త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E20 పెట్రోల్‌పై వైరల్ ప్రచారానికి కేంద్రం చెక్.. 10 కీలక అంశాలపై పూర్తి క్లారిటీ..

కేంద్ర ప్రభుత్వం E20 ఎథనాల్ బ్లెండింగ్ కార్యక్రమంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాలకు చెక్ పెడుతూ సమగ్ర వివరణ విడుదల చేసింది. E20 పెట్రోల్ వల్ల అధిక నీటి వినియోగం జరుగుతుందని, వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయని, ఇన్సూరెన్స్ చెల్లదని, పర్యావరణానికి నష్టం కలుగుతుందని వస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఖండించింది.

S

Business | Published On Jul 6, 2026, 11.59 am IST

E20 పెట్రోల్‌పై వైరల్ ప్రచారానికి కేంద్రం చెక్.. 10 కీలక అంశాలపై పూర్తి క్లారిటీ..
Advertisement

కేంద్ర ప్రభుత్వం E20 ఎథనాల్ బ్లెండింగ్ కార్యక్రమంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాలకు చెక్ పెడుతూ సమగ్ర వివరణ విడుదల చేసింది. E20 పెట్రోల్ వల్ల అధిక నీటి వినియోగం జరుగుతుందని, వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయని, ఇన్సూరెన్స్ చెల్లదని, పర్యావరణానికి నష్టం కలుగుతుందని వస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 10 అంశాల వివరణలో, 20 శాతం వరకు ఎథనాల్ కలిపిన పెట్రోల్‌కు శాస్త్రీయ అధ్యయనాలు, అంతర్జాతీయ అనుభవం, నియంత్రణ సంస్థల భద్రతా ప్రమాణాల మద్దతు ఉందని స్పష్టం చేసింది. ఒక లీటర్ ఎథనాల్ తయారీకి 10 వేల లీటర్ల నీరు అవసరమవుతుందనే ప్రచారాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. దేశ ఆహార భద్రత అవసరాలు తీరిన తర్వాత మిగిలిన అదనపు బియ్యాన్నే ఎథనాల్ ఉత్పత్తికి వినియోగిస్తున్నామని వెల్లడించింది.

3 నుంచి 5 లీట‌ర్ల నీరే..

ఎథనాల్ డిస్టిలరీలు ఒక లీటర్ ఎథనాల్ తయారీకి సుమారు 3 నుంచి 5 లీటర్ల శుద్ధి చేసిన నీటినే వినియోగిస్తున్నాయని తెలిపింది. అంతేకాకుండా నీటిని తిరిగి వినియోగించే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థలను ఎక్కువగా అమలు చేస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఎథనాల్ సరఫరాలో 40 శాతానికి పైగా మొక్కజొన్న నుంచే వస్తోందని, వరితో పోలిస్తే మొక్కజొన్న సాగుకు చాలా తక్కువ నీరు అవసరమవుతుందని తెలిపింది. అధిక కనీస మద్దతు ధరల ద్వారా మొక్కజొన్న సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వివరించింది. E20 అంటే పరీక్షించని ఇంధనం అనే వాదనను కూడా కేంద్రం ఖండించింది. అమెరికా, బ్రెజిల్, కెనడా, థాయ్‌లాండ్, జపాన్‌తోపాటు పలు యూరోపియన్ దేశాలు ఎన్నో సంవత్సరాలుగా వివిధ స్థాయిల్లో ఎథనాల్ మిశ్రమ ఇంధనాన్ని విజయవంతంగా ఉపయోగిస్తున్నాయని పేర్కొంది.

పూర్తిగా ప‌రీక్షించాకే..

వాహనాల పనితీరుపై వస్తున్న సందేహాలపై కూడా ప్రభుత్వం స్పందించింది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్‌ఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో ప్రయాణికుల కార్లపై సుమారు 40 వేల కిలోమీటర్లు, ద్విచక్ర వాహనాలపై 20 వేల కిలోమీటర్ల వరకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ఈ పరీక్షల్లో వాహనాల పనితీరు లేదా ఇంధన సామర్థ్యంపై ఎలాంటి ప్రధాన ప్రతికూల ప్రభావం కనిపించలేదని, మైలేజీలో స్వల్ప మార్పులు మాత్రమే గుర్తించామని వెల్లడించింది. E20కి అనుగుణంగా రూపొందించిన వాహనాలు ఎథనాల్ అధిక ఆక్టేన్ విలువ వల్ల మరింత ప్రయోజనం పొందే అవకాశం ఉందని పేర్కొంది.

వాహ‌న భాగాలు దెబ్బ తిన‌వు..

ఏఆర్‌ఏఐ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనాలను ప్రస్తావిస్తూ, E20 వల్ల ఇంజిన్లు దెబ్బతినడం లేదా లోహ, ప్లాస్టిక్ భాగాలు క్షీణించడం వంటి ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అయితే పాత వాహనాల్లోని కొన్ని రబ్బరు భాగాలను కొంచెం ముందుగానే మార్చాల్సిన అవసరం ఉంటుంద‌ని తెలిపింది. E20 ఇంధనం వాడితే వాహనాల వారంటీ లేదా ఇన్సూరెన్స్ రద్దవుతుందనే ప్రచారాన్ని కూడా ప్రభుత్వం కొట్టిపారేసింది. E20కు అనుకూలంగా రూపొందించిన లేదా ఆమోదం పొందిన వాహనాలకు వర్తించే వారంటీ, ఇన్సూరెన్స్ రక్షణ యథావిధిగా కొనసాగుతుందని ఆటోమొబైల్ తయారీ సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు స్పష్టం చేశాయని తెలిపింది.

చ‌క్కెర ఉండ‌దు..

E20 పెట్రోల్‌లో చక్కెర ఉండటంతో చీమలు, తేనెటీగలు ఆకర్షితమవుతున్నాయనే వైరల్ పోస్టులపై కూడా కేంద్రం స్పందించింది. ఇంధన నాణ్యత కలిగిన ఎథనాల్ తయారీలో డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా చక్కెరను పూర్తిగా తొలగిస్తార‌ని, పురుగులను దూరంగా ఉంచే డీనేచరెంట్లు అందులో కలిపి ఉంటాయని తెలిపింది. అంతేకాకుండా పెట్రోల్ హైడ్రోకార్బన్ వాసనే మిశ్రమ ఇంధనంలో ప్రధానంగా ఉంటుందని వివరించింది. E20 కార్యక్రమాన్ని సుప్రీంకోర్టులో ప్రభుత్వం ప్రయోగంగా పేర్కొన్నట్లు వచ్చిన వార్తలను కూడా కేంద్రం ఖండించింది. సుప్రీంకోర్టులో విచారణ ఎథనాల్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పంద నిబంధనలపై మాత్రమే జరిగిందని, E20 కార్యక్రమం నాణ్యత లేదా ప్రయోజనాలపై కాదని స్పష్టం చేసింది. దీనిపై అటార్నీ జనరల్ కార్యాలయం కూడా మీడియా కథనాలు తప్పుదోవ పట్టించాయని వివరణ ఇచ్చిందని తెలిపింది.

నీరు చేర‌దు..

E20 వల్ల వాహనాల ఇంధన ట్యాంకుల్లోకి నీరు చేరుతుందనే ఆరోపణలను కూడా ప్రభుత్వం తిరస్కరించింది. ఆధునిక వాహనాలు, పెట్రోల్ బంకుల మౌలిక సదుపాయాల్లో నీరు లోపలికి వెళ్లకుండా రక్షణ వ్యవస్థలు ఉన్నాయని తెలిపింది. చెరకు రసాన్ని పెట్రోల్‌లో కలుపుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు పూర్తిగా నకిలీవని స్పష్టం చేసింది. ఇంధన గ్రేడ్ ఎథనాల్ పరిశ్రమలలో ప్రమాణాలకు అనుగుణంగా తయారై, నాణ్యత ప్రమాణాల ప్రకారం మాత్రమే పెట్రోల్‌లో కలుపుతారని పేర్కొంది. పర్యావరణ అంశాలపై కూడా కేంద్రం వివరణ ఇచ్చింది. ఎథనాల్ ప్లాంట్లు తప్పనిసరిగా పర్యావరణ అనుమతులు పొందాలని, భూగర్భ జలాల వినియోగ నిబంధనలను పాటించాలని తెలిపింది. 2014-15 నుంచి ఇప్పటివరకు ఎథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం వల్ల రూ.1.9 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య ఆదా జరిగిందని వెల్లడించింది. రైతులకు రూ.1.6 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు వేగంగా జరిగాయని, సుమారు 930 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గాయని, 310 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ముడి చమురు దిగుమతులను తగ్గించగలిగామని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement
Advertisement