త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gautam Adani | కంపెనీ భవిష్యత్తుకు అదానీ బ్లూప్రింట్.. ఏజీఎంలో భారీ ప్ర‌ణాళిక‌లు వెల్ల‌డి..

Gautam Adani | అదానీ గ్రూప్ చైర్మన్ గౌత‌మ్ అదానీ త‌మ సంస్థ వార్షిక షేర్‌హోల్డర్ల సమావేశంలో భారత భవిష్యత్తుకు సంబంధించిన భారీ ప్రణాళికను వివరించారు. ఈ ఏడాది ఏజీఎం ప్రధాన అంశంగా యాక్సిలరేటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లెవరేజింగ్ ఇంటెలిజెన్స్ ను ఆయ‌న‌ ప్రకటించారు.

S

Business | Published On Jun 24, 2026, 12.49 pm IST

Gautam Adani | కంపెనీ భవిష్యత్తుకు అదానీ బ్లూప్రింట్.. ఏజీఎంలో భారీ ప్ర‌ణాళిక‌లు వెల్ల‌డి..
Advertisement

Gautam Adani | అదానీ గ్రూప్ చైర్మన్ గౌత‌మ్ అదానీ త‌మ సంస్థ వార్షిక షేర్‌హోల్డర్ల సమావేశంలో భారత భవిష్యత్తుకు సంబంధించిన భారీ ప్రణాళికను వివరించారు. ఈ ఏడాది ఏజీఎం ప్రధాన అంశంగా యాక్సిలరేటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లెవరేజింగ్ ఇంటెలిజెన్స్ ను ఆయ‌న‌ ప్రకటించారు. దేశ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, డేటా సెంటర్ల వంటి సాంకేతికతలు కలిసి పనిచేసే ద్వంద్వ శక్తులుగా మారాయని పేర్కొన్నారు. భౌతిక మౌలిక వసతులు, డిజిటల్ ఇంటెలిజెన్స్ ఇకపై విడదీయరాని అంశాలుగా మారాయని, ఇవే ఆర్థిక వృద్ధి, జాతీయ పోటీతత్వాన్ని నిర్ణయిస్తాయని చెప్పారు. అసాధారణ స్థాయి పరిశీలన, పర్యవేక్షణ న‌డుమ కూడా గ్రూప్ దూకుడుగా పెట్టుబడులు కొనసాగించిందని ఆయన తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల కోట్లకు పైగా మూలధన వ్యయాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఇది దేశంలో కొత్తగా నమోదైన ప్రైవేట్ రంగ క్యాపెక్స్‌లో 30 శాతానికి పైగా వాటాను సూచిస్తుందని పేర్కొన్నారు. అలాగే రూ.25వేల కోట్ల రైట్స్ ఇష్యూ షేర్‌హోల్డర్ల విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు.

3 గిగావాట్ల డేటా సెంట‌ర్‌..

డిజిటల్ మౌలిక వసతుల రంగంలో కూడా గ్రూప్ భారీ లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. 2030 నాటికి 3 గిగావాట్ల డేటా సెంటర్ ప్లాట్‌ఫామ్‌ను నిర్మించే దిశగా తమ డేటా సెంటర్ వ్యాపారం పయనిస్తోందని అదానీ వెల్లడించారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో గూగుల్ తో గిగావాట్ స్థాయి డేటా సెంటర్ ఒప్పందాన్ని ప్రస్తావించారు. అలాగే మైనింగ్, సిమెంట్, డిఫెన్స్ రంగాల్లో విస్తరణ కొనసాగుతోందని తెలిపారు. రక్షణ రంగంలో లియోనార్డో, ఎంబ్రార్ సంస్థలతో భాగస్వామ్యాలను ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో గ్రూప్ డ్రోన్లు, రక్షణ వ్యవస్థలు కీలక పాత్ర పోషించాయని చెప్పారు. విద్యుత్, ట్రాన్స్‌మిషన్ రంగాల్లో కూడా పెద్ద ప్రణాళికలు కొనసాగుతున్నాయి. అదానీ ఎన‌ర్జీ సొల్యూష‌న్స్ ట్రాన్స్‌మిషన్ ఆర్డర్ బుక్ విలువ రూ.72వేల కోట్లకు చేరిందని తెలిపారు. ఇక అదానీ ప‌వ‌ర్ రూ.2 లక్షల కోట్ల విస్తరణ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, తద్వారా వచ్చే ఐదేళ్లలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 45 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణ‌యించుకున్నట్లు చెప్పారు. అలాగే భూటాన్ లో 5వేల మెగావాట్ల హైడ్రోపవర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. అదానీ అటామిక్ ఎనర్జీ ద్వారా 2035 నాటికి 10 గిగావాట్ల అణుశక్తి సామర్థ్యాన్ని నిర్మించాలని సంకల్పించినట్లు వెల్లడించారు.

1 బిలియ‌న్ ట‌న్నుల కార్గో ల‌క్ష్యంగా..

లాజిస్టిక్స్, రవాణా రంగాల్లో కూడా గ్రూప్ వేగంగా ఎదుగుతోంది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెష‌ల్ ఎక‌నామిక్ జోన్ 2025-26లో 500 మిలియన్ టన్నులకుపైగా కార్గోను నిర్వహించినట్లు తెలిపారు. 2030 నాటికి ఈ పరిమాణాన్ని 1 బిలియన్ టన్నులకు చేర్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు. విళింజం ఇంట‌ర్నేష‌న‌ల్ సీ పోర్టు తన తొలి ఏడాది కార్యకలాపాల్లోనే 10 లక్షల టీఈయూల మార్కును దాటిందని పేర్కొన్నారు. అలాగే న‌వీ ముంబై ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు, లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టులోని కొత్త టెర్మినల్‌ను గ్రూప్ మౌలిక సదుపాయాల పోర్ట్‌ఫోలియోలో కీలక ప్రాజెక్టులుగా వివరించారు. మౌలిక వసతుల అభివృద్ధితోపాటు సంస్థాగత సంస్కరణలపై కూడా అదానీ దృష్టి సారించారు. నిర్వహణ వ్యవస్థలను సరళీకరించడం, కాంట్రాక్టర్ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, కార్మిక సంక్షేమాన్ని మెరుగుపరచడం వంటి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాల పరంగా అదానీ ఫౌండేష‌న్ ప్రస్తుతం 22 రాష్ట్రాల్లోని 7వేల గ్రామాల్లో కోటి మందికి సేవలు అందిస్తోందని తెలిపారు. ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో కూడా గణనీయమైన పెట్టుబడులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement