త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Inherited Property | వారసత్వ ఆస్తి విక్రయంపై ఎల్‌టీసీజీ పన్ను.. ఉమ్మడి యజమానులకు ఎలా వర్తిస్తుంది?

Inherited Property | తరతరాలుగా వారసత్వంగా వస్తున్న స్థిరాస్తిని విక్రయించినప్పుడు వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై (ఎల్‌టీసీజీ) ప్రతి ఉమ్మడి యజమాని తన వాటా మేరకు పన్ను చెల్లించాలి. అసలు యజమాని ఆస్తిని కొనుగోలు చేసిన తేదీ నుంచి 24 నెలలకు మించి ఉంటే దీర్ఘకాలిక మూలధన ఆస్తిగా పరిగణిస్తారు. ఒక యజమాని పొందే పన్ను మినహాయింపు మరో యజమానికి స్వయంచాలకంగా వర్తించదు.

S

Business | Published On Nov 24, 2026, 5.28 pm IST

Inherited Property | వారసత్వ ఆస్తి విక్రయంపై ఎల్‌టీసీజీ పన్ను.. ఉమ్మడి యజమానులకు ఎలా వర్తిస్తుంది?
Advertisement

Inherited Property | తరతరాలుగా వారసత్వంగా వస్తున్న స్థిరాస్తిని విక్రయించినప్పుడు వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై (ఎల్‌టీసీజీ) ప్రతి ఉమ్మడి యజమాని తన వాటా మేరకు పన్ను చెల్లించాలి. అసలు యజమాని ఆస్తిని కొనుగోలు చేసిన తేదీ నుంచి 24 నెలలకు మించి ఉంటే దీర్ఘకాలిక మూలధన ఆస్తిగా పరిగణిస్తారు. ఒక యజమాని పొందే పన్ను మినహాయింపు మరో యజమానికి స్వయంచాలకంగా వర్తించదు.

ఉమ్మ‌డి ఆస్తిపై ఎంత ప‌న్ను చెల్లించాలి..?

దేశంలో తరతరాలుగా వారసత్వంగా వస్తున్న పూర్వీకుల ఆస్తులను సోదరులు, పిల్లలు, ఇతర చట్టబద్ధ వారసులు ఉమ్మడిగా కలిగి ఉండడం సాధారణం. ఇలాంటి ఆస్తులను విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై ఆదాయపు పన్ను ఎలా వర్తిస్తుందనే విషయంలో స్పష్టత అవసరం. ఇద్దరు వ్యక్తులు ఒక ఆస్తిని సమానంగా కలిగి ఉండి విక్రయిస్తే, ఒక్కొక్కరు తమకు వచ్చిన లాభంలో 50 శాతానికి మాత్రమే పన్ను చెల్లించాలి. అలాగే ఒక యజమాని పొందిన పన్ను మినహాయింపు మరొకరికి వర్తించదు. ప్రతి ఒక్కరూ తమ వాటా మూలధన లాభాలపై విడివిడిగా పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా, ఆస్తి వారసత్వంగా వచ్చిన తేదీ నుంచి కాకుండా, అసలు యజమాని కొనుగోలు చేసిన తేదీ నుంచి హోల్డింగ్ పీరియడ్‌ను లెక్కిస్తారు. 24 నెలలకు మించి ఉంటే దానిని దీర్ఘకాలిక మూలధన ఆస్తిగా పరిగణిస్తారు.

ఉదాహ‌ర‌ణ చూస్తే..

ఉదాహరణకు.. ఇద్దరు సోదరులు ఒక పూర్వీకుల ఆస్తిని 50:50 నిష్పత్తిలో కలిగి ఉండి, దానిని రూ.5 కోట్లకు విక్రయించారని అనుకుందాం. మొత్తం విక్రయ విలువలో ఒక్కొక్కరి వాటా రూ.2.5 కోట్లు. అసలు యజమాని ఆస్తిని రూ.1 కోట్లకు కొనుగోలు చేసినట్లయితే, ఒక్కొక్కరి వాటా ప్రకారం మూలధన లాభం రూ.2 కోట్లుగా ఉంటుంది. ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా వర్తించే ఎల్‌టీసీజీ పన్ను రేటు 12.5 శాతంగా తీసుకుంటే, ఒక్కొక్కరు రూ.25 లక్షల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ లెక్కలో సర్‌చార్జి, సెస్‌లను పరిగణనలోకి తీసుకోలేదు. కాబట్టి వాస్తవ పన్ను మొత్తం మారుతుంది.

ఆస్తి మార్కెట్ విలువను ఎలా లెక్కించాలి?

వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించినప్పుడు, మూలధన లాభాలను లెక్కించేందుకు వారసత్వంగా పొందిన సమయంలో ఉన్న మార్కెట్ విలువను కాకుండా, గత యజమాని ఆస్తిని కొనుగోలు చేసిన అసలు ధరను పరిగణనలోకి తీసుకోవాలి. అయితే ఆస్తిని 2001 ఏప్రిల్ 1వ తేదీకి ముందు కొనుగోలు చేసి ఉంటే, ఆ తేదీ నాటి మార్కెట్ విలువను కొనుగోలు ధరగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు రిజిస్టర్డ్ వాల్యూయర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా విలువను నిర్ధారించాల్సి ఉంటుంది. అలాగే అర్హత కలిగిన ఆస్తి మెరుగుదల ఖర్చులను కూడా మూలధన లాభాల లెక్కింపులో పరిగణనలోకి తీసుకోవచ్చు.

Advertisement
Advertisement