త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CBI | రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కేసులో మరో ఛార్జ్‌షీట్‌.. 11 మందిపై సీబీఐ కేసు..

CBI | రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కేసులో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) రెండో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. అక్టోబర్‌ 1న ముంబైలోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఈ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసినట్లు సీబీఐ తెలిపింది. ఇందులో రిలయన్స్‌ ఏడీఏ గ్రూప్‌నకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లతోపాటు మొత్తం 11 మంది నిందితులను పేర్కొంది.

S

Business | Published On Oct 1, 2026, 5.51 pm IST

CBI | రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కేసులో మరో ఛార్జ్‌షీట్‌.. 11 మందిపై సీబీఐ కేసు..
Advertisement

CBI | రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కేసులో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) రెండో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. అక్టోబర్‌ 1న ముంబైలోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఈ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసినట్లు సీబీఐ తెలిపింది. ఇందులో రిలయన్స్‌ ఏడీఏ గ్రూప్‌నకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లతోపాటు మొత్తం 11 మంది నిందితులను పేర్కొంది. ఈ కేసులో రిలయన్స్‌ ఏడీఏ గ్రూప్‌ నామినీ అమిత్‌ బాప్నా, ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్ అమితాబ్‌ ఝున్‌ఝున్‌వాలా, ఆర్‌సీఎల్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ చైర్మన్ సురేశ్‌ నాగరాజన్‌, రిలయన్స్‌ పవర్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌లను నిందితులుగా చేర్చారు. వీరితో పాటు రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ పవర్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ బిగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ బ్రాడ్‌కాస్ట్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ బిజినెస్‌ బ్రాడ్‌కాస్ట్‌ న్యూస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ మీడియావర్క్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కుంజ్‌బిహారి డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే ఏడు కంపెనీలను, అలాగే ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌, స్టాట్యూటరీ ఆడిటర్‌ విజయ్‌ నపావాలియాను నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై భారతీయ శిక్షాస్మృతి కింద నేరపూరిత కుట్ర, మోసం తదితర అభియోగాలు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది.

రూ.7,400 కోట్లు దారి మ‌ళ్లింపు..

ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సీబీఐ పేర్కొంది. రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అప్పుగా తీసుకున్న రూ.7,429.16 కోట్ల నిధులను రుణదాతలు నిర్దేశించిన నిబంధనలు, షరతులకు విరుద్ధంగా మధ్యవర్తి, కండ్యూట్‌ సంస్థల ద్వారా వివిధ రిలయన్స్‌ ఏడీఏ గ్రూప్‌ కంపెనీలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపింది. దీంతో రుణాలు అందించిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తప్పుడు నష్టం ఏర్పడగా, నిందితులు, సంబంధిత సంస్థలకు తప్పుడు లాభం చేకూరినట్లు సీబీఐ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, గతంలో ఆంధ్రా బ్యాంక్‌, అలాగే ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియం ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో తొలి ఛార్జ్‌షీట్‌ను గ‌త జూలై 9న నలుగురు నిందితులపై దాఖలు చేసింది. తాజాగా రెండో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయడంతో ఇప్పటివరకు ఈ కేసులో సీనియర్‌ అధికారులు, గ్రూప్‌ కంపెనీలతో సహా మొత్తం 15 మంది నిందితులపై ఛార్జ్‌షీట్‌లు దాఖలయ్యాయి. ఇతర నిందితుల పాత్ర, మరిన్ని ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ వెల్లడించింది.

9 ఎఫ్ఐఆర్‌లు న‌మోదు..

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌కామ్‌), రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌), రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌), రిలయన్స్‌ టెలికామ్‌ లిమిటెడ్‌ (ఆర్‌టీఎల్‌), రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎల్‌)పై కూడా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్‌ఐసీ, ఈపీఎఫ్‌ఓ నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా సీబీఐ దర్యాప్తు సంస్థలోని బ్యాంకింగ్‌ సెక్యూరిటీస్‌ ఫ్రాడ్‌ బ్రాంచ్‌, ఢిల్లీ ద్వారా తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. రిలయన్స్‌ ఏడీఏ గ్రూప్‌ కేసుల్లో సీబీఐ ఇప్పటికే ఆరు ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేసింది. తాజా ఛార్జ్‌షీట్‌ ఏడోది కాగా, ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీబీఐ తెలిపింది. ఈ కేసుల దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. ఈ కేసుల్లో వేగవంతమైన, సమగ్ర దర్యాప్తును కొనసాగించేందుకు సీబీఐ కట్టుబడి ఉందని వెల్లడించింది.

Advertisement
Advertisement