త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ETF | ఈటీఎఫ్ వర్సెస్ మ్యుచువల్ ఫండ్స్‌.. పెట్టుబడికి ఏది బెస్ట్..?

ETF | భార‌త్‌లో పెట్టుబడిదారులు ఎక్కువగా ఎంచుకునే పెట్టుబడి మార్గాల్లో ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు), మ్యుచువల్ ఫండ్స్ ముఖ్య‌మైనవి. ఈ రెండు పెట్టుబడి సాధనాలు కూడా ఒకేసారి అనేక సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పించి, పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి సహాయపడతాయి.

S

Business | Published On Aug 6, 2026, 2.02 pm IST

ETF | ఈటీఎఫ్ వర్సెస్ మ్యుచువల్ ఫండ్స్‌.. పెట్టుబడికి ఏది బెస్ట్..?
Advertisement

ETF | భార‌త్‌లో పెట్టుబడిదారులు ఎక్కువగా ఎంచుకునే పెట్టుబడి మార్గాల్లో ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు), మ్యుచువల్ ఫండ్స్ ముఖ్య‌మైనవి. ఈ రెండు పెట్టుబడి సాధనాలు కూడా ఒకేసారి అనేక సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పించి, పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి సహాయపడతాయి. ఈటీఎఫ్‌లు పాసివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్. ఇవి ఒక నిర్దిష్ట ఇండెక్స్ లేదా ఆస్తి పనితీరును అనుసరిస్తాయి. ఇక మరోవైపు మ్యుచువల్ ఫండ్స్ యాక్టివ్‌గా నిర్వహ‌ణ‌లో ఉండే పెట్టుబడులు. ఫండ్ మేనేజర్లు తమ విశ్లేషణ, మార్కెట్ అంచనాల ఆధారంగా సెక్యూరిటీలను ఎంపిక చేసి మార్కెట్ కంటే మెరుగైన రాబడిని అందించడానికి ప్రయత్నిస్తారు. ఈటీఎఫ్‌లు, మ్యుచువల్ ఫండ్స్ రెండూ తక్కువ వ్యయంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తాయి. ఇవి పెట్టుబడులకు వైవిధ్యం, నిపుణుల నిర్వహణ వంటి ప్రయోజనాలను అందిస్తాయి.

తేడాలేమిటి..

అయితే ఈటీఎఫ్‌ల‌ను స్టాక్‌ల మాదిరిగానే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో రోజంతా కొనుగోలు, విక్రయాలు చేయవచ్చు. మ్యుచువల్ ఫండ్స్ ను మాత్రం ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఆ రోజు నికర ఆస్తి విలువ (ఎన్‌ఏవీ) ఆధారంగా మాత్రమే కొనుగోలు లేదా విక్రయం చేస్తారు. అందువల్ల పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడి కాలపరిమితిని పరిగణనలోకి తీసుకుని ఈటీఎఫ్ లేదా మ్యుచువల్ ఫండ్‌ను ఎంచుకోవడం మంచిది. ఈటీఎఫ్‌లు, మ్యుచువల్ ఫండ్స్ మధ్య ప్రధాన తేడాల‌ను పరిశీలిస్తే.. ట్రేడింగ్, లిక్విడిటీ పరంగా ఈటీఎఫ్‌లు స్టాక్‌ల మాదిరిగానే ఎక్స్‌చేంజ్‌లో రోజంతా ట్రేడ్ అవుతాయి. దీంతో ఇవి ఎక్కువ లిక్విడిటీని కలిగి ఉంటాయి. మ్యుచువల్ ఫండ్స్ మాత్రం రోజు ముగిసిన తర్వాత ఎన్‌ఏవీ ధర వద్ద మాత్రమే కొనుగోలు లేదా విక్రయం చేయవచ్చు. వ్యయ నిర్మాణం విషయంలో ఈటీఎఫ్‌ల ఎక్స్‌పెన్స్ రేషియో సాధారణంగా తక్కువగా ఉంటుంది. మ్యుచువల్ ఫండ్స్‌లో ఫండ్ మేనేజ్‌మెంట్ ఫీజులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

ఈటీఎఫ్‌ల‌లో పార‌ద‌ర్శ‌క‌త ఎక్కువ‌..

పెట్టుబడి విధానంలో ఈటీఎఫ్‌ల‌ను పాసివ్‌గా నిర్వహిస్తారు. ఇవి ఒక నిర్దిష్ట ఇండెక్స్‌ను అనుసరిస్తాయి కాబట్టి పారదర్శకత ఎక్కువగా ఉండటంతోపాటు రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. మ్యుచువల్ ఫండ్స్ ను యాక్టివ్‌గా నిర్వహిస్తారు. ఫండ్ మేనేజర్లు మార్కెట్ పరిస్థితులను విశ్లేషించి పెట్టుబడులు కేటాయిస్తారు. కనీస పెట్టుబడి పరంగా ఈటీఎఫ్‌లలో చిన్న మొత్తాలతోనే పెట్టుబడి ప్రారంభించే అవకాశం ఉంటుంది. మ్యుచువల్ ఫండ్స్‌లో కొన్ని పథకాలు ఎక్కువ కనీస పెట్టుబడిని కోరుతాయి. పన్నుల పరంగా ఈటీఎఫ్‌లు సాధారణంగా ఎక్కువ పన్ను సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. క్యాపిటల్ గెయిన్స్ పన్ను ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మ్యుచువల్ ఫండ్స్‌లో పన్ను ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుంది. వైవిధ్య పరంగా ఈటీఎఫ్‌లు ఒక నిర్దిష్ట ఇండెక్స్‌ను అనుసరించే లక్ష్యిత పెట్టుబడిని అందిస్తాయి. మ్యుచువల్ ఫండ్స్ మాత్రం విభిన్న రకాల సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే విస్తృత అవకాశాలను కల్పిస్తాయి.

ఏది ఉత్త‌మం..

భార‌త రిటైల్ పెట్టుబడిదారుల్లో ఈటీఎఫ్‌లు, మ్యుచువల్ ఫండ్స్ రెండూ విస్తృత ఆదరణ పొందుతున్నాయి. అయితే పెట్టుబడి విధానం, ట్రేడింగ్ పద్ధతి, వ్యయాలు, పన్ను విధానం వంటి అంశాల్లో రెండింటి మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ఈటీఎఫ్‌లు మార్కెట్ సమయాల్లో ఎప్పుడైనా రియల్‌టైమ్ ధరల వద్ద ట్రేడ్ అవుతాయి. మ్యుచువల్ ఫండ్స్ మాత్రం రోజు ముగిసిన తర్వాత ఎన్‌ఏవీ ఆధారంగా మాత్రమే లావాదేవీలు జరుగుతాయి. పాసివ్ పెట్టుబడి విధానం కారణంగా చాలా ఈటీఎఫ్‌లలో ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. అలాగే పోర్ట్‌ఫోలియోలోని షేర్లను తరచూ విక్రయించాల్సిన అవసరం లేకపోవడంతో క్యాపిటల్ గెయిన్స్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండు పెట్టుబడి సాధనాలకు వాటి ప్రత్యేక ప్రయోజనాలు, పరిమితులు ఉన్నాయి. అందువల్ల పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ భరించే సామర్థ్యం, పెట్టుబడి కాలవ్యవధిని విశ్లేషించి తమకు సరిపోయే ఎంపికను ఎంచుకోవ‌డం ఉత్తమం.

Advertisement
Advertisement