త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Safran | తెలంగాణకు ఏరోస్పేస్ రంగంలో మరో భారీ పెట్టుబడి..!

Safran | ‎హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఏరోస్పేస్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత విమాన ఇంజిన్ల తయారీ సంస్థ సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ తెలంగాణలో సుమారు రూ.4,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది.

S

Telangana | Published On Nov 21, 2026, 4.43 pm IST

Safran | తెలంగాణకు ఏరోస్పేస్ రంగంలో మరో భారీ పెట్టుబడి..!
Advertisement

‎సఫ్రాన్ సంస్థ నుంచి రూ.4,000 కోట్ల పెట్టుబడికి ప్రతిపాదన
‎‎డిసెంబర్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ఎంఓయూ కుదిరే అవకాశం
‎‎ఫ్రాన్స్‌లోని సఫ్రాన్ తయారీ కేంద్రాన్ని సందర్శించిన భట్టి విక్రమార్క
‎
Safran | ‎త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఏరోస్పేస్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత విమాన ఇంజిన్ల తయారీ సంస్థ సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ తెలంగాణలో సుమారు రూ.4,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ భారీ పెట్టుబడి ప్రతిపాదన కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో ఏరోస్పేస్, విమాన విడిభాగాల తయారీ రంగాలకు మరింత ఊతం లభించనుంది. డిసెంబర్ 2026లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ఈ పెట్టుబడికి సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరే అవకాశం ఉంది.
‎
‎ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా శనివారం పారిస్ సమీపంలోని ఎవ్రీ-కార్బెల్‌లో ఉన్న సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ తయారీ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు, ఇప్పటికే కొనసాగుతున్న కార్యకలాపాల విస్తరణ, కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు. బోయింగ్, ఎయిర్‌బస్ వంటి అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలకు ఇంజిన్లను సరఫరా చేస్తున్న సఫ్రాన్ వంటి ప్రపంచ స్థాయి సంస్థ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి కీలక పరిణామం.
‎
‎హైదరాబాద్‌లో సఫ్రాన్ సంస్థ ఇప్పటికే గణనీయమైన స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు వేగంగా అనుమతులు కల్పించే ప్రభుత్వ విధానాలు తెలంగాణకు ప్రధాన బలమని వివరించారు. సఫ్రాన్ ప్రతినిధులతో జరిగిన సమావేశం ఎంతో ఫలప్రదంగా సాగిందని, డిసెంబర్‌లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సుకు పారిస్ నుంచి సంస్థ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించినట్లు తెలిపారు.
‎
‎హైదరాబాద్‌లో సఫ్రాన్ ఇప్పటికే లీప్ విమాన ఇంజిన్లకు అవసరమైన రొటేటింగ్ పార్ట్స్ తయారీ కేంద్రం, సఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ తయారీ యూనిట్‌తో పాటు విమాన ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రాల్లో ఒకటైన లీప్ ఎంఆర్‌ఓ (MRO) సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తన తయారీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సంస్థ ఆసక్తి చూపుతోంది.
‎
‎సఫ్రాన్ సంస్థ అంతర్జాతీయ కార్యకలాపాలు, పౌర, సైనిక విమానాల ఇంజిన్ల రూపకల్పన, తయారీ, నిర్వహణ విధానాలను ఉప ముఖ్యమంత్రికి సంస్థ ప్రతినిధులు వివరించారు. అనంతరం తయారీ విభాగాన్ని సందర్శించిన భట్టి విక్రమార్క విమాన ఇంజిన్ల విడిభాగాల తయారీ, అసెంబ్లీ ప్రక్రియలను పరిశీలించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత కచ్చితత్వంతో కూడిన విడిభాగాలను తయారు చేస్తున్న విధానాలను ప్రత్యక్షంగా వీక్షించారు.
‎
‎ఈ పర్యటనలో డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, సఫ్రాన్ సంస్థ ఇండస్ట్రియల్ అండ్ సప్లై చైన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లారెంట్ మజౌ, ఇండస్ట్రియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రొటేటింగ్ పార్ట్స్ డైరెక్టర్ జూలియన్ డి'ఒరాజియో తదితరులు పాల్గొన్నారు.
‎
‎రూ.4,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనను ఖరారు చేసేందుకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ సఫ్రాన్ సంస్థ ప్రతినిధులతో తదుపరి సంప్రదింపులు కొనసాగించనుంది. ఈ పెట్టుబడి సాకారమైతే తెలంగాణలో ఏరోస్పేస్ తయారీ రంగం మరింత విస్తరించడంతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు కొత్త మార్గాలు ఏర్పడనున్నాయి.
‎

Advertisement
Advertisement