Harish Rao | ఇక్కడ పంటలు ఎండుతుంటే.. రాజస్థాన్‌కు కరెంటు అమ్ముకుంటరా?
Harish Rao | తెలంగాణలో కరెంటు లేక పంటలు ఎండుతుంటే రాజస్థాన్‌కు సింగరేణి కరెంటు ఎందుకు అమ్ముతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. రాజస్థాన్ కు 800 మెగావాట్ల విద్యుత్ విక్రయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జాయింట్ వెంచర్ చేసుకుందని నిలదీశారు.
- లో వోల్టేజ్ కారణంగా మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతూ రైతులపై ఆర్థిక భారం పడుతోంది
- 2 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్ లో ఉన్నయ్
- కింది మడి పారుతలేదని రైతులు బాధపడుతున్నరు.. సరిపడా కరెంటు ఇవ్వాల్సిందే
- మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్
Harish Rao | త్రినేత్ర న్యూస్: తెలంగాణలో కరెంటు లేక పంటలు ఎండుతుంటే రాజస్థాన్‌కు సింగరేణి కరెంటు ఎందుకు అమ్ముతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. రాజస్థాన్ కు 800 మెగావాట్ల విద్యుత్ విక్రయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జాయింట్ వెంచర్ చేసుకుందని నిలదీశారు. సంవత్సర కాలంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గురువారం నంగునూరు మండలం పాలమాకుల, అక్కనేపల్లి, అంక్షాపూర్ గ్రామాల పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిచోటా లో వోల్టేజ్‌తో మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు.
అసలు పరిస్థితి ఏంటని నర్మెట సబ్ స్టేషన్‌కు వెళ్లి పరిశీలిస్తే.. ఏరోజు కూడా రైతులకు 10 గంటల కరెంటు కూడా రావడం లేదని, కేవలం 7 నుంచి 8 గంటలు మాత్రమే వస్తోందని తేలింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటలకు బదులు 22 గంటలు వస్తేనే గగ్గోలు పెట్టి విమర్శలు చేసిన వాళ్లు.. ఈరోజు కేసీఆర్ ఇచ్చిన దాంట్లో సగం కరెంటు కూడా ఇవ్వలేకపోతున్నారు. అంక్షాపూర్‌లో ఒక యువ రైతు తన ఎనిమిది ఎకరాల పొలం కరెంటు లేక ఎండిపోతోందని ఈరోజు ఎంతో బాధతో నా దృష్టికి తీసుకొచ్చాడు.
పాలమాకులలో మూడు రోజుల క్రితం ట్రాన్స్ ఫార్మర్ కాలిపోతే ఇప్పటికీ ఇవ్వలేదు, కరెంటు లేక పంటలు ఎండుతున్నాయని రైతులు వాపోయారు. నంగునూరులో 3, గట్లమల్యాలలో 2 ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయి మూడు రోజులైనా కొత్తవి ఇవ్వడం లేదు. ఒక్క నంగునూరు మండలంలోనే ఈ వారంలో 41 ట్రాన్స్ ఫార్మర్లు, 100 నుంచి 200 మోటార్లు కాలిపోయాయి. సబ్ స్టేషన్లో మేం చెక్ చేసినప్పుడు 11 కేవీ లైన్ మీద 11.5 వోల్ట్స్ ఉండాల్సింది పోయి, కేవలం 10.5 వోల్ట్స్ మాత్రమే ఉంది. ఈ నాసిరకంలో వోల్టేజ్ కరెంటు వల్లే రైతుల మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయి.
మోటార్ కాలిపోతే దాన్ని తీయడానికి, మళ్లీ ఫిట్ చేయడానికి, కాపర్, వైండింగ్ చార్జీలు అన్నీ కలిపి రైతుకు పది వేల రూపాయల ఆర్థిక భారం పడుతోంది. పైగా రెండు రోజుల పని ఖరాబ్ అవ్వడంతో పాటు పొలం ఎండిపోతోంది. ఇది పూర్తిగా చేతగాని ప్రభుత్వం, ఈ ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనం. ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి ఎందుకు దీని మీద రివ్యూ చేయడం లేదు. మన రాష్ట్రంలో కరెంటు లేదు కానీ.. సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు అమ్ముతామని జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నారు?
రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వకుండా పక్క రాష్ట్రానికి ఎందుకు అమ్ముతున్నారు? మీరు చెప్పిందేమో 24 గంటల కరెంటు, కానీ ఇస్తున్నది కేవలం తొమ్మిది గంటలే. అందులోనూ మధ్యమధ్యలో ట్రిప్ అవుతోంది. మెటీరియల్ లేదనే సాకుతో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను సంవత్సర కాలంగా పెండింగ్ లో పెట్టారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ నెల కనెక్షన్లు ఆ నెలకే రిలీజ్ చేసేవాళ్లం. అప్పుడు 4,500 రూపాయలు ఉన్న డీడీ చార్జీలను ఈ కాంగ్రెస్ వాళ్లు 9,000 రూపాయలకు పెంచారు. అయినా కూడా డీడీలు కట్టిన రైతులకు కనెక్షన్లు ఇవ్వకుండా ఎదురుచూపులు చూసేలా చేస్తున్నారు.
సీఎం గాలిలో తిరిగితే కనిపించవ్
కేసీఆర్ ప్రభుత్వంలో 100 కేవీ, 63 కేవీ ట్రాన్స్ ఫార్మర్లను రోలింగ్ స్టాక్ లో ఉంచేవాళ్లం. కాలిపోగానే పాతది తీసుకుపోయి కొత్తది పెట్టేవాళ్లం. కానీ ఇప్పుడు కాలిపోయిన పాత దాన్ని తీసుకుపోయి, అది రిపేర్ అయ్యేదాకా మూడు రోజులు వెయిట్ చేయిస్తున్నారు, రోలింగ్ స్టాక్ లేదు. మూడు రోజులు ట్రాన్స్ ఫార్మర్ లేకపోతే రైతుల పంటలు ఏమవ్వాలి? మీ ఇంటెలిజెన్స్ కు ఇవేవీ కనబడటం లేదా? ముఖ్యమంత్రి గాలిలో తిరిగితే ఇవి ఎట్లా కనబడతాయి.. నేల మీదకు వచ్చి రైతుల దగ్గరకు వస్తే వాస్తవాలు తెలుస్తాయి.
కోమటిరెడ్డి లాగ్ బుక్కుల కోసం తిరగాలి..
ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండి నీరు కిందికి జారడం లేదు. కాబట్టి లో-వోల్టేజ్ లేకుండా రాత్రి పూట కూడా కలుపుకుని కనీసం 20 గంటల కరెంటును రైతులకు ఇవ్వాలి. రాత్రి పూట కరెంటు ఇస్తేనే మా వెనుకమడి పారుతుందని, పొట్టకొచ్చిన పంట చేతికి వస్తుందని రైతులు అడుగుతున్నారు. అప్పట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కరెంటు రెండు గంటలు తగ్గితే.. లాగ్ బుక్కుల కోసం సబ్ స్టేషన్ల చుట్టూ ఉరికి ఉరికి తిరిగారు. ఇప్పుడు ఎనిమిది గంటలే వస్తుంటే ఎందుకు తిరగడం లేదు? ఆయన ఇప్పుడు కూడా లాగ్ బుక్కుల కోసం తిరగాలి.
రోలింగ్ స్టాక్ పెట్టాలి..
మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే.. రైతులకు 20 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వాలి, ట్రాన్స్ ఫార్మర్లకు రోలింగ్ స్టాక్ పెట్టాలి, కాలిపోయిన వెంటనే కొత్తది ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న 2 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వెంటనే విడుదల చేయాలి, అన్ని జిల్లాల్లోని స్టోర్లలో వ్యవసాయ విద్యుత్‌కు అవసరమైన ఎక్విప్ మెంట్‌ను ప్రభుత్వం స్టాక్ మెయింటైన్ చేయాలి అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Physiotherapists Jobs | జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలు.. వివరాలివే..
- ●Hrithik Roshan | ఐదేళ్ల ప్రేమాయణం - ప్రియురాలితో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన హృతిక్ రోషన్
- ●Adluri Laxman | 33 జిల్లాల్లో వృద్ధాశ్రమాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
- ●KTR | రేవంత్ నల్లమల పులి కాదు.. చంద్రబాబు దగ్గర పిల్లి
- ●CBI | రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కేసులో మరో ఛార్జ్‌షీట్.. 11 మందిపై సీబీఐ కేసు..
- ●India manufacturing PMI September 2026 | దూసుకెళ్లిన భారత తయారీ రంగం: 7 నెలల గరిష్టానికి పీఎంఐ.. భారీగా పెరిగిన ఉద్యోగాలు

Physiotherapists Jobs | జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలు.. వివరాలివే..

Hrithik Roshan | ఐదేళ్ల ప్రేమాయణం - ప్రియురాలితో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన హృతిక్ రోషన్

Adluri Laxman | 33 జిల్లాల్లో వృద్ధాశ్రమాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

KTR | రేవంత్ నల్లమల పులి కాదు.. చంద్రబాబు దగ్గర పిల్లి




