త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Income Tax | విదేశీ ఆస్తులున్న పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31 వరకు అవకాశం

Income Tax | చిన్న పన్ను చెల్లింపుదారులు విదేశాల్లో కలిగి ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు ఉద్దేశించిన డిస్‌క్లోజర్ స్కీమ్ ఫర్ స్మాల్ ట్యాక్స్‌పేయర్స్ హోల్డింగ్ ఫారిన్ అసెట్స్ (ఫాస్ట్-డీఎస్) గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది.

S

Business | Published On Aug 17, 2026, 12.44 pm IST

Income Tax | విదేశీ ఆస్తులున్న పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31 వరకు అవకాశం
Advertisement

Income Tax | చిన్న పన్ను చెల్లింపుదారులు విదేశాల్లో కలిగి ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు ఉద్దేశించిన డిస్‌క్లోజర్ స్కీమ్ ఫర్ స్మాల్ ట్యాక్స్‌పేయర్స్ హోల్డింగ్ ఫారిన్ అసెట్స్ (ఫాస్ట్-డీఎస్) గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. ఈ గడువులోపు పన్ను చెల్లింపుదారులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించి, నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన పన్నును చెల్లించడం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవచ్చు. ఈ పథకం కింద ఆస్తులను వెల్లడించే పన్ను చెల్లింపుదారులు 30 శాతం పన్నుతోపాటు అదే మొత్తానికి సమానమైన జరిమానాను కూడా చెల్లించాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు గ‌డువు..

విద్యార్థులు, యువ నిపుణులు, సాంకేతిక సిబ్బంది, ప్రవాస భారతీయులు వంటి చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం విదేశీ ఆస్తుల ఆటోమేటిక్ డిస్‌క్లోజర్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా వెల్లడించని కొన్ని విదేశీ ఆస్తులు, వెల్లడించని విదేశీ ఆదాయం లేదా ప్రకటించని విదేశీ ఆస్తులకు సంబంధించి అర్హత కలిగిన పన్ను చెల్లింపుదారులు ఒకేసారి నిర్ణీత మొత్తంలో పన్ను చెల్లించే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తెలిపింది. ఇలాంటి పన్ను చెల్లింపుదారులకు ఒక్కసారి చెల్లింపు అవకాశం కల్పించడం ద్వారా వివాదాలను తగ్గించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా పేర్కొంది. సీబీడీటీ ప్రకారం ఈ పథకం ఆగస్టు 16 నుంచి అమల్లోకి వచ్చింది. ఆన్‌లైన్ ద్వారా డిక్లరేషన్లను డిసెంబర్ 31 వరకు దాఖలు చేసుకోవచ్చు. ప్రకటించాల్సిన ఆస్తుల న్యాయమైన మార్కెట్ విలువను మార్చి 31 నాటికి ఉన్న విలువ ఆధారంగా లెక్కిస్తారు. ఈ పథకం కింద డిక్లరేషన్ల దాఖలుకు రెండు ప్రధాన కేటగిరీలను ఏర్పాటు చేశారు. ఈ రెండు కేటగిరీలకు చెందిన పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ 31లోపు తమ ఆస్తులను వెల్లడించేందుకు అవకాశం ఉంటుంది. అయితే పన్ను విధించే ప్రక్రియ మాత్రం మార్చి 31 తర్వాత మాత్రమే ప్రారంభమవుతుంది.

రెండు కేట‌గిరిలు..

సీబీడీటీ ఈ పథకం కింద రెండు కేటగిరీలను రూపొందించింది. మొదటి కేటగిరీలో భారత్ వెలుపల ఉన్న, వెల్లడించని ఆస్తులు లేదా పన్ను విధించని, వెల్లడించని విదేశీ ఆదాయం ఉంటాయి. ఈ కేటగిరీలో వెల్లడించని ఆస్తుల మొత్తం విలువ రూ.1 కోటి మించకూడదు. రెండో కేటగిరీలో ఇప్పటికే పన్ను చెల్లించిన భారత్ వెలుపల ఉన్న ఆస్తులు లేదా పన్ను చెల్లింపుదారు ప్రవాస భారతీయుడిగా ఉన్న సమయంలో కొనుగోలు చేసినప్పటికీ, ఆదాయపు పన్ను రిటర్న్‌లోని సంబంధిత షెడ్యూల్‌లో వెల్లడించని ఆస్తులు ఉంటాయి. ఈ కేటగిరీలో డిక్లరేషన్ చేసేందుకు గరిష్ఠ పరిమితి రూ.5 కోట్లుగా నిర్ణయించారు. ఇలాంటి డిక్లరేషన్లపై రూ.1 లక్ష రుసుము కూడా విధించనున్నారు. ఇలాంటి విదేశీ ఆస్తులపై పన్నును లెక్కించేందుకు సీబీడీటీ ప్రత్యేక ఫార్ములాను కూడా రూపొందించింది. విదేశీ ఆస్తి లేదా ఆదాయం విలువలో 30 శాతం పన్నుగా చెల్లించాలి. దీనికి సమానమైన మరో మొత్తాన్ని జరిమానాగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

అద‌న‌పు ప‌న్ను నుంచి ర‌క్ష‌ణ‌..

సీబీడీటీ విడుదల చేసిన తరచూ అడిగే ప్రశ్నల‌ (ఎఫ్‌ఏక్యూ) ప్రకారం.. ఒక వ్యక్తి వెల్లడించని విదేశీ బ్యాంకు ఖాతాలో రూ.60 లక్షలు, వెల్లడించని విదేశీ ఆదాయంగా రూ.20 లక్షలు ఉన్నట్లు భావిస్తే, మొత్తం పన్ను రూ.48 లక్షలు అవుతుంది. ఈ పథకం కింద డిక్లరేషన్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులకు అదనపు పన్ను లేదా జరిమానా నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే బ్లాక్ మనీ యాక్ట్, 2015 లేదా డిస్‌క్లోజర్ ఆఫ్ ఇన్‌కమ్ యాక్ట్ కింద చర్యల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ఈ మొత్తాన్ని పన్ను చెల్లింపుదారు మొత్తం ఆదాయంలో భాగంగా కూడా పరిగణించరు.

Advertisement
Advertisement