త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Credit Cards | క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ హిడెన్ ఛార్జీలు తెలియకపోతే న‌ష్టపోతారు..

Credit Cards | ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ అంటే కేవలం సౌకర్యం మాత్రమే కాకుండా, చాలామందికి అవసరంగా మారింది. షాపింగ్ చేయాలన్నా, హోటళ్లలో తినాలన్నా, పెద్ద మొత్తంలో ఆన్‌లైన్ చెల్లింపులు చేయాలన్నా ప్రజలు ఎలాంటి ఆలోచన లేకుండా క్రెడిట్ కార్డ్‌ల‌ను ఉపయోగిస్తున్నారు.

S

Business | Published On Jul 18, 2026, 3.51 pm IST

Credit Cards | క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ హిడెన్ ఛార్జీలు తెలియకపోతే న‌ష్టపోతారు..
Advertisement

Credit Cards | ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ అంటే కేవలం సౌకర్యం మాత్రమే కాకుండా, చాలామందికి అవసరంగా మారింది. షాపింగ్ చేయాలన్నా, హోటళ్లలో తినాలన్నా, పెద్ద మొత్తంలో ఆన్‌లైన్ చెల్లింపులు చేయాలన్నా ప్రజలు ఎలాంటి ఆలోచన లేకుండా క్రెడిట్ కార్డ్‌ల‌ను ఉపయోగిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డ్ వల్ల లాభాలే కాదు, భారీ ఆర్థిక భారం కూడా పడే అవకాశం ఉంటుందని చాలా మందికి తెలియదు. కార్డుల‌ను జారీ చేసే బ్యాంకులు, కంపెనీలు అందించే సేవల కోసం అనేక రకాల హిడెన్ ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. కానీ చాలా మంది కస్టమర్లు వీటిపై పెద్దగా దృష్టి పెట్టరు. కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకున్న వెంటనే ఎదురయ్యే మొదటి ఛార్జీలు జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఛార్జీలు. చాలా కంపెనీలు లైఫ్‌టైమ్ ఫ్రీ పేరుతో కార్డులను ప్రచారం చేసినప్పటికీ, ప్రీమియం కార్డులపై భారీ జాయినింగ్ ఫీజుల‌ను వసూలు చేస్తుంటాయి. అలాగే కార్డ్‌ను యాక్టివ్‌గా కొనసాగించేందుకు ప్రతి ఏడాది యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీ కూడా చాలా కార్డులపై చెల్లించాల్సి ఉంటుంది.

వ‌డ్డీ రేట్లు అధికం..

క్రెడిట్ కార్డ్‌ల‌పై వడ్డీ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నెలాఖరులో మొత్తం బిల్లు చెల్లించకుండా కేవలం మినిమమ్ డ్యూ మాత్రమే చెల్లిస్తే, మిగిలిన మొత్తంపై బ్యాంకులు వెంటనే వడ్డీ విధించడం ప్రారంభిస్తాయి. ఈ వడ్డీ రేటు వార్షికంగా 36 నుంచి 45 శాతం వరకు ఉంటుంది. దీంతో చిన్న బకాయి కూడా కొద్ది రోజుల్లోనే పెద్ద మొత్తంగా మారుతుంది. చాలామందికి తెలియని మరో విషయం క్రెడిట్ కార్డ్‌తో ఏటీఎం నుంచి నగదు కూడా తీసుకోవడం. అయితే ఇది చాలా ఖరీదైన వ్యవహారం. నగదు తీసుకున్న వెంటనే ఆ మొత్తంపై అదే రోజు నుంచి భారీ వడ్డీని లెక్కిస్తారు. దీనికి అదనంగా క్యాష్ అడ్వాన్స్ ఫీజు పేరుతో ప్రత్యేక ట్రాన్సాక్షన్ ఛార్జీల‌ను కూడా బ్యాంకులు వసూలు చేస్తాయి. వాహనాల్లో పెట్రోల్ లేదా డీజిల్ నింపేటప్పుడు కూడా క్రెడిట్ కార్డ్ వాడే వారు జాగ్రత్తగా ఉండాలి. చాలా కార్డులపై పెట్రోల్ పంప్ సర్‌చార్జ్ విధించే అవకాశం ఉంటుంది. ఇది సాధారణంగా మొత్తం బిల్లులో సుమారు 1 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. కొన్ని కంపెనీలు ఈ సర్‌చార్జ్‌ను మాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ, అందుకు ప్రత్యేక నిబంధనలు, లావాదేవీ పరిమితులు ఉంటాయి.

విదేశీ లావాదేవీల‌ను నిర్వ‌హిస్తే..

విదేశీ పర్యటనలు, అంతర్జాతీయ వెబ్‌సైట్లలో షాపింగ్ చేసే వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. అయితే విదేశాల్లో లేదా విదేశీ కరెన్సీలో క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేస్తే, బ్యాంకులు ఫారెక్స్ మార్కప్ ఫీజును వసూలు చేస్తాయి. దీన్ని కరెన్సీ మార్పిడి ఛార్జీగా పరిగణిస్తారు. సాధారణంగా ఖర్చు చేసిన విదేశీ కరెన్సీ మొత్తంలో 2 నుంచి 4.5 శాతం వరకు ఈ ఫీజు ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు కొన్ని బ్యాంకులు నిర్ణయించిన క్రెడిట్ లిమిట్ కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేసే అవకాశం కల్పిస్తాయి. దీన్నే ఓవ‌ర్ లిమిట్ ఫెసిలిటీ అంటారు. అయితే ఈ సౌకర్యం ఉచితం కాదు. క్రెడిట్ లిమిట్ దాటిన వెంటనే ఓవర్‌లిమిట్ ఫీజు విధిస్తారు. ఇది కనీసం రూ.500 లేదా లిమిట్ మించిన మొత్తంలో నిర్దిష్ట శాతంగా ఉంటుంది. అందువ‌ల్ల ఈ ఫీచ‌ర్ ఆన్ అయి ఉంటే వెంట‌నే ఆఫ్ చేయండి.

ఆల‌స్యంగా బిల్లు చెల్లిస్తే..

అలాగే బిల్లు గడువులోపు చెల్లించకపోతే లేట్ పేమెంట్ ఫీజును విధిస్తారు. ఇది బకాయి మొత్తాన్ని బట్టి మారుతుంది. ఈ ఫీజుతోపాటు క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డ్ అంటే రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. సరిగ్గా ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాల‌ను అందిస్తుంది. కానీ నిబంధనలు తెలియకుండా వాడితే భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను పూర్తిగా చదవడం, అన్ని ఛార్జీల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడే ఈ హిడెన్ ఛార్జీల నుంచి తప్పించుకుని క్రెడిట్ కార్డ్‌ను తెలివిగా ఉపయోగించుకునే అవ‌కాశాలు ఉంటాయి.

Advertisement
Advertisement