త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bitcoin | బిట్‌కాయిన్‌కు డేంజర్ బెల్స్‌..? డెడ్ జోన్‌లోకి ప్రవేశం..

Bitcoin | ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ 2025 అక్టోబర్‌లో నమోదైన 1.26 లక్షల డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి నుంచి దాదాపు 50 శాతం పతనమై ప్రస్తుతం సుమారు 62,500 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ భారీ పతనంతో బిట్‌కాయిన్, పెట్టుబడిదారులు విస్తృతంగా అనుసరించే బిట్‌కాయిన్ రెయిన్‌బో చార్ట్ లోని అత్యల్ప బ్యాండ్ కంటే కూడా దిగువకు చేరుకుంది.

S

Business | Published On Jun 26, 2026, 11.56 am IST

Bitcoin | బిట్‌కాయిన్‌కు డేంజర్ బెల్స్‌..? డెడ్ జోన్‌లోకి ప్రవేశం..
Advertisement

Bitcoin | ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ 2025 అక్టోబర్‌లో నమోదైన 1.26 లక్షల డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి నుంచి దాదాపు 50 శాతం పతనమై ప్రస్తుతం సుమారు 62,500 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ భారీ పతనంతో బిట్‌కాయిన్, పెట్టుబడిదారులు విస్తృతంగా అనుసరించే బిట్‌కాయిన్ రెయిన్‌బో చార్ట్ లోని అత్యల్ప బ్యాండ్ కంటే కూడా దిగువకు చేరుకుంది. దీంతో బిట్‌కాయిన్ ఇప్పుడు ఆ చార్ట్‌లో అత్యంత ప్రతికూలంగా భావించే పర్పుల్ రంగు, బిట్‌కాయిన్ ఈజ్ డెడ్ జోన్‌లోకి ప్రవేశించింది. 2022 బేర్ మార్కెట్ సమయంలో మాత్రమే ఇంతకుముందు ఒకసారి ఈ స్థాయిని బిట్‌కాయిన్ తాకింది. చరిత్రను పరిశీలిస్తే, ఈ జోన్ మార్కెట్లో తీవ్ర నిరాశను సూచించినప్పటికీ, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు అత్యుత్తమ కొనుగోలు అవకాశాలను కూడా అందించింది. అయితే ఈసారి చర్చ మాత్రం మరో దిశగా సాగుతోంది. క్రిప్టో ప్రపంచంలో అత్యంత పాత విలువ నిర్ధారణ మోడళ్లలో ఒకటిగా భావించే రెయిన్‌బో చార్ట్ త‌న ప్రాభ‌వాన్ని కోల్పోయిందా అనే ప్రశ్నలు త‌లెత్తుతున్నాయి.

మార్కెట్ భావోద్వేగాన్ని సూచిస్తుందా..

బిట్‌కాయిన్ రెయిన్‌బో చార్ట్‌ను 2014లో రెడ్డిట్ యూజర్ అజోప్ రూపొందించారు. ఇది బిట్‌కాయిన్‌కు అసలు విలువను లెక్కించే మోడల్ కాదు. బిట్‌కాయిన్ దీర్ఘకాల ధరల చరిత్రపై లాగరిథమిక్ రిగ్రెషన్ కర్వ్‌ను అమర్చి, దానిని వివిధ రంగుల బ్యాండ్లుగా విభజించి మార్కెట్ భావోద్వేగాలను చూపించే విజువల్ సూచిక మాత్రమే. ఈ చార్ట్‌లో దిగువ భాగంలోని ఫైర్ సేల్ నుంచి బిట్‌కాయిన్ ఈజ్ డెడ్ వరకు ఉన్న బ్యాండ్లు తీవ్ర నిరాశను సూచిస్తే, ఎగువ భాగంలోని ఎరుపు బ్యాండ్లు అత్యధిక ఉత్సాహంతో కూడిన బుల్ మార్కెట్ శిఖరాలను సూచిస్తాయి. అయితే ఈ చార్ట్ సృష్టికర్త మొదటి నుంచే దీనిని శాస్త్రీయ అంచనా సాధనంగా చూడవద్దని స్పష్టం చేశారు. అధికారిక బిట్‌కాయిన్ రెయిన్‌బో చార్ట్ వెబ్‌సైట్‌లో ఈ సూచికను ఆయన ఒక మీమ్, ఒక జోక్ గా అభివర్ణించారు. 2022 బేర్ మార్కెట్‌లో బిట్‌కాయిన్ ఈ చార్ట్ కంటే దిగువకు పడిపోయిన తర్వాత, ది రెయిన్‌బో చార్ట్ ఈజ్ డెడ్ - లాంగ్ లివ్ ది రెయిన్‌బో చార్ట్ అనే బ్లాగ్‌ను ప్రచురించారు. చార్ట్‌ను పూర్తిగా విరమించకుండా, దాదాపు పదేళ్ల అదనపు ధరల డేటాతో కొత్త వెర్షన్‌ను రూపొందించారు.

స‌వ‌రించిన మోడ‌ల్‌లోనూ ప్ర‌తికూల సంకేతాలు..

వెర్షన్ 2లో పాత రంగుల బ్యాండ్లను కొనసాగించినప్పటికీ, బిట్‌కాయిన్ దీర్ఘకాల వృద్ధి వేగం తగ్గుతున్న వాస్తవాన్ని ప్రతిబింబించేలా కొత్త లాగరిథమిక్ కర్వ్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ ఆ సవరించిన మోడల్ కంటే కూడా దిగువకు పడిపోవడం విశేషం. క్రిప్టో కమ్యూనిటీలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ క్రిప్టో విశ్లేషకుడు క్రిప్టోరోవర్ ఎక్స్‌లో పెట్టిన పోస్టులో, 2022 చివర్లో కూడా బిట్‌కాయిన్ ఇదే జోన్‌లోకి ప్రవేశించిందని, అనంతరం భారీ బుల్ ర్యాలీతో కొత్త గరిష్టాలను నమోదు చేసిందని గుర్తు చేశారు. మరోవైపు, కొందరు విశ్లేషకులు ఇది బిట్‌కాయిన్ బలహీనత కాదని, పాత మోడళ్ల పరిమితిని మాత్రమే చూపుతోందని అంటున్నారు. బ్లాక్‌చైన్ ప్లాట్‌ఫామ్ ఎక్స్‌వైఓ సహ వ్యవస్థాపకుడు మార్కస్ లెవిన్ మాట్లాడుతూ, ఇది బిట్‌కాయిన్‌లో వచ్చిన మార్పు కాదని, రెయిన్‌బో చార్ట్ మోడల్‌లో నిర్మాణాత్మక మార్పు అవసరమని సూచిస్తోందన్నారు. తాను దీన్ని బిట్‌కాయిన్ డెడ్ అయిందని చూడడం లేద‌ని, రెయిన్‌బో చార్ట్ కాలం చెల్లిందని మాత్రమే చూస్తున్నాన‌ని అన్నారు. వాస్తవానికి అది బిట్‌కాయిన్ మరింత పరిపక్వత సాధించిందనే సంకేతం అని ఆయన పేర్కొన్నారు.

భ‌విష్య‌త్ ధ‌ర‌ల‌ను అంచ‌నా వేయ‌దు..

క్రిప్టో ఎక్స్చేంజ్ బిట్ గెట్ చీఫ్ అనలిస్ట్ ర్యాన్ లీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెయిన్‌బో చార్ట్ ఇప్పటికీ దీర్ఘకాల మార్కెట్ చక్రాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని, కానీ భవిష్యత్ ధరలను అంచనా వేసే సాధనంగా చూడకూడదని అన్నారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ ధరలపై సంస్థాగత పెట్టుబడిదారులు, స్పాట్ ఈటీఎఫ్‌లు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, గ్లోబల్ లిక్విడిటీ వంటి అంశాలు గణనీయమైన ప్రభావం చూపుతున్నాయని ఆయన వివరించారు. రెయిన్‌బో చార్ట్ మాత్రమే కాదు, గతంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్టాక్-టు-ఫ్లో (ఎస్2ఎఫ్) మోడల్ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 2019లో ప్లాన్‌బీ అనే విశ్లేషకుడు ప్రవేశపెట్టిన ఈ మోడల్, ప్రతి హాల్వింగ్ తర్వాత సరఫరా తగ్గడంతో బిట్‌కాయిన్ ధర భారీగా పెరుగుతుందని అంచనా వేసింది. 2024 హాల్వింగ్ తర్వాత బిట్‌కాయిన్ ధర 5 లక్షల డాలర్లకు చేరుతుందని ఈ మోడల్ సూచించింది. కానీ వాస్తవంలో బిట్‌కాయిన్ గరిష్టంగా సుమారు 1.26 లక్షల డాలర్ల వరకు మాత్రమే చేరుకుని, అక్కడి నుంచి భారీగా పడిపోవడంతో ఈ మోడల్ కూడా విఫలమైందని అనేక మంది విశ్లేషకులు చెబుతున్నా,రు.

బిట్ కాయిన్ డెడ్ అయిందా..?

రెయిన్‌బో చార్ట్ సృష్టికర్త కూడా తన‌ వెబ్‌సైట్‌లో స్టాక్-టు-ఫ్లో మోడల్‌పై విమర్శలు చేశారు. రెయిన్‌బో చార్ట్‌ను తాను ఎప్పుడూ సరదా విజువలైజేషన్‌గా మాత్రమే రూపొందించానని, కానీ స్టాక్-టు-ఫ్లో మోడల్ మాత్రం డిమాండ్ ప్రభావాన్ని పూర్తిగా పక్కనపెట్టి గణాంకపరంగా బలమైన విలువ నిర్ధారణ విధానంగా ప్రచారం చేసిందని అన్నారు. అయితే బిట్‌కాయిన్ మాత్రం డెడ్ అవ్వ‌లేదు. సంస్థాగత పెట్టుబడులు పెరుగుతున్నాయి. స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లు పెట్టుబడిదారుల నిర్మాణాన్ని పూర్తిగా మార్చేశాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు బిట్‌కాయిన్ ధరలపై మరింత ప్రభావం చూపుతున్నాయి. ఇదే సమయంలో, బిట్‌కాయిన్ ప్రారంభ దశ ధరల చరిత్ర ఆధారంగా రూపొందించిన పాత మోడళ్లు కాలానుగుణంగా తమ ప్రాముఖ్యతను కోల్పోతున్నాయని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.

పెట్టుబ‌డిదారులు అప్ర‌మత్తంగా ఉండాలి..

కాయిన్‌స్విచ్ మార్కెట్స్ డెస్క్ తెలిపిన‌ ప్రకారం, బిట్‌కాయిన్ 60 వేల డాలర్ల దిగువకు పడిపోవడానికి ప్రధాన కారణాలు స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ల నుంచి నిధుల ఉపసంహరణలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన ద్రవ్య విధానం, అలాగే బలపడుతున్న అమెరికన్ డాలర్ అని విశ్లేష‌కులు చెబుతున్నారు. చార్ట్ ప్రకారం 61,800 నుంచి 62,000 డాలర్ల మధ్య ఉన్న లిక్విడిటీ జోన్ ధరను ఆ దిశగా ఆకర్షించే అవకాశం ఉంద‌ని, అయితే అదే స్థాయి తిరిగి నిరోధకంగా కూడా మార‌వ‌చ్చ‌ని, ఒకవేళ ప్రస్తుత మద్దతు స్థాయిలు కోల్పోతే, 55 వేల డాలర్ల వరకు బిట్‌కాయిన్ పడిపోయే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ధర దిశను ఊహించే ప్రయత్నం కంటే రిస్క్ మేనేజ్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం చాలా మంది బిట్‌కాయిన్ ప్ర‌స్తుతం ఎటు వైపు క‌దులుతుంది, కనిష్టాల వ‌ద్ద ఉంది క‌నుక మ‌ళ్లీ మునుప‌టిలా బుల్ ర్యాలీ ఇదే స్థాయిల నుంచి వ‌స్తుందా, లేక ఇంకా ధ‌ర ప‌డిపోతుందా అని ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే బిట్ కాయిన్ పెట్టుబ‌డుల విష‌యంలో ఈ స‌మ‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement