త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIP | మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో సిప్ వేస్తే రూ.1 కోటి అయ్యేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంది..?

SIP | డ‌బ్బులు పొదుపు చేసుకునేందుకు గాను గ‌తంలో ప్ర‌జలు ఎక్కువ‌గా బ్యాంకులు, పోస్టాఫీసుల‌పై ఆధార‌ప‌డే వారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పీపీఎఫ్ వంటి అనేక ర‌కాల స్కీముల్లో డ‌బ్బుల‌ను అధికంగా పొదుపు చేసుకునేవారు. కానీ మ్యుచువ‌ల్ ఫండ్స్ రాక‌తో వీటిల్లో పెట్టుబ‌డి పెట్టే వారి సంఖ్య రోజు రోజుకీ గ‌ణ‌నీయంగా పెరిగిపోయింద‌ని చెప్ప‌వ‌చ్చు.

S

Business | Published On Dec 26, 2025, 4.00 pm IST

SIP | మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో సిప్ వేస్తే రూ.1 కోటి అయ్యేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంది..?
Advertisement

SIP | డ‌బ్బులు పొదుపు చేసుకునేందుకు గాను గ‌తంలో ప్ర‌జలు ఎక్కువ‌గా బ్యాంకులు, పోస్టాఫీసుల‌పై ఆధార‌ప‌డే వారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పీపీఎఫ్ వంటి అనేక ర‌కాల స్కీముల్లో డ‌బ్బుల‌ను అధికంగా పొదుపు చేసుకునేవారు. కానీ మ్యుచువ‌ల్ ఫండ్స్ రాక‌తో వీటిల్లో పెట్టుబ‌డి పెట్టే వారి సంఖ్య రోజు రోజుకీ గ‌ణ‌నీయంగా పెరిగిపోయింద‌ని చెప్ప‌వ‌చ్చు. మొద‌ట్లో మ్యుచువ‌ల్ ఫండ్స్ అంటే చాలా మందికి అర్థం అయ్యేవి కావు. వాటిల్లో పెడితే డ‌బ్బులు పోగొట్టుకోవ‌డ‌మే త‌ప్ప రావ‌ని అనుకునేవారు. కానీ అదంతా వ‌ట్టిదేన‌ని, దీర్ఘ‌కాలం పాటు మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెడితే బ్యాంకులు, పోస్టాఫీసుల క‌న్నా ఎన్నో రెట్ల అధిక మొత్తంలో డబ్బును ఆదాయంగా పొంద‌వ‌చ్చ‌ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది. దీంతో మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో చాలా మంది పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే పెట్టుబ‌డులు పెట్టేవారి కోసం అనేక ర‌కాల ఫండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

12 శాతం రిట‌ర్న్స్ అయితే..

అయితే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో రూ.1 కోటి మేర డ‌బ్బును మ్యుచువ‌ల్ ఫండ్స్ ద్వారా సంపాదించాలంటే నెల‌కు ఎంత మొత్తంలో సిప్ వేయాలి..? ఆ డబ్బు కోటి రూపాయ‌లుగా మారేందుకు ఎంత కాలం ప‌డుతుంది..? ఏడాదికి ఎంత శాతం మేర రిట‌ర్న్స్‌ను ఆశించ‌వ‌చ్చు..? అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే ఇందుకు ఫండ్స్ నిపుణులు స‌మాధానాలు చెబుతున్నారు. సాధార‌ణంగా చాలా మంది లంప్స‌మ్ అమౌంట్ క‌న్నా సిప్ ల‌నే అధికంగా వేస్తుంటారు. సిప్ (Systematic Investment Plan) వేయ‌డం వ‌ల్ల అధిక మొత్తంలో ఒకేసారి డ‌బ్బుల‌ను పెట్టాల్సిన పని ఉండ‌దు. నెల‌కు కావ‌ల్సినంత మొత్తాన్ని పెట్టుబ‌డి పెడుతూ వెళ్ల‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో మ‌నం పెట్టే పెట్టుబ‌డి, ఫండ్ ర‌కం, అందులో వ‌చ్చే రిట‌ర్న్స్ ను బ‌ట్టి మ‌న డ‌బ్బు పెరుగుతుంది. అయితే రూ.1 కోటి జ‌మ చేయాలంటే నెల‌కు రూ.10వేల సిప్ వేస్తే 20 ఏళ్ల‌లో మ‌నం పెట్టిన మొత్తం రూ.24 ల‌క్ష‌లు అవుతుంది. దీనికి మ‌నం ఎంచుకున్న ఫండ్‌కు గాను ఏడాదికి 12 శాతం రిట‌ర్న్స్ వ‌స్తాయ‌నుకుంటే అప్పుడు మ‌నం పెట్టే మొత్తానికి ఆ వ్య‌వ‌ధిలోగా రూ.75.9 ల‌క్ష‌ల రిట‌ర్న్స్ వ‌స్తాయి. దీంతో మ‌న పెట్టుబ‌డి, రిట‌ర్న్స్ అన్నీ క‌లిపి ఆ మొత్తం రూ.1 కోటి అవుతుంది. ఇలా మ‌నం వేసే సిప్‌ను లెక్కించాల్సి ఉంటుంది.

15 శాతం లేదా 18 శాతం అనుకుంటే..

ఇక అదే సిప్ మొత్తాన్ని.. అంటే.. రూ.10వేల‌ను ఏటా 15 శాతం రిట‌ర్న్స్ వ‌చ్చే ఫండ్‌లో పెడితే అప్పుడు ఆ మొత్తం రూ.1 కోటి కావాలంటే ఆ కాల వ్యవ‌ధి కాస్త త‌గ్గుతుంది. రిట‌ర్న్స్ శాతం పెరిగింది క‌నుక మ‌న‌కు కాస్త త‌క్కువ వ్య‌వధిలోగానే మ‌నం అనుకున్న మొత్తం రూ.1 కోటి అవుతుంది. ఈ క్ర‌మంలో 18 ఏళ్ల‌కు మ‌నం పెట్టిన మొత్తం రూ.21.6 ల‌క్ష‌లు అయితే, రిట‌ర్న్స్ రూ.88.8 ల‌క్ష‌లు వ‌స్తాయి. మొత్తం క‌లిపి రూ.1.10 కోట్లు అవుతుంది. అలాగే ఏటా 18 శాతం రిట‌ర్న్స్ వ‌చ్చే ఫండ్‌లో నెల‌కు రూ.10వేలు పెట్టుబ‌డితే మ‌నం 16 ఏళ్ల‌లో పెట్టిన మొత్తం రూ.19.2 ల‌క్ష‌లు అవుతుంది. రిట‌ర్న్స్ రూ.92.0 ల‌క్ష‌లు వ‌స్తాయి. మొత్తం క‌లిపి రూ.1.11 కోట్లు అవుతుంది. అంటే ఇక్క‌డ మ‌ళ్లీ రిట‌ర్న్స్ శాతం పెరిగింది క‌నుక అంత‌కు ముందు కన్నా ఇంకా త‌క్కువ వ్య‌వధిలోనే మ‌నం పెట్టిన మొత్తం రూ.1 కోటి అవుతుంది. ఈ క్ర‌మంలో పైన ఉదాహ‌ర‌ణ‌కు ఆ మొత్తం రూ.1 కోటి అయ్యేందుకు 16 ఏళ్ల స‌మ‌యం ప‌ట్ట‌డం విశేషం.

20 శాతం రిట‌ర్న్స్ వ‌స్తే..?

అలాగే ఏడాదికి 20 శాతం మేర రిట‌ర్న్స్ ఇచ్చే మ్యుచువల్ ఫండ్‌లో మ‌నం నెల‌కు రూ.10వేలు సిప్ వేస్తే అప్పుడు ఆ మొత్తంతోపాటు రిట‌ర్న్స్ క‌లిపి రూ.1 కోటి అయ్యేందుకు 15 ఏళ్లే ప‌డుతుంది. ఆ వ్య‌వ‌ధిలో మనం పెట్టిన మొత్తం రూ.18 ల‌క్ష‌లు అయితే రిట‌ర్న్స్ రూ.95.4 ల‌క్ష‌లు వ‌స్తాయి. మొత్తం క‌లిపి రూ.1.13 కోట్లు అవుతుంది. ఇలా సిప్ లేదా మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో మ‌న‌కు వ‌చ్చే రిట‌ర్న్స్ ను లెక్కించాల్సి ఉంటుంది. అయితే అన్ని ర‌కాల ఫండ్స్ కూడా ప్ర‌తి ఏడాది స్థిరంగా రిట‌ర్న్స్ ను ఇవ్వ‌లేవు. కానీ ఒక శాతం అటు ఇటుగా మంచి రిట‌ర్న్స్ ఇచ్చే ఫండ్స్‌ను ఎంచుకుని వాటిల్లో సిప్ వేస్తే చ‌క్క‌ని లాభాల‌ను పొంద‌వ‌చ్చు. పైగా రిటైర్ అయ్యే స‌మ‌యానికి చేతిలో రూ.1 కోటి మేర స‌ర్‌ప్ల‌స్ ఫండ్ ఉంటుంది. ఇది పిల్ల‌ల ఉన్న‌త చ‌దువులు లేదా పెళ్లిళ్ల‌కు, వారు స్థిర‌ప‌డేందుకు లేదా వ్య‌క్తిగ‌తంగా రిటైర్ అయ్యేందుకు స‌హాయ ప‌డుతుంది. ఈ విధంగా ప్లాన్ చేస్తే మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement