త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Systematic Withdrawal Plan | రూ.50 లక్షలతో 30 ఏళ్ల రిటైర్మెంట్ ఆదాయం.. ఎస్‌డబ్ల్యూపీ ఇలా ప్లాన్ చేస్తే సెట్‌..

Systematic Withdrawal Plan | రిటైర్మెంట్ తర్వాత మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) ఉపయోగపడుతుంది. ఈ విధానంలో మీ పెట్టుబడి మొత్తం మ్యూచువల్ ఫండ్‌లోనే కొనసాగుతూ, రాబడులు పొందే అవకాశం ఉంటుంది. అయితే, చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ మొత్తాన్ని ఉపసంహరించుకుంటే పొదుపు వేగంగా తగ్గిపోయి, రిటైర్మెంట్ చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

S

Business | Published On Oct 8, 2026, 11.19 am IST

Systematic Withdrawal Plan | రూ.50 లక్షలతో 30 ఏళ్ల రిటైర్మెంట్ ఆదాయం.. ఎస్‌డబ్ల్యూపీ ఇలా ప్లాన్ చేస్తే సెట్‌..
Advertisement

Systematic Withdrawal Plan | రిటైర్మెంట్ తర్వాత మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) ఉపయోగపడుతుంది. ఈ విధానంలో మీ పెట్టుబడి మొత్తం మ్యూచువల్ ఫండ్‌లోనే కొనసాగుతూ, రాబడులు పొందే అవకాశం ఉంటుంది. అయితే, చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ మొత్తాన్ని ఉపసంహరించుకుంటే పొదుపు వేగంగా తగ్గిపోయి, రిటైర్మెంట్ చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీ అవసరాలను తీర్చడంతోపాటు పెట్టుబడి మొత్తం ఎక్కువ కాలం కొనసాగించేలా ఎస్‌డబ్ల్యూపీని ప్రణాళిక చేసుకోవాలి. ఇందుకోసం మీ పెట్టుబడి మొత్తం, అంచనా రాబడులు, ద్రవ్యోల్బణం, రిటైర్మెంట్ వ్యవధి వంటి అంశాల ఆధారంగా స్థిరమైన ఉపసంహరణ రేటును నిర్ణయించుకోవడం కీలకం.

రూ.50 ల‌క్ష‌ల కార్ప‌స్ ఉంటే..

ప్రతి నెల ఒకే మొత్తాన్ని ఉపసంహరించుకుంటూ, మీ ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించకుండా ఉండడం కంటే.. మొదట్లో తక్కువ ఉపసంహరణ రేటుతో ప్రారంభించి, అవసరాన్ని బట్టి కాలానుగుణంగా మార్పులు చేసుకోవడం మంచిది. ఉదాహరణకు, మీ వద్ద రూ.50 లక్షల రిటైర్మెంట్ కార్పస్ ఉందని అనుకుందాం. ఈ మొత్తంపై వార్షికంగా 10 శాతం రాబడి వస్తుందని, ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంటుందని భావిస్తే ఎస్‌డబ్ల్యూపీ ఎలా పనిచేస్తుందో చూడొచ్చు. మీరు నెలకు రూ.20వేల చొప్పున ఉపసంహరణ ప్రారంభిస్తే, ప్రారంభ పెట్టుబడి రూ.50 ల‌క్ష‌లు అవుతుంది. మొదటి ఎస్‌డబ్ల్యూపీ రూ.20వేలుగా ఉంటుంది. ద్రవ్యోల్బణం 6 శాతంగా పరిగణిస్తే, 30 ఏళ్ల వ్యవధిలో చివరి ఎస్‌డబ్ల్యూపీ మొత్తం రూ.1,08,367.76కు చేరుతుంది. ఈ కాలంలో మొత్తం ఉపసంహరణ రూ.1,89,73,965.36గా ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం, 10 శాతం వార్షిక రాబడి, 6 శాతం ద్రవ్యోల్బణం ఉన్న పరిస్థితిలో రూ.50 లక్షల కార్పస్ 30 ఏళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది.

మార్కెట్ల ప‌త‌నం ఉంటే..

అయితే మ్యూచువల్ ఫండ్ల నుంచి డబ్బు తీసుకునేటప్పుడు మార్కెట్ల పతనాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వాస్తవ రాబడులు అంచనాల కంటే గణనీయంగా మారే అవ‌కాశాలు ఉంటాయి. ముఖ్యంగా పెట్టుబడి ప్రారంభించిన తొలి ఐదేళ్లలో మార్కెట్లు బలహీనంగా ఉంటే, కార్పస్ వేగంగా తగ్గిపోయి దాని జీవితకాలం గణనీయంగా కుదించే అవకాశం ఉంటుంది. అందుకే రిటైర్మెంట్ ప్రారంభ దశలో ఉపసంహరణ విషయంలో మరింత జాగ్రత్తగా, సంప్రదాయబద్ధమైన విధానాన్ని అనుసరించడం మంచిది. మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యీకరణ కూడా చాలా ముఖ్యమైనది. రిటైర్మెంట్ అవసరాల కోసం పూర్తిగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లపై ఆధారపడడం సరైనది కాదు. ఈక్విటీ మార్కెట్ రాబడులు హామీ కావు. అందువల్ల బంగారం, డెట్ సాధనాలు, పెన్షన్ ఫండ్లు వంటి ఇతర ఆస్తుల్లోనూ పెట్టుబడులను విస్తరించడం అవసరం.

అలాగే మూలధన లాభాల పన్నును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పన్ను చెల్లింపుల కారణంగా చేతికి అందే వాస్తవ మొత్తం తగ్గుతుంది. దీంతో రిటైర్మెంట్ కార్పస్ ఎంతకాలం కొనసాగుతుందనే అంశంపైనా ప్రభావం పడుతుంది. కాబట్టి ఎస్‌డబ్ల్యూపీని నిర్ణయించేటప్పుడు కేవలం నెలవారీ అవసరాలను మాత్రమే కాకుండా రాబడులు, ద్రవ్యోల్బణం, మార్కెట్ ఒడిదుడుకులు, పన్నులు, పెట్టుబడి వైవిధ్యీకరణ వంటి అంశాలను కూడా సమగ్రంగా పరిగణనలోకి తీసుకోవాలి.

Advertisement
Advertisement