త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Investment | రూ.19కి షేర్ల‌ను కొని రూ.650కి అమ్మాడు.. ప్ర‌ముఖ ఇన్వెస్ట‌ర్ చెబుతున్న స‌క్సెస్ టిప్స్‌..

Investment | స్టాక్ మార్కెట్ల‌లో ప్ర‌స్తుతం ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ చేస్తున్న పెట్టుబ‌డిదారుల సంఖ్య అధికంగా పెరుగుతోంది. ముఖ్యంగా మిల్లెనియ‌ల్స్, జెన్ జీ త‌రం స్టాక్ మార్కెట్ల‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్న‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. అయితే స్టాక్ మార్కెట్ల‌లో ట్రేడింగ్ చేయ‌డం లేదా పెట్టుబ‌డి పెట్ట‌డం అంటే అంత తేలిగ్గా తీసుకోకూడ‌దు. దానికి స‌రైన ప్లానింగ్ అవ‌స‌రం.

S

Business | Published On May 18, 2026, 1.15 pm IST

Investment | రూ.19కి షేర్ల‌ను కొని రూ.650కి అమ్మాడు.. ప్ర‌ముఖ ఇన్వెస్ట‌ర్ చెబుతున్న స‌క్సెస్ టిప్స్‌..
Advertisement

Investment | స్టాక్ మార్కెట్ల‌లో ప్ర‌స్తుతం ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ చేస్తున్న పెట్టుబ‌డిదారుల సంఖ్య అధికంగా పెరుగుతోంది. ముఖ్యంగా మిల్లెనియ‌ల్స్, జెన్ జీ త‌రం స్టాక్ మార్కెట్ల‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్న‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. అయితే స్టాక్ మార్కెట్ల‌లో ట్రేడింగ్ చేయ‌డం లేదా పెట్టుబ‌డి పెట్ట‌డం అంటే అంత తేలిగ్గా తీసుకోకూడ‌దు. దానికి స‌రైన ప్లానింగ్ అవ‌స‌రం. ఒక విజ‌న్‌తో ముందుకు సాగాల్సి ఉంటుంది. అలాగే ధైర్యం అవ‌స‌రం. మార్కెట్ల‌లో వ‌చ్చే హెచ్చు త‌గ్గుల‌ను త‌ట్టుకుని ధైర్యంగా నిల‌బ‌డ‌గ‌ల‌గాలి. ఇక ఓపిక కూడా అవ‌స‌ర‌మే. ఓపిక లేక‌పోతే స‌రైన స‌మ‌యంలో లాభాల‌ను పొంద‌లేరు. లేదా లాభం రాక‌ముందే న‌ష్టాల్లోనూ వైదొలగుతారు. అందువ‌ల్ల ఓపిక చాలా ముఖ్యం. ఈ అంశాల‌ను దృష్టిలో ఉంచుకుని స్టాక్ మార్కెట్ల‌లో ప్ర‌వేశిస్తే ఎవ‌రైనా స‌రే దీర్ఘ‌కాలంలో సంప‌ద‌ను సృష్టించ‌వ‌చ్చు. ఇదే విష‌యాన్ని ప్ర‌ముఖ ఇన్వెస్ట‌ర్ రామ్ దేవ్ అగ‌ర్వాల్ వెల్ల‌డించారు. ఒక‌ప్పుడు తాను భార‌తీ ఎయిర్ టెల్ షేర్‌ను ఎంత‌కు కొన్న‌దీ, త‌రువాత ఎంత కాలం హోల్డ్ చేసిందీ, త‌రువాత ఎంత లాభానికి విక్రయించింది తెలిపి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

25 రెట్ల లాభం..

ఇటీవ‌ల నిర్వ‌హించిన గ్రో ఇండియా ఇన్వెస్ట‌ర్ ఫెస్టివ‌ల్ 2026లో పాల్గొన్న రామ్ దేవ్ అగ‌ర్వాల్ స్టాక్ మార్కెట్ల‌లో త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. ముఖ్యంగా భార‌తీ ఎయిర్ టెల్ షేర్ల‌ను కొన‌డం, అందులో వ‌చ్చిన లాభాల గురించి వివ‌రించారు. 2003లో భార‌తీ ఎయిర్‌లెట్ షేర్ ధ‌ర రూ.19 నుంచి రూ.30 మ‌ధ్య ఉంద‌ని, ఇప్పుడు అది రూ.1800కి పైగా ఉంద‌ని తెలిపారు. అయితే అప్ప‌ట్లో తాను ఈ షేర్ల‌ను రూ.19 నుంచి రూ.30 మ‌ధ్య కొన్నాన‌ని, వాటి ధ‌ర రూ.650కు చేరుకున్నాక 25 రెట్ల లాభానికి విక్ర‌యించాన‌ని తెలిపారు. కానీ ఆ త‌రువాత నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆ షేర్ ధ‌ర ఇంకా 3 రెట్లు పెరిగింద‌న్నారు. అయితే స్టాక్ మార్కెట్ల‌లో స్వ‌ల్ప‌కాలిక రాబ‌డుల కోసం ఎదురు చూడ‌కూడ‌ద‌ని, అవి దీర్ఘ‌కాలంలో భారీ ఎత్తున సంప‌ద‌ను సృష్టిస్తాయ‌ని, అందువ‌ల్ల దీర్ఘ‌కాలం పాటు పెట్టుబ‌డి పెట్టే ఓపిక ఉంటేనే స్టాక్ మార్కెట్ల‌లో ప్ర‌వేశించాల‌ని అన్నారు. దీనికి చాలా ఓపిక‌, స‌హ‌నం అవ‌స‌ర‌మ‌ని తెలిపారు.

న‌మ్మ‌కం కోల్పోకూడ‌దు..

2003లో దేశ జ‌నాభా 100 కోట్ల‌కు పైగా ఉంద‌ని, కానీ కేవ‌లం 5 కోట్ల ఫిక్స్డ్ లైన్ ఫోన్లు మాత్ర‌మే ఉండేవ‌ని అన్నారు. అప్పుడు భార‌తీ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ.5వేల కోట్లుగా ఉంద‌ని, ఆ స‌మ‌యంలోనే ఆ కంపెనీ వ‌చ్చే 5 ఏళ్ల‌లో రూ.28వేల కోట్ల లాభం ఆర్జిస్తుంద‌ని తాను అంచ‌నా వేశాన‌ని రామ్ దేవ్ అగ‌ర్వాల్ తెలిపారు. తాను అనుకున్న‌ట్లుగానే కంపెనీకి భారీ ఎత్తున ఆదాయం వ‌చ్చింద‌ని, దీంతో పెట్టుబ‌డిదారులు భారీగా లాభ‌ప‌డ్డార‌ని అన్నారు. అయితే అప్ప‌ట్లో ఆ కంపెనీ షేర్ల‌ను కొన్న‌ప్పుడు తోటి ఇన్వెస్ట‌ర్లు, స్నేహితులు త‌న నిర్ణ‌యం త‌ప్ప‌ని చెప్పి విమ‌ర్శించార‌ని, కానీ త‌న ఎట్టి ప‌రిస్థితిలోనూ త‌న న‌మ్మ‌కాన్ని కోల్పోలేద‌ని, చివ‌రకు తాను అనుకున్న‌ట్లే భారీ ఎత్తున లాభం వ‌చ్చింద‌ని తెలిపారు. అందువ‌ల్ల స‌రైన ప్ర‌ణాళిక‌, ల‌క్ష్యం, విజ‌న్‌తోపాటు ధైర్యం కూడా ఉండాల‌న్నారు. ఇక చాలా మంది స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టి స్వ‌ల్ప కాలంలో న‌ష్టాల‌కు భ‌య‌ప‌డి లేదా కాస్త లాభం రాగానే ఆశ‌ప‌డి బ‌య‌ట‌కు వ‌స్తార‌ని, కానీ అస‌లైన సంప‌ద 15 ఏళ్ల త‌రువాతే సృష్టించ‌బ‌డుతుంద‌ని, అప్ప‌టి వ‌ర‌కు ధైర్యంగా వేచి ఉండాల‌ని సూచించారు. ఇక ప్ర‌స్తుతం ఈ-కామ‌ర్స్ రంగాన్ని చూస్తుంటే త‌న‌కు ఒక‌ప్పుడు భార‌తీ ఎయిర్‌టెల్ కంపెనీని చూసిన‌ట్లు ఉంద‌ని, అందువ‌ల్ల పెట్టుబ‌డిదారులు ఈ రంగంపై దృష్టి సారించాల‌ని అన్నారు.

Advertisement
Advertisement