త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EV Charging Station | ఈవీ చార్జింగ్ స్టేష‌న్ల‌కు భారీగా డిమాండ్‌.. స్వ‌యం ఉపాధితో చ‌క్క‌ని ఆదాయం..

EV Charging Station | ప్ర‌స్తుతం దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్ర‌జ‌లు అధికంగా ఉప‌యోగిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌ధ్య‌ప్రాచ్యంలో యుద్ధం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి దేశంలో ఈవీల‌కు గిరాకీ పెరిగింది. టూవీలర్లు, కార్ల‌ను ప్ర‌జ‌లు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. మెయింటెనెన్స్ స్వ‌ల్పంగా ఉండ‌డం, మైలేజ్ అధికంగా రావ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల ఈవీల వినియోగం క్ర‌మంగా పెరుగుతోంది.

S

Business | Published On Aug 7, 2026, 4.20 pm IST

EV Charging Station | ఈవీ చార్జింగ్ స్టేష‌న్ల‌కు భారీగా డిమాండ్‌.. స్వ‌యం ఉపాధితో చ‌క్క‌ని ఆదాయం..
Advertisement

EV Charging Station | ప్ర‌స్తుతం దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్ర‌జ‌లు అధికంగా ఉప‌యోగిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌ధ్య‌ప్రాచ్యంలో యుద్ధం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి దేశంలో ఈవీల‌కు గిరాకీ పెరిగింది. టూవీలర్లు, కార్ల‌ను ప్ర‌జ‌లు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. మెయింటెనెన్స్ స్వ‌ల్పంగా ఉండ‌డం, మైలేజ్ అధికంగా రావ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల ఈవీల వినియోగం క్ర‌మంగా పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సైతం ఈవీల‌కు స‌బ్సిడీల‌ను అందిస్తుండ‌డంతో ప్ర‌జ‌లు వీటిని కొనేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది వాహ‌న‌దారులు పెట్రోల్, డీజిల్ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవ‌డం కోసం ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ, ఈవీల‌ను కొనుగోలు చేస్తున్న చాలా మంది వాహ‌న‌దారుల‌కు ఎదుర‌వుతున్న పెద్ద స‌మ‌స్య‌.. చార్జింగ్‌. త‌మ వాహ‌నానికి ఇంట్లో చార్జింగ్ స్టేష‌న్‌ను ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఎమ‌ర్జెన్సీ స‌మ‌యాల్లో ఇంటికి ద‌గ్గ‌ర‌లో లేన‌ప్పుడు వాహ‌నంలో చార్జింగ్ అయిపోతే ఇబ్బందులు త‌లెత్తుతాయి.

చార్జింగ్ స్టేష‌న్ల‌కు డిమాండ్‌..

వాహ‌నంలో చార్జింగ్ లేక‌పోతే అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఎటూ ప్ర‌యాణించ‌లేరు. అయితే దీనికి చార్జింగ్ స్టేష‌న్లు ప‌రిష్కారం చూపిస్తున్నాయి. దేశ‌వ్యాప్తంగా అనేక ఈవీ త‌యారీ కంపెనీల‌తోపాటు ఔత్సాహిక వ్యాపార‌స్తులు, కంపెనీలు ఈవీ చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం వీటికి దేశ‌వ్యాప్తంగా డిమాండ్ కూడా బాగానే పెరిగింది. అయితే స్వ‌యం ఉపాధి మార్గాల కోసం అన్వేషిస్తున్న వారికి ఈవీ చార్జింగ్ స్టేష‌న్ అద్భుత‌మైన అవ‌కాశం అందిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్ర‌స్తుతం భారీ ఎత్తున ఎల‌క్రిక్ వాహ‌నాల వినియోగ‌దారుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో వాహ‌నాల‌కు అనుగుణంగా చార్జింగ్ స్టేష‌న్ల ఏర్పాటు ఆవ‌శ్య‌క‌త కూడా ఏర్ప‌డింది. దీంతో చాలా మంది ప్ర‌స్తుతం దీన్ని స్వ‌యం ఉపాధి మార్గంగా మ‌లుచుకుంటున్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ఈవీ చార్జింగ్ స్టేష‌న్ల‌ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ఆస‌క్తి చూపిస్తున్నారు.

హైవేల‌పై ఎక్కువ‌గా..

తెలంగాణ‌లో హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ వంటి న‌గ‌రాలతోపాటు ఏపీలో విశాఖ‌ప‌ట్నం, గుంటూరు, విజ‌య‌వాడ‌, తిరుప‌తి వంటి న‌గ‌రాల్లోనూ ఈవీల వినియోగం భారీగా పెరిగింది. ఆయా న‌గ‌రాల్లో చాలా మంది ఈవీ వాహ‌నదారుల‌కు ఔట్ డోర్‌లో చాలా సంద‌ర్భాల్లో చార్జింగ్ స్టేష‌న్ల అవ‌స‌రం ఏర్ప‌డుతోంది. ఇంట్లో చార్జింగ్ పెట్టినా స‌రే హైవేల‌పై ప్ర‌యాణించే స‌మ‌యంలో కొన్ని సార్లు చార్జింగ్ అవ‌స‌రం అవుతోంది. హైవేల ప‌క్క‌న చార్జింగ్ స్టేష‌న్లు త‌క్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేసేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తున్నారు. జాతీయ ర‌హ‌దారులు, పెట్రోల్ పంప్స్‌, ముఖ్య‌మైన ప‌బ్లిక్ ప్ర‌దేశాలు, హోట‌ల్స్‌, మాల్స్ వంటి ప్ర‌దేశాల్లోనూ చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేసేందుకు మంచి అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఎంత స్థ‌లం ఉండాలి..

ఈవీ చార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలంటే క‌నీసం 800 నుంచి 1500 చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లం ఉండాలి. దీన్ని రెండు నుంచి నాలుగు కార్ల‌ను చార్జింగ్ చేసేందుకు వాడ‌వ‌చ్చు. అలాగే క‌మర్షియ‌ల్ విద్యుత్ క‌నెక్ష‌న్‌, ఫాస్ట్ చార్జ‌ర్లు, డిజిట‌ల్ పేమెంట్ స‌దుపాయం, చార్జింగ్ నిర్వ‌హ‌ణ కోసం అవ‌స‌ర‌మైన సాఫ్ట్ వేర్ ఉండాలి. ఈ వ్యాపారానికి ప్ర‌త్యేక‌మైన లైసెన్స్ అవ‌స‌రం లేదు. స్థానిక మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయ‌తీ అనుమ‌తులు, విద్యుత్ సంస్థ నుంచి క‌మ‌ర్షియ‌ల్ క‌నెక్ష‌న్‌, అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌తా అనుమ‌తుల‌ను తీసుకుంటే స‌రిపోతుంది.

రెండు ర‌కాలుగా చేయొచ్చు..

ఈవీ చార్జింగ్ స్టేష‌న్ బిజినెస్‌ను రెండు ర‌కాలుగా చేయ‌వ‌చ్చు. ఒక‌టి సొంతంగా చార్జింగ్ స్టేష‌న్‌ను ఏర్పాటు చేసి నిర్వ‌హించ‌డం. ఇందులో లాభం మొత్తం పెట్టుబ‌డిదారుల వ‌ద్దే ఉంటుంది. అయితే మార్కెటింగ్‌, మెయింటెనెన్స్ బాధ్య‌త కూడా వ‌హించాల్సి ఉంటుంది. అలాగే ప్ర‌ముఖ కంపెనీలు ఈవీ చార్జింగ్ స్టేష‌న్ల ఫ్రాంచైజీల‌ను సైతం అందిస్తున్నాయి. వాటిని తీసుకుంటే వారి బ్రాండ్‌, మొబైల్ యాప్‌, టెక్నిక‌ల్ స‌హాయం కూడా ల‌భిస్తుంది. దీంతో ఈజీగా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌వ‌చ్చు. అయితే కంపెనీలు క‌మిష‌న్ తీసుకుంటాయి. ప్ర‌స్తుతం ప‌లు కంపెనీలు పార్ట్‌న‌ర్‌షిప్ అవ‌కాశాల‌ను కూడా అందిస్తున్నారు. ఆయా కంపెనీల‌కు చెందిన అధికారిక వెబ్‌సైట్‌ల‌లో ద‌ర‌ఖాస్తు చేసుకుని ఫ్రాంచైజీని పొంద‌వ‌చ్చు. కొన్ని సంస్థ‌లు లోన్ స‌దుపాయాన్ని, సాంకేతిక మ‌ద్ద‌తును కూడా అందిస్తున్నాయి.

ఎంత ఖ‌ర్చ‌వుతుంది..?

ఈవీ చార్జింగ్ స్టేష‌న్ ను ఏర్పాటు చేయాలంటే సుమారుగా రూ.15 ల‌క్ష‌ల నుంచి రూ.35 లక్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి అవ‌స‌రం అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. చార్జ‌ర్ల సంఖ్య‌, విద్యుత్ క‌నెక్ష‌న్, ఇత‌ర సౌక‌ర్యాల‌పై ఆధార‌ప‌డి ఈ పెట్టుబ‌డి వ్య‌యం మారుతుంది. స‌రైన ప్ర‌దేశంలో చార్జింగ్ స్టేష‌న్‌ను పెడితే ప్రారంభంలోనే నెల‌కు రూ.25వేల నుంచి రూ.40వేల వ‌ర‌కు ఆదాయం వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. ర‌ద్దీ ప్రాంతాలు, హైవేల వ‌ద్ద అయితే ఈ ఆదాయం మ‌రింత పెరుగుతుంది. చార్జింగ్ స్టేష‌న్‌తోపాటు టీ, కాఫీ, స్నాక్స్‌, కార్ వాష్ త‌దిత‌ర స‌దుపాయాల‌ను సైతం అందిస్తే ఆదాయాన్ని మ‌రింత పెంచుకోవచ్చు. స్వ‌యం ఉపాధి కోసం చూస్తున్న‌వారికి ఈవీ చార్జింగ్ స్టేష‌న్ బిజినెస్ అద్భుత‌మైన అవ‌కాశంగా నిలుస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement