Gold Rates | హైదరాబాద్ : పసిడి ప్రియులకు( Gold Lovers ) షాకింగ్ న్యూస్. బంగారం ధరలు( Gold Rates ) మళ్లీ భగ్గుమంటున్నాయి. సోమవారం పసిడి ధరలు ఆకాశాన్నంటాయి. పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 1.37 లక్షలు దాటేసింది. దీంతో గోల్డ్ లవర్స్ లబోదిబోమంటున్నారు. అసలు బంగారం( Gold ) కొనగలమా..? అని ముక్కున వేలేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఇలా.. హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,430కు చేరుకోగా, 22 క్యారెట్ల నాణ్యమైన బంగారం ధర రూ. 1,25,850గా ఉంది. కిలో వెండి ధర రూ. 1,96,948 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,880 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,23,650గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,35,930 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,24,600గా ఉంది. అమెరికా డాలర్ బలహీనపడడం, ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం తదితర కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక కేంద్ర బ్యాంకుల పసిడి కొనుగోళ్లు, బంగారం, వెండి ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెరగడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వంటి కారణాలు కూడా పుత్తడి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.