Ethanol | చక్కెర ధర పెరుగుదలను ఇథనాల్‌తో ముడిపెట్టొద్దు: నిపుణులు
Ethanol | దేశంలో చక్కెర ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ విధానంపై మళ్లీ చర్చ మొదలైంది. అయితే చక్కెరను ఇథనాల్ తయారీకి మళ్లించడం వల్లే ధరలు పెరిగాయన్న వాదనను కేంద్ర ప్రభుత్వం, పలువురు చక్కెర రంగ నిపుణులు తోసిపుచ్చుతున్నారు.
Ethanol | దేశంలో చక్కెర ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ విధానంపై మళ్లీ చర్చ మొదలైంది. అయితే చక్కెరను ఇథనాల్ తయారీకి మళ్లించడం వల్లే ధరలు పెరిగాయన్న వాదనను కేంద్ర ప్రభుత్వం, పలువురు చక్కెర రంగ నిపుణులు తోసిపుచ్చుతున్నారు. ప్రస్తుతం ధరల పెరుగుదలకు చెరకు ఉత్పత్తి తగ్గడం, చెరకు పంటకు తెగుళ్లు, వర్షాల కారణంగా పంట నష్టం, పండుగల సీజన్‌లో డిమాండ్ పెరగడం, వ్యాపారులు నిల్వలు పెంచుకోవడం వంటి అనేక కారణాలు కలిసి పనిచేశాయని వారు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో చక్కెర ధరలు భారీగా పెరిగాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ప్రకారం.. కిలో చక్కెర సగటు ధర జూలై 20న రూ.48.18గా ఉండగా, ఆగస్టు 20 నాటికి రూ.55.70కు చేరింది. అంటే నెల రోజుల్లోనే సుమారు 15.6 శాతం పెరుగుదల నమోదైంది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో వదులుగా విక్రయించే చక్కెర ధర కిలోకు రూ.75-80 వరకు చేరినట్లు నిపుణులను ఉటంకిస్తూ పీటీఐ తెలిపింది.
37 లక్షల టన్నుల లోటు..
అయితే ఈ ధరల పెరుగుదలకు ఇథనాల్‌ను కారణంగా చూపడం సరికాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2022-23లో ఇథనాల్ తయారీ కోసం మళ్లించిన చక్కెర వాటా సుమారు 12 శాతం ఉండగా, 2025-26లో అది సుమారు 9 శాతానికి తగ్గిందని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా దేశంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌లో దాదాపు మూడు వంతులు ధాన్యాల నుంచి, ముఖ్యంగా మొక్కజొన్న నుంచి వస్తోందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం.. ప్రస్తుత చక్కెర సీజన్‌లో ఉత్పత్తి తొలుత అంచనా వేసిన 343 లక్షల టన్నులతో పోలిస్తే సుమారు 306 లక్షల టన్నులకు తగ్గే అవకాశం ఉందని వెల్లడైంది. చెరకు పంటలో రెడ్ రాట్, టాప్ బోరర్ వంటి తెగుళ్లతోపాటు అధిక వర్షాల కారణంగా నీరు నిలిచిపోవడం పంట దిగుబడిని దెబ్బతీసిందని ప్రభుత్వం తెలిపింది. అంటే అంచనాతో పోలిస్తే ఉత్పత్తిలో దాదాపు 37 లక్షల టన్నుల లోటు ఏర్పడింది.
తగ్గిన చెరకు సాగు విస్తీర్ణం..
చెరకు సాగు విస్తీర్ణం తగ్గుతున్న విషయాన్ని కూడా నిపుణులు ప్రస్తావిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో చెరకు సాగు విస్తీర్ణం 2022-23లో 58.85 లక్షల హెక్టార్లకు పైగా ఉండగా, 2024-25లో సుమారు 54.50 లక్షల హెక్టార్లకు తగ్గింది. ఇదే సమయంలో చెరకు ఉత్పత్తి కూడా 2022-23లో సుమారు 490.5 మిలియన్ టన్నుల నుంచి 2024-25లో సుమారు 453.2 మిలియన్ టన్నులకు తగ్గింది. చెరకు లభ్యత తగ్గడం చివరకు చక్కెర ఉత్పత్తిపైనా ప్రభావం చూపుతోంది. మహారాష్ట్రలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ మాజీ అధ్యక్షుడు జయప్రకాశ్ దండేగావ్‌కర్ ప్రకారం.. రాష్ట్రంలో చక్కెర మిల్లులు గతంలో సుమారు 150 రోజుల పాటు చెరకు క్రషింగ్ నిర్వహించేవి. ఇప్పుడు ఆ కాలం దాదాపు 100 రోజులకు తగ్గిపోయింది. చెరకు రైతులకు చెల్లించే న్యాయబద్ధమైన, లాభదాయక ధర టన్నుకు రూ.3,650గా ఉండగా, చక్కెరకు కనీస విక్రయ ధర కిలోకు రూ.31 అంటే టన్నుకు రూ.3,100గా ఉండటంతో మిల్లులపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని ఆయన చెప్పారు.

వ్యాపారుల నిల్వలు..
చక్కెర ధరల పెరుగుదలలో వ్యాపారుల నిల్వలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో చెరకు, చక్కెర ఉత్పత్తి మరింత తగ్గవచ్చన్న అంచనాలతో కొందరు వ్యాపారులు ముందుగానే పెద్ద మొత్తంలో చక్కెర కొనుగోలు చేసి నిల్వ చేశారని వెస్ట్ ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భైరవనాథ్ థోంబ్రే తెలిపారు. దీనివల్ల మార్కెట్లో తక్షణ సరఫరా తగ్గి ధరలపై మరింత ఒత్తిడి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. పండుగల సీజన్ కూడా ధరల పెరుగుదలకు మరో ప్రధాన కారణంగా మారింది. ఆగస్టు నుంచి నవంబర్ వరకు గణేశ్ చతుర్థి, దసరా, దీపావళి వంటి పండుగలు వరుసగా రావడంతో స్వీట్లు, బిస్కెట్లు, శీతల పానీయాలు, ఇతర ఆహార ఉత్పత్తుల తయారీలో చక్కెరకు డిమాండ్ పెరుగుతుంది. పెద్ద మొత్తంలో చక్కెర వినియోగించే సంస్థలు కొరత ఏర్పడకముందే నిల్వలు పెంచుకోవడం ప్రారంభించడంతో ధరలపై అదనపు ఒత్తిడి ఏర్పడింది.
ఆగస్టులో 10 శాతం పెరిగిన ధరలు..
రాయిటర్స్ ప్రకారం.. దేశీయ చక్కెర ధరలు ఆగస్టు ప్రారంభానికి ముందు నెలలోనే సుమారు 10 శాతం పెరిగాయి. మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రధాన మార్కెట్లో టోకు చక్కెర ధర క్వింటాల్‌కు రూ.4,716కు చేరింది. మిల్లులు తమ వద్ద ఉన్న నిల్వలను ఒకేసారి మార్కెట్లోకి విడుదల చేయకుండా, ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాతో దశలవారీగా విక్రయిస్తున్నాయని వ్యాపార వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో అక్టోబర్ 1 నాటికి మిల్లుల వద్ద మిగిలే చక్కెర నిల్వలు సుమారు 35 లక్షల టన్నులకు పడిపోవచ్చని అంచనాలు వెలువడ్డాయి. ఇది మూడు దశాబ్దాలకు పైగా కనిష్ట స్థాయిగా ఉండొచ్చని రాయిటర్స్ పేర్కొంది. ప్రస్తుత సీజన్‌లో ఉత్పత్తి వినియోగ అవసరాలకు తగ్గడం, ఇప్పటికే కొంత చక్కెర ఎగుమతి కావడం వల్ల కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యే వరకు సరఫరాపై ఒత్తిడి కొనసాగుతుందన్న ఆందోళన ఉంది.
ఇథనాల్ కోసం 31 లక్షల టన్నులు..
అయితే ఇథనాల్ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టలేమన్న వాదన కూడా ఉంది. ఇథనాల్ తయారీకి మళ్లించే చక్కెర పరిమాణం గతంతో పోలిస్తే తగ్గినప్పటికీ, పరిశ్రమ గణాంకాల్లో ఈ సీజన్‌కు సుమారు 31 లక్షల టన్నుల చక్కెరను ఇథనాల్ కోసం మళ్లించినట్లు అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత ధరల సంక్షోభానికి అదే ప్రధాన కారణమని చెప్పడానికి సరిపడా ఆధారం లేదని నిపుణులు చెబుతున్నారు. అధికారికంగా కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇథనాల్ విధానం చక్కెర మిల్లుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిందని. సాధారణంగా భారత్‌లో సంవత్సరానికి 320-340 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి కాగా, దేశీయ వినియోగం సుమారు 280-290 లక్షల టన్నులుగా ఉంటుంది. అధిక ఉత్పత్తి ఉన్న సంవత్సరాల్లో మిగిలిపోయే చక్కెర నిల్వలు మిల్లుల నిధులను బ్లాక్ చేయడంతో పాటు రైతులకు చెరకు బకాయిల చెల్లింపులను ఆలస్యం చేసే పరిస్థితి ఉండేది. అదనపు చక్కెరను ఇథనాల్ వైపు మళ్లించడం ద్వారా ఈ సమస్య కొంతవరకు పరిష్కారమైందని ప్రభుత్వం చెబుతోంది. 2025-26 సీజన్‌కు సంబంధించి ఆగస్టు 20 నాటికి చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో 97 శాతం ఇప్పటికే చెల్లించినట్లు కేంద్రం తెలిపింది.

నిల్వలపై పరిమితి..
చక్కెర ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా చక్కెర డీలర్లపై 400 టన్నుల నిల్వ పరిమితి విధించింది. ఈ పరిమితి నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి నెలకు 10 టన్నులకు పైగా చక్కెర వినియోగించే పెద్ద సంస్థలు 15 రోజుల వినియోగానికి మించి నిల్వ చేసుకోకుండా కొత్త నిబంధన తీసుకొచ్చింది. నిల్వలు దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలను పరిశీలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త బృందాలు చక్కెర మిల్లుల్లో భౌతికంగా నిల్వలను తనిఖీ చేస్తున్నాయి. మరోవైపు దేశీయ సరఫరాను పెంచేందుకు ఒక మిలియన్ టన్నుల అంటే 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది. అక్టోబర్ 31 వరకు ఈ దిగుమతులకు అవకాశం ఉంటుంది.
10 ఏళ్ల తరువాత ఇప్పుడే..
దాదాపు పదేళ్ల తర్వాత భారత్ భారీ స్థాయిలో చక్కెర దిగుమతులకు అనుమతించడం ఈ సంక్షోభ తీవ్రతను సూచిస్తోంది. ఈ దిగుమతుల్లో ఎక్కువ భాగం బ్రెజిల్ నుంచి వచ్చే అవకాశం ఉంది. సముద్ర రవాణాకు దాదాపు రెండు నెలలు పట్టే అవకాశం ఉండటంతో దిగుమతుల ప్రభావం అక్టోబర్ నుంచి దేశీయ మార్కెట్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే భారత్‌లో దిగుమతి అయ్యి పోర్టుల వద్ద ఉన్న ముడి చక్కెరను శుద్ధి చేసి దేశీయ మార్కెట్లో విక్రయించేందుకు కూడా కొన్ని రిఫైనరీలకు అవకాశం కల్పించారు. కొత్త చెరకు క్రషింగ్ సీజన్‌ను కూడా ముందుకు తీసుకురావాలని కేంద్రం సూచించింది. అక్టోబర్ 15 నుంచే మిల్లులు క్రషింగ్ ప్రారంభించాలని రాష్ట్రాలు, చక్కెర మిల్లులకు సూచించింది. సాధారణంగా అక్టోబర్‌లో 3-4 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి జరిగే పరిస్థితిలో, ఈసారి ముందస్తు క్రషింగ్ ద్వారా నెలలో 10 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. దీంతో పండుగల సమయంలో సరఫరా పెరిగి ధరల ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ లోటు..
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి కూడా భారత్‌పై ప్రభావం చూపుతోంది. 2026-27లో ప్రపంచ చక్కెర మార్కెట్లో సుమారు 33 లక్షల టన్నుల లోటు ఉండొచ్చని కేంద్రం అంచనా వేసింది. వాతావరణ పరిస్థితులపై ఆందోళనల కారణంగా అంతర్జాతీయ చక్కెర ధరలు జూన్ 30న టన్నుకు 474 డాలర్ల నుంచి ఆగస్టు 20 నాటికి 552 డాలర్లకు పెరిగాయి. అంటే రెండు నెలల్లోనే 16 శాతానికి పైగా పెరిగాయి. ఇక రాజకీయంగా కూడా చక్కెర ధరల అంశం వేడెక్కింది. ప్రతిపక్ష పార్టీలు పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం పెరగడం వల్ల చెరకు చక్కెర ఉత్పత్తి నుంచి ఇథనాల్ వైపు మళ్లిందని, దాని ప్రభావమే ధరల పెరుగుదలగా మారిందని కేంద్రాన్ని విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా ఈ-20 ఇంధన విధానాన్ని చక్కెర ధరలతో అనుసంధానిస్తూ విమర్శలు వచ్చాయి. అయితే కేంద్రం మాత్రం ప్రస్తుత ధరల పెరుగుదలకు ఇథనాల్‌ను ప్రధాన కారణంగా చూపడం వాస్తవ పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకోవడమేనని చెబుతోంది.

ఇథనాల్ ఒక్కటే కారణమా..?
ప్రస్తుత చక్కెర ధరల పెరుగుదల వెనుక ఒకే ఒక్క కారణం లేదని స్పష్టమవుతోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ చెరకు దిగుబడి, తెగుళ్లు, వాతావరణ నష్టం, తక్కువ చక్కెర ఉత్పత్తి, పండుగల డిమాండ్, వ్యాపారుల నిల్వలు, మిల్లులు నిల్వలను నెమ్మదిగా విడుదల చేయడం, అంతర్జాతీయ మార్కెట్‌లో సరఫరా కొరత వంటి అంశాలు కలిసి ధరలను పైకి నెట్టాయని అంటున్నారు. ఇథనాల్‌కు మళ్లించిన చక్కెర కూడా సరఫరా సమీకరణంలో ఒక అంశమే అయినప్పటికీ, ప్రస్తుత ధరల పెరుగుదలకు అదే ప్రధాన కారణమని చెప్పడం కంటే బహుళ కారణాలను పరిగణనలోకి తీసుకోవడం సరైందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ దృష్టి అక్టోబర్‌పై ఉంది. ఒకవైపు దిగుమతి చేసిన చక్కెర దేశీయ మార్కెట్లోకి రావడం, మరోవైపు కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభం కావడం వల్ల సరఫరా పెరిగే అవకాశం ఉంది. అయితే పండుగల డిమాండ్, అంతర్జాతీయ ధరలు, మిల్లులు నిల్వలను ఎంత వేగంగా విడుదల చేస్తాయన్న అంశాలు కూడా కీలకంగా మారనున్నాయి. అందువల్ల సమీప కాలంలో చక్కెర ధరలు పూర్తిగా తగ్గుతాయని చెప్పడం కష్టం. కానీ దిగుమతులు, ముందస్తు క్రషింగ్, నిల్వలపై నియంత్రణలు సమర్థవంతంగా అమలైతే ధరల పెరుగుదలకు కొంత బ్రేక్ పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
- ●స్కిల్స్ వర్సిటీ వర్సెస్ పాలిటెక్నిక్: 'జీవో 97'తో విద్యార్థులకు లాభమా? నష్టమా?
- ●DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ
- ●UPI | యూపీఐకి పదేళ్లు.. వృద్ధి ప్రయాణంలో 2026 ఏడాది కీలకం
- ●Payal Shankar | విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన రేవంత్‌కు కనిపిస్తలేదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్
- ●Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!
- ●Tollywood | మైథలాజికల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ కమెడియన్

స్కిల్స్ వర్సిటీ వర్సెస్ పాలిటెక్నిక్: 'జీవో 97'తో విద్యార్థులకు లాభమా? నష్టమా?

DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ

UPI | యూపీఐకి పదేళ్లు.. వృద్ధి ప్రయాణంలో 2026 ఏడాది కీలకం

Payal Shankar | విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన రేవంత్‌కు కనిపిస్తలేదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్






