త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Prices | ఈ ఏడాదిలో భారీగా దూసుకెళ్తున్న‌ బంగారం ధ‌ర‌లు.. ఎందుకిలా..?

Gold Prices | ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న వేళ పెట్టుబడిదారులకు బంగారం అత్యంత సుర‌క్షిత‌మైన పెట్టుబడిగా మారింది. ఈ వారం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు చరిత్రాత్మక గరిష్ఠాన్ని తాకాయి. స్పాట్ గోల్డ్ ధరలు ఔన్స్‌కు 5,500 డాలర్లను దాటుతూ కొత్త రికార్డును సృష్టించాయి.

S

Business | Published On Jan 30, 2026, 12.24 pm IST

Gold Prices | ఈ ఏడాదిలో భారీగా దూసుకెళ్తున్న‌ బంగారం ధ‌ర‌లు.. ఎందుకిలా..?
Advertisement

Gold Prices | ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న వేళ పెట్టుబడిదారులకు బంగారం అత్యంత సుర‌క్షిత‌మైన పెట్టుబడిగా మారింది. ఈ వారం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు చరిత్రాత్మక గరిష్ఠాన్ని తాకాయి. స్పాట్ గోల్డ్ ధరలు ఔన్స్‌కు 5,500 డాలర్లను దాటుతూ కొత్త రికార్డును సృష్టించాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా సేవర్స్‌, ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే 2026లో ఈ గోల్డ్ రష్ కు కారణాలేంటి? అన్నదానిపై ఆర్థిక నిపుణులు కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు. పెట్టుబడుల ప్రపంచంలో బంగారం ఎప్పటినుంచో సేఫ్ హావెన్ అసెట్ గా గుర్తింపు పొందింది. రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, కొత్త టారిఫ్‌లు వంటి అంశాలు స్టాక్స్‌, కరెన్సీలపై అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాగితపు కరెన్సీలపై నమ్మకం తగ్గి, భౌతిక ఆస్తిగా ఉన్న బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు.

డాల‌ర్ బ‌ల‌హీన ప‌డ‌డం..

పెట్టుబడిదారులే కాకుండా ప్రభుత్వాలూ బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. జేపీ మోర్గాన్ నివేదిక ప్రకారం చైనా, భారత్ వంటి దేశాల కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వలను విభజించుకునే వ్యూహంలో భాగంగా బంగారం కొనుగోళ్లు పెంచాయి. అమెరికన్ డాలర్‌పై ఆధారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ దేశాలు బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ పెరిగి ధరలు మరింత పెరుగుతున్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం ఇటీవల అమెరికన్ డాలర్ నాలుగేళ్ల కనిష్ఠ స్థాయికి చేరింది. బంగారం ధరలు డాలర్‌లోనే నిర్ణయించబడతాయి కాబట్టి, డాలర్ బలహీనపడితే ఇతర కరెన్సీల్లో (పౌండ్, యూరో వంటివి) కొనుగోలు చేసే వారికి బంగారం చ‌వ‌కగా మారుతుంది. ఈ కారణంగా అంతర్జాతీయ డిమాండ్ మరింత పెరిగి బంగారం ధరలు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.

వ‌డ్డీ రేట్లు త‌గ్గ‌డం..

అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇటీవల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు లేదా తగ్గే అవకాశం ఉన్నప్పుడు బ్యాంకు డిపాజిట్లపై వచ్చే లాభాలు తగ్గిపోతాయి. బంగారం వడ్డీ ఇవ్వని ఆస్తి అయినప్పటికీ తక్కువ వడ్డీ వాతావరణంలో అది పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ద్రవ్యోల్బణ భయాలు కూడా బంగారం వైపు పెట్టుబడులను మళ్లిస్తున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం గోల్డ్‌మాన్ శాక్స్ వంటి ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే తమ బంగారం ధర అంచనాలను పెంచాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కొనసాగితే బంగారం ధరలు ఇంకా ఎగబాకే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ప‌లువురు ఆర్థిక విశ్లేషకులు 2026 చివరి నాటికి ఔన్స్‌కు 6,000 డాలర్ల స్థాయిని కూడా బంగారం తాకవచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో 2026లో బంగారం మరోసారి అత్యంత సుర‌క్షిత‌మైన పెట్టుబడిగా నిలుస్తోంది. సేవర్స్‌, ఇన్వెస్టర్లు తమ సంపదను రక్షించుకోవడానికి బంగారాన్ని ఆశ్రయిస్తుండటంతో, రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరలు కీలకంగా మారే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement