త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jobs | ఉద్యోగం ఇచ్చేందుకు మ‌నుషుల‌ను ఇంట‌ర్వ్యూ చేస్తున్న ఏఐ.. ఇక నెగ్గ‌డం అంత ఈజీ కాదు..

Jobs | కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేశారా? షార్ట్‌లిస్ట్ అయితే ఇకపై మానవ రిక్రూటర్ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మిమ్మ‌ల్ని ఇంటర్వ్యూ చేసే రోజులు వచ్చేశాయి. ఈజీ-అప్లై జాబ్ బోర్డుల ద్వారా భారీ సంఖ్యలో ఏఐ రూపొందించిన ఉద్యోగ దరఖాస్తులు రావడంతో, రిక్రూటర్లు కూడా వాటిని నిర్వహించేందుకు ఏఐ సహాయాన్ని ఆశ్రయిస్తున్నారు.

S

Technology | Published On Jun 17, 2026, 3.08 pm IST

Jobs | ఉద్యోగం ఇచ్చేందుకు మ‌నుషుల‌ను ఇంట‌ర్వ్యూ చేస్తున్న ఏఐ.. ఇక నెగ్గ‌డం అంత ఈజీ కాదు..
Advertisement

Jobs | కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేశారా? షార్ట్‌లిస్ట్ అయితే ఇకపై మానవ రిక్రూటర్ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మిమ్మ‌ల్ని ఇంటర్వ్యూ చేసే రోజులు వచ్చేశాయి. ఈజీ-అప్లై జాబ్ బోర్డుల ద్వారా భారీ సంఖ్యలో ఏఐ రూపొందించిన ఉద్యోగ దరఖాస్తులు రావడంతో, రిక్రూటర్లు కూడా వాటిని నిర్వహించేందుకు ఏఐ సహాయాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో అనేక సంస్థలు అభ్యర్థుల ప్రాథమిక స్క్రీనింగ్ దశలో చాట్‌బాట్ల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. ఇవి ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజింగ్ లేదా స్క్రీన్‌పై కనిపించే వర్చువల్ అవతార్‌లతో వీడియో చాట్ రూపంలో కొన‌సాగుతున్నాయి. ఉద్యోగ అభ్యర్థులను అంచనా వేయడానికి ఏఐ ఆధారిత నియామక సాధనాలను రిక్రూటర్లు చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ వాటి వినియోగం మరింత విస్తరిస్తోంది. అయితే చాలా మందికి ఏఐ ఉద్యోగ ఇంటర్వ్యూలు అసౌకర్యంగా, కొంత భయానకంగా అనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఈ ధోరణి కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఏఐకి భ‌య‌ప‌డి మ‌ధ్య‌లోనే అవుట్‌..

నియామక వేదిక గ్లాస్‌హౌస్ నిర్వహించిన తాజా పరిశోధన ప్రకారం ఉద్యోగార్థుల్లో ఏఐ ఇంటర్వ్యూలను ఎదుర్కొన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే చాలా మంది అభ్యర్థులు ఈ ప్రక్రియ మధ్యలోనే వైదొలుగుతున్నారు. కొందరి అభిప్రాయం ప్రకారం వారు ఈ విధానాన్ని ఇష్టపడడం లేద‌ని వెల్ల‌డైంది. అయితే కొంద‌రు మాత్రం న‌కిలీ ధ్రువ‌ప‌త్రాల‌తో మ‌ధ్య‌లోనే విర‌మించుకుంటుండ‌గా, కొంద‌రికి ఉద్యోగంపై అస‌లు ఆస‌క్తి లేద‌ని తేలింది. ఏఐ ఇంటర్వ్యూలో ఏం ఎదురవుతుందో, అందులో ఎలా మెరుగ్గా రాణించాలో తెలుసుకోవడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. కెరీర్‌మైండ్స్‌కు చెందిన కెరీర్ కోచ్ అమండా ఆగస్టిన్ తెలిపిన ప్రకారం,ఇంటర్వ్యూ ఫార్మాట్ ఏదైనా అయినా ప్రాథమిక సూత్రాలు మాత్రం మారవ‌ని, ఇంటర్వ్యూకు ముందు ఉద్యోగ వివరణను పూర్తిగా చదవాల‌ని, సంస్థ గురించి పరిశోధన చేయాల‌ని, ఆ సంస్థ ఏ రకమైన నైపుణ్యాలను ఆశిస్తున్నదో అర్థం చేసుకోవాలని అన్నారు. మీరు ఎంత బాగా సిద్ధమైతే, వ్యక్తి బదులు ఏఐతో మాట్లాడుతున్నప్పటికీ మీ సమాధానాలను అంత సమర్థంగా చెప్ప‌గ‌లుగుతార‌ని ఆమె సూచించారు.

ఆత్మీయ సంభాష‌ణ ఉండ‌దు..

ఇప్పటివరకు ఏఐ ఇంటర్వ్యూ చేయకపోతే, మొదటిసారి అది కాస్త అసహజంగా లేదా ఒత్తిడిగా అనిపిస్తుంది. నెదర్లాండ్స్‌కు చెందిన టెస్ట్‌గొరిల్లా సంస్థ రూపొందించిన డెమో ఏఐ ఇంటర్వ్యూను ఒక జర్నలిస్టు ఎదుర్కొన్నాడు. మొదట సమస్య పరిష్కార సామర్థ్యాలను పరీక్షించే ప్రశ్నలు, తర్వాత పని అనుభవాన్ని అంచనా వేసే ప్రశ్నలు వచ్చాయి. అనంతరం ఏఐ రూపొందించిన ఓ మహిళ‌ ముఖం స్క్రీన్‌పై కనిపించింది. మీ గురించి, ఈ పాత్రకు మీరు తీసుకురాగల అనుభవం, నైపుణ్యాలు, సామర్థ్యాల గురించి తెలుసుకోవడమే నా లక్ష్యం అని ఆ అవతార్ తెలిపింది. మూడు ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ఒక్కో ప్రశ్నకు సుమారు రెండు నిమిషాలు కేటాయించాలని సూచించింది. సాధారణ మానవ ఇంటర్వ్యూలతో పోలిస్తే ఇందులో ఆత్మీయ సంభాషణ ఉండదు. పరిచయం పెంచుకునే అవకాశం ఉండదు. చిరునవ్వు నవ్వడం లేదా వాతావరణాన్ని సౌకర్యవంతం చేయడానికి ప్రయత్నించడం ఉపయోగపడదు. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి సరైన ప్రిపరేషన్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు.

విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పాలి..

ఇండీడ్ ఉద్యోగ వేదికకు చెందిన వర్క్‌ప్లేస్ ట్రెండ్స్ ఎడిటర్ ప్రియా రాథోడ్ మాట్లాడుతూ మీరు గట్టిగా మాట్లాడి సాధన చేయాల‌ని, సాధన అంటే నిజంగా మీ సమాధానాలను నోటితో పలకడమ‌ని, ఎందుకంటే చాట్‌బాట్ మీ మాటలను రికార్డు చేయాల‌ని చెప్పారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఒక యంత్రానికి మీ గురించి సమాచారం అందిస్తున్నార‌ని, ఇది సాధారణ సంభాషణ కాద‌ని స్ప‌ష్టం చేశారు. మీ ముఖ కవళికలు లేదా స్వరంలో ఉండే సంకేతాలను సాధారణ ఇంటర్వ్యూయర్ గుర్తిస్తారు కానీ ఏఐ గుర్తించాలంటే మీరు చాలా స్పష్టంగా, వివరణాత్మకంగా మాట్లాడాల‌ని రాథోడ్ పేర్కొన్నారు. ఏఐ ఇంటర్వ్యూయర్‌కు మీ స్వరం కంటే మీరు చెప్పే విషయమే ముఖ్యమని ఆమె వివరించారు.

సిమ్యులేట‌ర్ల‌ను వాడాలి..

ఇంటర్వ్యూకు ముందు ఆన్‌లైన్ ఇంటర్వ్యూ సిమ్యులేటర్లను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అనేక సిమ్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ సమాధానాలను రికార్డ్ చేసి కంటెంట్, డెలివరీ, మాట్లాడే వేగంపై తక్షణ ఫీడ్‌బ్యాక్ ఇస్తాయి. అలాగే కెమెరా ముందు మాట్లాడటానికి అలవాటు చేస్తాయి. సమయ పరిమితులను నిర్వహించడం, ప్రత్యక్ష సంభాషణలో ఉండే సహజ ప్రశ్నోత్తరాలు లేకుండానే సమాధానాలను క్రమబద్ధంగా చెప్పడం నేర్పిస్తాయి. ఇలాంటి బిహేవియరల్ ప్రశ్నలు ఎందుకు అడుగుతారంటే, అభ్యర్థులు గతంలో ఎదుర్కొన్న నిర్దిష్ట ఉద్యోగ పరిస్థితులను, వాటిలో చేసిన పనులను, ఫలితాలను ఉదాహరణలతో వివరించాలని ఏఐ కోరుతుందని రాథోడ్ చెప్పారు. అయితే ఏఐ ఎక్కువగా ప‌లు ప్ర‌శ్న‌ల‌పై ఆధార‌ప‌డుతుంద‌న్నారు. కానీ చాలా మంది స్ప‌ష్ట‌మైన స‌మాధానాలు ఇవ్వ‌ర‌ని, ఏఐ అడిగిన‌ట్లు సూటిగా స‌మాధానాలు చెబితే స‌రిపోతుంద‌ని ఆమె తెలిపారు.

ఏంటీ స్టార్ ప‌ద్ధ‌తి..

అభ్యర్థులు ఇప్పటికీ ప్రసిద్ధ స్టార్ పద్ధతిని అనుసరించాలి. స్టార్ అంటే సిట్యుయేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్. అంటే ఒక నిర్దిష్ట పని పరిస్థితి ఏంటి, మీకు అప్పగించిన పని ఏంటి, మీరు తీసుకున్న చర్య ఏంటి, చివరికి వచ్చిన ఫలితం ఏంటి అనే అంశాలను వివరించేందుకు సిద్ధంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు సంఖ్యలను ఉపయోగించాలని రాథోడ్ సూచించారు. మీరు ప్రత్యక్షంగా ఆదాయం పెంచే పాత్రలో లేకపోయినా, ఒక బృందం లేదా ప్రాజెక్ట్‌పై మీరు చూపిన ప్రభావాన్ని గణాంకాలతో వివరించవచ్చని చెప్పారు. వీడియో ఆధారిత ఇంటర్వ్యూ ఏఐతో జరిగినప్పటికీ, మీ డెస్క్, కంప్యూటర్ సెటప్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. ముందుగానే ఆడియో, వీడియోలను పరీక్షించాలి. ముఖంపై సరిపడా కాంతి ఉండేలా చూసుకోవాలి. ల్యాప్‌టాప్‌ను కళ్ల స్థాయిలో ఉంచాలి. కెమెరాను కిందికి చూస్తూ మాట్లాడకూడదు. కొన్ని పుస్తకాలను పేర్చి ల్యాప్‌టాప్ ఎత్తు పెంచడం లేదా రింగ్ లైట్ ఉపయోగించడం వంటి చిన్న మార్పులు కూడా మీరు మరింత ప్రొఫెషనల్‌గా కనిపించడానికి సహాయపడతాయ‌ని అమండా ఆగస్టిన్ తెలిపారు.

ఏఐ వాడితే దొరికిపోతారు..

ఉద్యోగార్థులు సమాధానాల కోసం ఏఐ సహాయం తీసుకోవాలని ప్రలోభపడతారు. ఎందుకంటే వాటిని ఉపయోగించడం చాలా సులభం. అంతేకాకుండా మనిషితో మాట్లాడటం కాదు కాబట్టి ఎవరికీ తెలియదని అనుకోవచ్చు. కానీ ఇది పెద్ద తప్పిదమని రాథోడ్ హెచ్చరించారు. ఇది ఏఐ ఇంటర్వ్యూయింగ్ టూల్‌కే కాకుండా రికార్డింగ్‌ను పరిశీలించే వారికి కూడా స్పష్టంగా తెలుస్తుంద‌ని, ఏఐ రూపొందించిన సమాధానాల‌ను ఉపయోగించడం వల్ల వెంటనే అనర్హతకు గురయ్యే అవకాశం ఉంద‌ని చెప్పారు. ప్రశ్నకు సమాధానం చెప్పడంలో ఇబ్బంది పడితే, ప్రశ్నను మళ్లీ చెప్పమని లేదా స్పష్టత ఇవ్వమని అడగవచ్చు. కొన్నిసార్లు అభ్యర్థి మోసం చేయడానికి ఏఐ వాడుతున్నాడో లేదో తెలుసుకోవడానికే కొన్ని ప్రశ్నలను ఉద్దేశపూర్వకంగా క్లిష్టంగా రూపొందిస్తారు. టెస్ట్‌గొరిల్లా మార్కెటింగ్ హెడ్ మెహక్ చౌద‌రి మాట్లాడుతూ తాము కొన్నిసార్లు చాలా సులభమైన ప్రశ్నలను క్లిష్టంగా అడుగుతామని, అభ్యర్థి పక్కనే మరో ఏఐ నడుస్తోందో లేదో తెలుసుకోవడానికే అలా చేస్తామ‌ని తెలిపారు. ఎందుకంటే ప్రశ్న నిడివిని బట్టి సమాధానాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఏఐ ప్రయత్నిస్తుంద‌ని, కానీ మీ నైపుణ్యాలపై మీకే అవగాహన ఉంటే అసలు ప్రశ్న ఏమిటో మీరు అర్థం చేసుకుంటార‌ని చెప్పారు. అభ్యర్థులు ఏఐ సాధనాలను పక్కన పెట్టాలని తాము బలంగా సూచిస్తున్నామ‌ని అన్నారు. ఇది మీ సామర్థ్యాన్ని పరీక్షించే పరీక్ష అని ఆమె స్పష్టం చేశారు.

Advertisement
Advertisement