త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Price | బంగారం కొనేముందు ఈ లెక్క తెలుసుకోండి.. జువెలరీ షాపుల్లో మోసపోకుండా ఉండాలంటే ఇదే సీక్రెట్..

Gold Price | బంగారం కొనుగోలు అంటే పెద్ద ఆర్థిక నిర్ణయం. అయితే ఒకే డిజైన్‌కు చెందిన ఆభరణం ధర వేర్వేరు జువెలరీ దుకాణాల్లో ఎందుకు మారుతుందనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఎక్కువ మంది కొనుగోలుదారులు చివరగా వచ్చే బిల్లును మాత్రమే చూస్తారు.

S

Business | Published On Jul 25, 2026, 3.23 pm IST

Gold Price | బంగారం కొనేముందు ఈ లెక్క తెలుసుకోండి.. జువెలరీ షాపుల్లో మోసపోకుండా ఉండాలంటే ఇదే సీక్రెట్..
Advertisement

Gold Price | బంగారం కొనుగోలు అంటే పెద్ద ఆర్థిక నిర్ణయం. అయితే ఒకే డిజైన్‌కు చెందిన ఆభరణం ధర వేర్వేరు జువెలరీ దుకాణాల్లో ఎందుకు మారుతుందనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఎక్కువ మంది కొనుగోలుదారులు చివరగా వచ్చే బిల్లును మాత్రమే చూస్తారు. కానీ అసలు బంగారం బేస్ ధరను ఎలా లెక్కిస్తారో తెలుసుకుంటే, సరైన ధర చెల్లిస్తున్నారా లేదా అవసరానికి మించి చెల్లిస్తున్నారా అనే విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై బులియన్ వ్యాపారి, జువెలరీ నిపుణుడు ఎస్‌ఎస్ ఆలమ్ ఇటీవల సంజయ్ కథూరియా పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. ఒక జువెలర్ ప్రధానంగా మూడు అంశాల ఆధారంగా కస్టమర్ నుంచి డబ్బు వసూలు చేస్తాడు. అవి బంగారం రేటు, వేస్టేజ్ ఛార్జీలు, మేకింగ్ ఛార్జీలు. అయితే చాలా మంది కొనుగోలుదారులు చివరి బిల్లు మొత్తాన్ని మాత్రమే గమనిస్తారని, ముందుగా బంగారం బేస్ రేటు తెలుసుకుంటే సరైన నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు.

కామెక్స్ ధ‌ర ఆధారంగా..

దేశంలో బంగారం ధరను లెక్కించాలంటే ముందుగా అంతర్జాతీయ మార్కెట్‌లోని కామెక్స్‌లో ప్రకటించే బంగారం ధరను ఆధారంగా తీసుకుంటారు. కామెక్స్‌లో బంగారం ధరను అమెరికన్ డాలర్లలో ప్రతి ట్రాయ్ ఔన్స్‌కు ప్రకటిస్తారు. ఆ ధరను భారతీయ రూపాయిల్లో గ్రాముకు మార్చి, తర్వాత దిగుమతి సుంకం, జీఎస్టీ వంటి పన్నులను కలిపి దేశీయ బేస్ ధరను అంచనా వేస్తారు. బంగారం బేస్ ధరను లెక్కించేందుకు ముందుగా కామెక్స్‌లో ఉన్న ఒక్క ఔన్స్ బంగారం ధరను తీసుకోవాలి. దానిని ప్రస్తుత డాలర్-రూపాయి మారకపు విలువతో గుణించాలి. ఆ తర్వాత ఒక్క ఔన్స్ ధరను గ్రాముకు మార్చాలి. అనంతరం సుమారు 6 శాతం దిగుమతి సుంకాన్ని జోడించి, చివరగా 3 శాతం జీఎస్టీ కలపాలి.

ఇలా లెక్కించాలి..

ఉదాహరణకు కామెక్స్‌లో బంగారం ధర ఒక్క ఔన్స్‌కు 4,030 అమెరికన్ డాలర్లు, ఒక డాలర్ విలువ రూ.96గా ఉందని అనుకుందాం. అప్పుడు 4,030 × 96 = రూ.3,86,880 అవుతుంది. ఒక ఔన్స్‌ను 28.35 గ్రాములుగా పరిగణిస్తే, గ్రాముకు ధర రూ.3,86,880 ÷ 28.35 = సుమారు రూ.13,650 అవుతుంది. ఈ మొత్తంపై సుమారు 6 శాతం దిగుమతి సుంకం కలిపితే రూ.819 పెరిగి గ్రాముకు ధర రూ.14,469 అవుతుంది. అనంతరం 3 శాతం జీఎస్టీ కలిపితే మరో రూ.434 జోడించి మొత్తం గ్రాముకు సుమారు రూ.14,903 అవుతుంది. అంటే ఈ లెక్క ప్రకారం 24 క్యారెట్ల బంగారం అంచనా బేస్ ధర గ్రాముకు రూ.14,903గా ఉంటుంది. దేశంలో ఎక్కువగా 22 క్యారెట్ల బంగారంతోనే నగలు తయారు చేస్తారు. 22 క్యారెట్ల బంగారం స్వచ్ఛత 91.6 శాతం ఉంటుంది. అందువల్ల 24 క్యారెట్ల బంగారం ధరను 91.6 శాతంతో గుణిస్తే 22 క్యారెట్ల బంగారం అంచనా ధర తెలుస్తుంది.

22 క్యారెట్ల బంగారం అయితే..

పై ఉదాహరణ ప్రకారం రూ.14,903 × 91.6 శాతం = సుమారు రూ.13,651 అవుతుంది. అంటే 22 క్యారెట్ల బంగారం బేస్ ధర గ్రాముకు సుమారు రూ.13,651గా అంచనా వేయవచ్చు. దీనికి తర్వాత మాత్రమే మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్ ఛార్జీలు, ఇతర జువెలరీ షాపులు వసూలు చేసే అదనపు చార్జీలు జత అవుతాయి. జువెలర్‌ను బట్టి మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్ ఛార్జీలు మారుతూ ఉంటాయి. అయితే బంగారం బేస్ ధర ఎలా లెక్కించాలో ముందుగానే తెలుసుకుంటే, వేర్వేరు జువెలరీ దుకాణాల ధరలను సులభంగా పోల్చుకోవచ్చు. దీంతో సరైన ధరకు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement