త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Crude Oil | ముడి చ‌మురు ముప్పు.. బ్యారెల్ ధ‌ర‌ 150 డాల‌ర్ల‌కు..?

Crude Oil | మధ్యప్రాచ్యంలో చమురు సరఫరాలకు అంతరాయాలు కొనసాగితే బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 120 నుంచి 150 డాలర్ల వరకు పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఎఫ్‌జీఈ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఇమాన్‌ నస్సేరి అంచనా వేశారు. మధ్యప్రాచ్య సరఫరాలపై ఆందోళనలు కొనసాగుతుండటంతో చమురు ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి.

S

Business | Published On Sep 15, 2026, 4.54 pm IST

Crude Oil | ముడి చ‌మురు ముప్పు.. బ్యారెల్ ధ‌ర‌ 150 డాల‌ర్ల‌కు..?
Advertisement

Crude Oil | మధ్యప్రాచ్యంలో చమురు సరఫరాలకు అంతరాయాలు కొనసాగితే బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 120 నుంచి 150 డాలర్ల వరకు పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఎఫ్‌జీఈ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఇమాన్‌ నస్సేరి అంచనా వేశారు. మధ్యప్రాచ్య సరఫరాలపై ఆందోళనలు కొనసాగుతుండటంతో చమురు ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. సౌదీ అరేబియాలోని కీలకమైన ఈస్ట్‌-వెస్ట్‌ పైప్‌లైన్‌ ఇప్పటికీ పనిచేయకపోవడంతో బ్రెంట్‌ ధర బ్యారెల్‌కు 107 డాలర్లను దాటింది. శుక్రవారం నమోదైన దాదాపు 110 డాలర్ల ఇంట్రాడే గరిష్ఠానికి ఇది చేరువైంది. మే తర్వాత ఇదే అత్యధిక స్థాయి. మరో 20 లక్షల నుంచి 40 లక్షల బ్యారెళ్ల రోజువారీ క్రూడ్‌ సరఫరా మార్కెట్‌ నుంచి తగ్గిపోతే చమురు మార్కెట్‌పై మరింత ఒత్తిడి పెరుగుతుందని నస్సేరి తెలిపారు. ప్రాంతాన్ని బట్టి భౌతికంగా అందుబాటులో ఉన్న క్రూడ్‌ బ్యారెళ్ల ధర ఇప్పటికే 120 నుంచి 130 డాలర్ల మధ్య ట్రేడవుతోందని చెప్పారు. భౌతికంగా అందుబాటులో ఉన్న క్రూడ్‌ బ్యారెళ్ల సరఫరా నిలిచిపోతే బ్రెంట్‌ ధర 120 నుంచి 150 డాలర్ల వరకు పెరుగుతుంద‌ని నస్సేరి పేర్కొన్నారు.

ఇప్ప‌టికే 130 డాల‌ర్ల‌కు చేరిన ధ‌ర‌..

మార్కెట్లో ఇప్పటికే క్రూడ్‌ కొరత ముప్పు కనిపిస్తోందని ఆయన తెలిపారు. తక్షణ సరఫరా కోసం అందుబాటులో ఉన్న కార్గోలు సాధారణ ధర కంటే 20 నుంచి 30 డాలర్ల ప్రీమియంతో ట్రేడవుతున్నాయని చెప్పారు. సరఫరా అంతరాయం కొనసాగితే ఫ్యూచర్స్‌ మార్కెట్‌లోని ధరలు కూడా భౌతిక క్రూడ్‌ ధరల వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం భౌతిక క్రూడ్‌ ధరలు ఎంచుకునే ప్రాంతాన్ని బట్టి 120 నుంచి 130 డాలర్ల స్థాయిలో ఉన్నాయని నస్సేరి మరోసారి స్పష్టం చేశారు. సౌదీ ఈస్ట్‌-వెస్ట్‌ పైప్‌లైన్‌ అంతరాయం స్వల్పకాలికంగానే ఉంటుందని మార్కెట్‌ ప్రస్తుతం భావిస్తోందని ఆయన చెప్పారు. అయితే సౌదీ చమురు ఆస్తులపై మరిన్ని దాడులు జరిగితే సరఫరా అంతరాయం ఎంతకాలం కొనసాగుతుందన్న ఆందోళనలు పెరుగుతాయ‌ని తెలిపారు. పైప్‌లైన్‌ రెండు వారాలకు మించి పనిచేయకపోతే బ్రెంట్‌ ఫ్యూచర్స్‌ ధర భౌతిక క్రూడ్‌ ధరలతో సమాన స్థాయికి చేరే అవకాశం ఉందని నస్సేరి వివరించారు.

మ‌రో 15 నుంచి 25 రోజులే..

సౌదీ ఈస్ట్‌-వెస్ట్‌ పైప్‌లైన్‌ను ముందుజాగ్రత్త చర్యగా మూసివేశారు. ప్రస్తుతం రెండు నుంచి మూడు వారాల పాటు సరఫరా నిలిచిపోవడం లేదా క్రూడ్‌ డెలివరీలు తగ్గడం వంటి పరిస్థితి మార్కెట్‌ ధరల్లో ప్రతిబింబిస్తోందని నస్సేరి చెప్పారు. యన్బులోని నిల్వలు మరో 15 నుంచి 25 రోజుల పాటు చమురు లోడింగ్‌కు మద్దతు ఇస్తాయ‌ని ఆయన తెలిపారు. పైప్‌లైన్‌ అంతరాయం నేపథ్యంలో మొత్తం మధ్యప్రాచ్య చమురు సరఫరాలపైనా ముప్పు పెరిగింది. హోర్ముజ్‌ జలసంధి మీదుగా చమురు రవాణాపై కూడా దాడులు జరిగాయి. మరోవైపు పలు చమురు క్షేత్రాల్లో ఉత్పత్తిని నిలిపివేశారు. అమెరికా-ఇరాన్‌ యుద్ధం ఇంధన సంపదకు ప్రసిద్ధి చెందిన మధ్యప్రాచ్య ప్రాంతమంతా విస్తరించడంతో ఈ ఏడాది బ్రెంట్‌ ధర మూడు వంతులకు పైగా పెరిగిందని పేర్కొన్నారు.

స‌ర‌ఫ‌రా ప‌రిస్థితి కీల‌కం..

ఈటీవో మార్కెట్స్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ జొనాథన్‌ బారట్‌ కూడా క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 125 నుంచి 130 డాలర్ల వరకు చేరుతుంద‌ని అంచ‌నా వేశారు. ఈ స్థాయికి చమురు ధర చేరడం సాధ్యమేనా అని మీడియా ప్రశ్నించగా సాధ్యమే అని ఆయన సమాధానమిచ్చారు. అమెరికా, ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఘర్షణకు పరిష్కారం లభించే వరకు చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతాయ‌ని బారట్‌ తెలిపారు. వివాదానికి పరిష్కారం లభించనంత కాలం చమురు కాంట్రాక్టుల్లో రిస్క్‌ ప్రీమియం కొనసాగుతుందని చెప్పారు. వడ్డీ రేట్లు పెరిగితే ఆర్థిక డిమాండ్‌ మందగించే అవకాశం ఉందని, దాంతో చమురు ధరలపై ఒత్తిడి ఏర్పడుతుంద‌ని బారట్‌ పేర్కొన్నారు. కేసీఎం ట్రేడ్‌ చీఫ్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ టిమ్‌ వాటరర్‌ మాట్లాడుతూ అధిక బాండ్‌ ఈల్డ్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వ్యయంపై ఆందోళనలతోపాటు చమురు ధరల పెరుగుదల కూడా రిస్క్‌ ఆస్తులకు ఎదురవుతున్న పలు ప్రతికూల పరిస్థితుల్లో ఒకటని చెప్పారు. క్రూడ్‌ ధరలను నిర్ణయించడంలో సరఫరా పరిస్థితి కీలకంగా ఉంటుందని తెలిపారు. సౌదీ చమురు ఆస్తులపై దాడులు, హోర్ముజ్‌ జలసంధి ద్వారా చమురు రవాణాలో అంతరాయాలు, ఆ జలమార్గం ద్వారా నౌకల రాకపోకలకు ఎదురవుతున్న ముప్పును విస్తృతమైన అమెరికా-ఇరాన్‌ ఘర్షణతో అనుసంధానించారు.

Advertisement
Advertisement