త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IIT Madras | రూ.500కే ఐఐటీ మద్రాస్ ఆన్‌లైన్ కోర్సులు.. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు అవకాశం..

IIT Madras | ఐఐటీ మద్రాస్ పాఠశాల విద్యార్థుల కోసం 20 ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు కేవలం రూ.500 ఫీజుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ వంటి ఆధునిక సాంకేతిక, ఇతర రంగాలకు సంబంధించిన కోర్సులను అభ్యసించవచ్చు. జనవరి 2027 బ్యాచ్ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.

S

Business | Published On Nov 21, 2026, 4.47 pm IST

IIT Madras | రూ.500కే ఐఐటీ మద్రాస్ ఆన్‌లైన్ కోర్సులు.. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు అవకాశం..
Advertisement

IIT Madras | ఐఐటీ మద్రాస్ పాఠశాల విద్యార్థుల కోసం 20 ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు కేవలం రూ.500 ఫీజుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ వంటి ఆధునిక సాంకేతిక, ఇతర రంగాలకు సంబంధించిన కోర్సులను అభ్యసించవచ్చు. జనవరి 2027 బ్యాచ్ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.

20 ఆన్‌లైన్ స‌ర్టిఫికెట్ కోర్సులు.. ఒక్కో కోర్సుకు రూ.500..

పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు భవిష్యత్తు కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సంస్థకు చెందిన స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మొత్తం 20 ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తోంది. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు వీటిలో చేరవచ్చు. ఒక్కో కోర్సుకు రూ.500 ఫీజు నిర్ణయించారు. జనవరి 11, 2027 నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభం కానుండగా, రిజిస్ట్రేషన్లకు జనవరి 8, 2027 చివరి తేదీగా నిర్ణయించారు. సాంకేతిక రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్ అండ్ ఏఐ, ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ, గేమ్ టెక్ ఎక్స్‌ప్లోరర్స్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఏయే అంశాల‌పై కోర్సులు ఉన్నాయి..?

ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉన్నవారు ఏరోస్పేస్ ప్రాథమిక అంశాలు, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, బయోలాజికల్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ వంటి కోర్సులను ఎంచుకోవచ్చు. గణితం, సైన్స్ విభాగాల్లో స్టాటిస్టిక్స్, మాలిక్యులర్ ఇంజినీరింగ్, ఫోరెన్సిక్ సైన్స్, మానవ శరీర రక్షణ వ్యవస్థలు, గణిత ఆటలు, పజిల్స్‌కు సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఎకనామిక్స్, ఫైనాన్స్, లా, డిజిటల్ హ్యూమానిటీస్ వంటి విభాగాల్లోనూ శిక్షణ పొందవచ్చు. అయితే కొన్ని కోర్సులకు ప్రత్యేక అర్హతలు ఉన్నాయి. ఉదాహరణకు ఫ్రమ్ స్టాటిస్టిక్స్ టు ఇంటెలిజెన్స్ కోర్సు 11, 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులను 9, 10వ తరగతి విద్యార్థులకు, 11, 12వ తరగతి విద్యార్థులకు వేర్వేరుగా రూపొందించారు.

రికార్డెడ్ వీడియో పాఠాలు, ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తులు..

ఎనిమిది వారాల పాటు కొనసాగే ఈ కోర్సుల్లో రికార్డెడ్ వీడియో పాఠాలతోపాటు ప్రత్యక్ష ఇంటరాక్టివ్ తరగతులు, ఆన్‌లైన్ అసైన్‌మెంట్లు ఉంటాయి. ప్రతి సోమవారం కొత్త వీడియో పాఠాలను విడుదల చేస్తారు. వారానికి సుమారు గంటపాటు రికార్డెడ్ కంటెంట్ అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు తమకు అనుకూలమైన సమయంలో వీటిని వీక్షించవచ్చు. ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, 6 నుంచి 7 గంటల వరకు లేదా 7 నుంచి 8 గంటల వరకు మూడు సమయాల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తారు. కోర్సు ప్రారంభమైన తర్వాత విద్యార్థులకు వారి తరగతి సమయాలను తెలియజేస్తారు. మొత్తం నాలుగు ఆన్‌లైన్ అసైన్‌మెంట్లు ఉంటాయి.

ప్రతి రెండు వారాలకు ఒక అసైన్‌మెంట్ విడుదల చేస్తారు. దాన్ని పూర్తి చేయడానికి రెండు వారాల సమయం ఇస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలో అందించిన ఈ-మెయిల్ ద్వారా విద్యా సామగ్రిని పొందవచ్చు. ఇప్పటికే ఐఐటీ మద్రాస్ స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా 6,500కు పైగా భాగస్వామ్య పాఠశాలల్లో సుమారు 2.25 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమాన్ని ఏడాదిలో నాలుగు విడతలుగా జనవరి, ఏప్రిల్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో నిర్వహిస్తున్నారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

జనవరి 2027 బ్యాచ్‌లో చేరాలనుకునే విద్యార్థులు ఐఐటీ మద్రాస్ అధికారిక స్కూల్ కనెక్ట్ వెబ్‌సైట్ https://code.iitm.ac.in/schoolconnect/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక్కో కోర్సుకు రూ.500 చెల్లించాలి. దరఖాస్తు చేసుకునే ముందు ఎంపిక చేసుకున్న కోర్సుకు సంబంధించిన అర్హత నిబంధనలను పరిశీలించాలని ఐఐటీ మద్రాస్ సూచించింది.

Advertisement
Advertisement