారం రూ.2వేలకు పైగా వ్యాపార సంస్థలకు చేసే యూపీఐ చెల్లింపులపై 0.25 శాతం నుంచి 0.4 శాతం వరకు ఎండీఆర్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక అంచనాల ప్రకారం ఈ పరిమితి యూపీఐ మొత్తం లావాదేవీల్లో కేవలం 5 శాతాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది. అయితే విలువ పరంగా చూస్తే ఇవే మొత్తం యూపీఐ లావాదేవీలలో దాదాపు 65 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అందువల్ల పాలు, కూరగాయలు, కిరాణా సరుకులు కొనుగోలు చేయడం, ఆటోరిక్షా లేదా టాక్సీ చెల్లింపులు వంటి సాధారణ రోజువారీ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. జూలై నెలలో యూపీఐ ద్వారా 23.7 బిలియన్ లావాదేవీలు, మొత్తం రూ.29.9 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు నమోదయ్యాయి.
యూపీఐ లావాదేవీలపై ప్రభావం..?
ఎండీఆర్ అమల్లోకి వచ్చినా యూపీఐ లావాదేవీలలో 95 శాతం ఎలాంటి ఛార్జీలకు గురికావని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే అన్ని వ్యాపార సంస్థలు ఈ ఛార్జీలని వినియోగదారులపై మోపే అవకాశం కూడా లేదని, వసూలయ్యే మొత్తం కూడా చాలా స్వల్పంగానే ఉంటుందని పేర్కొన్నారు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వం ఎండీఆర్‌కు గరిష్ట పరిమితిని కూడా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. క్రెడిట్ కార్డుల మాదిరిగా నిధుల వ్యయం యూపీఐలో ఉండదని, అందువల్ల అవసరమైన ఖర్చులు మాత్రమే తిరిగి పొందేలా ఒక పరిమితి ఉండటం సమంజసమని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలపై ఇప్పటికే ఎండీఆర్ అమల్లో ఉంది. అయితే చాలా సందర్భాల్లో ఈ ఛార్జీని వ్యాపారులే భరిస్తున్నారు. క్రెడిట్ కార్డులపై ఎండీఆర్ గరిష్టంగా 3 శాతం వరకు ఉండగా, రూ.20 లక్షల వరకు ఉన్న డెబిట్ కార్డు లావాదేవీలపై గరిష్టంగా 0.4 శాతం, అంతకంటే ఎక్కువ మొత్తాలపై 0.9 శాతం వరకు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో యూపీఐ చెల్లింపులకు సైతం ఛార్జీలను వసూలు చేస్తే ఖర్చులను కొంత మేర భరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
- ●IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!
- ●Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!
- ●Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది
- ●Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే
- ●KCR | కేసీఆర్కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
- ●CM Revanth Reddy | ఆ మూడు ప్రాజెక్టులకు ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి.. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయండి

IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!

Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!

Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది

Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే






