త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రేవంత్ న‌ల్ల‌మ‌ల పులి కాదు.. చంద్ర‌బాబు ద‌గ్గ‌ర పిల్లి

KTR | రేవంత్ రెడ్డి అక్కడికిపోయి ఏదో దండయాత్రకు పోయినట్టు.. ఒక ముఖ్యమంత్రి, ఒక పీసీసీ ప్రెసిడెంట్‌, ఆరుగురు మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు.. ఏదో శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు పోయారు.. మళ్లీ పేరేమో నల్లమల పులి.. ఎక్కడన్నా నల్లమల పులి 4000 పోలీసులను పెట్టుకోని పోతడా.. అంతమందిని కాపాలా పెట్టుకోని పోయిటోడివి.. నువ్వు పులివా.. నువ్వు నల్లమల పులివి కాదు.. చంద్రబాబు దగ్గర పిల్లి నువ్వు.. అని చురకలంటించారు.

S

Telangana | Published On Oct 1, 2026, 5.52 pm IST

KTR | రేవంత్ న‌ల్ల‌మ‌ల పులి కాదు.. చంద్ర‌బాబు ద‌గ్గ‌ర పిల్లి
Advertisement

శ‌త్రు దేశం మీద దండ‌యాత్ర‌కు పోయిన‌ట్టు పోయిండు
నాలుగువేల పోలీసులను పెట్టుకుని పోయిండు
ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్ ఏంటో అర్థమైతలేదు
రేవంత్ రెడ్డిలాగా దోచుకునే అల‌వాటు లేదు
క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్ముతో హోట‌ల్ పెట్టుకున్నా
నా హోట‌ల్‌కు ఫ్రీ ప‌బ్లిసిటీ ఇచ్చినందుకు సంతోషం
తెలంగాణ భ‌వ‌న్‌లో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR | త్రినేత్ర న్యూస్ : రేవంత్ రెడ్డి అక్కడికిపోయి ఏదో దండయాత్రకు పోయినట్టు.. ఒక ముఖ్యమంత్రి, ఒక పీసీసీ ప్రెసిడెంట్‌, ఆరుగురు మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు.. ఏదో శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు పోయారు.. మళ్లీ పేరేమో నల్లమల పులి.. ఎక్కడన్నా నల్లమల పులి 4000 పోలీసులను పెట్టుకోని పోతడా.. అంతమందిని కాపాలా పెట్టుకోని పోయిటోడివి.. నువ్వు పులివా.. నువ్వు నల్లమల పులివి కాదు.. చంద్రబాబు దగ్గర పిల్లి నువ్వు.. అని చురకలంటించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మ‌క్షంలో ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు గులాబీ గూటికి చేరారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రికి కేటీఆర్ పార్టీ కండువాలు క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. అనంత‌రం కేటీఆర్ ప్ర‌సంగించారు.

సిరిసిల్లకు నిన్న ముఖ్యమంత్రి వచ్చిండు.. బీఆర్ఎస్ హయాంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయినై. కాంగ్రెస్ హయాంలో మళ్లీ 35 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నరు. ఉన్న బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఆగిపోయినై, పిల్లల స్కూలు యూనిఫారమ్ ఆర్డర్లు ఆపేసిండు. చనిపోయిన చేనేత కార్మికులకు 10 లేదా 20 లక్షల పరిహారం ప్రకటిస్తడని ఆశించినా.. కానీ ఏం ప్రకటన లేదు. ఆగిపోయిన నేతన్న బీమా గురించి చెబుతడని అనుకున్న. బతుకమ్మ చీరలు ఆపేసిండు.. దాని గురించి చెప్తడని అనుకున్న అని కేటీఆర్ పేర్కొన్నారు.

మా బండారం బయటపెడ్త అన్నావ్..

శత్రుదేశం మీద దండయాత్రకు పోయినట్టు పోయిండు. నల్లమల పులి అంటడు. నాలుగువేల పోలీసులను పెట్టుకుని పోయిండు. నువ్వు నల్లమల పులికాదు.. నువ్వు చంద్రబాబు దగ్గర పిల్లి. మా వాళ్లను ఉదయం నుంచే అరెస్టుచేశారు. దుకాణాలన్నీ బంద్ పెట్టించారు. రేవంత్ రెడ్డి చుట్టూ, పోలీసులు తప్ప అక్కడ ప్రజలు లేనే లేరు. నిన్న మళ్లీ అవే పుక్కిటి పురాణాలు. ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్ ఏంటో అర్థమైతలేదు. ముఖ్యమంత్రి, ఆయన అన్నదమ్ములు, బావమరిది దోచుకుంటున్నారు. మీ బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేదు అని అడిగేసరికి, వెయ్యి కోట్ల టెండర్ ఎలా వచ్చిందని అని అడిగేసరికి ముఖ్యమంత్రికి కోపం వస్తుంది. తొమ్మిదో తరగతి ఫెయిలైన కొండల్ రెడ్డి ఏరోస్పేస్ ఇంజనీరు అయిపోయిండు. రూ. 200 కోట్ల విలువ చేసే భూమి రూ. 7 కోట్లకు ఎట్ల ఇచ్చినవ్ అని అడిగితే కోపం వస్తుంది. రేవంత్ రెడ్డి అన్న జగదీష్ రెడ్డి వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతా అని అమెరికా నుంచి వచ్చిండు. నిన్నటి దాకా ఏం లేనోళ్లు ఇన్ని వేల కోట్లు ఎట్ల పెడుతున్నరు అని అడిగాం. అదానీని దాటిపోయేలా ఉన్నావు.. అనేసరికి రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది. మా బండారం బయటపెడ్త అన్నావ్.. నిన్న ఏం బయటపెట్టినవ్ అని కేటీఆర్ అడిగారు.

నాలుగు పైసలు సంపాదించుకుని ఇండియాకు తిరిగి వచ్చాను

1985లో మొదటి సారి కేసీఆర్ ఎమ్మెల్యే అయ్యారు. తరువాత మంత్రి, డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి అయ్యారు. 43 ఏళ్ల నుంచి శాసనసభ, లేదా పార్లమెంట్‌లో ఉన్నారు. ఆయన ఎప్పుడు మాకు బాగా చదువుకోండి అని చెప్పేవారు. మంచిగా చదువుకుని అమెరికాలో ఆరేళ్లు ఉద్యోగం చేశాను. నాలుగు పైసలు సంపాదించుకుని ఇండియాకు తిరిగి వచ్చాను. 2006లో కేసీఆర్ రాజీనామా చేస్తే నాటి బై ఎలక్షన్ సమయంలో వచ్చి పనిచేశాను. కరీంనగర్‌లో ఆనాడు ఓడిపోతే తెలంగాణ ఉద్యమానికి ఇబ్బంది అని వచ్చాను. రేవంత్ రెడ్డి లెక్క ప్రజల మీద పడి దోచుకునే అలవాటు నాకు లేదు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

వ్యాపారం చేసుకోవడం తప్పా?

ముఖ్యమంత్రి బురదజల్లుతడు.. మనం కడుక్కోవాలె అన్నట్టు ఉంది పరిస్థితి. అమెరికాలో కష్టపడి సంపాదించుకున్న పైసలతో 2006లో ఒక హోటల్ పెట్టాను. అప్పుడు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నారు. 2006లో ఒక హోటల్ పెడితే అది 20 ఏళ్లకు మూడు హోటళ్లు అయ్యింది. అది నేను సరిగా పట్టించుకుని ఉంటే, అది పది హోటళ్లుగా చేసే వాడిని. 2009లో నేను పోటీచేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్‌లో ఆ విషయం చెప్పాను. నిన్న రేవంత్ రెడ్డి మొత్తుకున్నదంతా.. నేను అఫిడవిట్‌లో పెట్టిన విషయమే. నేను అఫిడవిట్లలో చెప్పిన విషయాన్ని… మళ్లీ ఏదో కొలంబస్ క‌నుగొన్నట్టు చెబుతున్నడు.. వ్యాపారం చేసుకోవడం తప్పా? నా భార్యా పిల్లలకు కూడా బువ్వ పెట్టాలె కదా నేను. లేకపోతే రాజకీయంలో ఏం చేస్తున్నవు అని అడుగుతారు. నిన్న ఫ్రీగా నా హోటళ్లకు రేవంత్ పబ్లిసిటీ ఇచ్చినందుకు సంతోషం అని కేటీఆర్ పేర్కొన్నారు.

నిన్ను ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటాం

రేవంత్ రెడ్డి, నీ లాగా మంది మీద పడి దోచుకోలేదు. నువ్వు చదువుకోలే.. నేను చదువుకున్న.. అందరూ డిగ్రీ మూడేళ్లు చదువుతరు, రేవంత్ రెడ్డి ఎనిమిది ఏళ్లు డిగ్రీ చదివిండు. అప్పుడేమో బాండు పేపర్లు రాసి ఇచ్చారు. మూడు నెలల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అన్నారు. మూడేళ్లయినా ఒక్కటైనా అమలు చేశారా..? నువ్వు ఒక్క మాట అంటే వంద మాటలు అనే శక్తి ఉన్నది. నిన్ను ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటాం. కాంగ్రెస్ వాళ్లను బట్టలు ఊడదీసి కొట్టే రోజు దగ్గర్లోనే ఉన్నది అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

రేవంత్ ఏ పార్టీలో కాలు పెడితే ఆ పార్టీ నాశనం

రేవంత్ కంటే పదిరెట్లు బీజేపీ 2014లో హామీలిచ్చింది. 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ చెస్తా అన్నారు మోడీ.. చేశారా. 2022 బుల్లెట్ ట్రేన్ అన్నడు.. ప్రతి ఇంటా నల్లా, ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తా అన్నారు.. ఏదీ చెయ్యలే. మోసపోతే గోసపడ్తం అని కేసీఆరు ఆనాడు చెప్పిన మాట ఇవాళ అక్షరాలా నిజమైంది. అమ్మ విలువ, అన్నం వెలువ లేనప్పుడే తెలుస్తది. గణేష్ నిమజ్జనం రోజు.. ఎందుకు పాటలు పెట్టి ప్రజలు కేసీఆర్‌ని యాది చేసుకుంటున్నరు. కేసీఆర్ వస్తే మళ్లీ తెలంగాణ పట్టాలెక్కుతది అని అందరూ గుర్తుచేసుకుంటున్నరు. ఇంకా ఒక్క సంవత్సరమే టైం ఉంది. రేవంత్ రెడ్డిపై ప్రజలకు నమ్మకం పోయింది. వీళ్ల దుకాణం బంద్ అయ్యింది. రేవంత్ ఏ పార్టీలో కాలు పెడితే ఆ పార్టీ నాశనం. తెలుగుదేశంలో అడుగుపెట్టి దాన్ని బొందపెట్టిండు.. వచ్చే 25-30 ఏళ్లు మళ్లీ కాంగ్రెస్‌కు ఓటు వేయకుండా చేసి పోతడు. కాంగ్రెస్‌కు గతం తప్ప భవిష్యత్తు లేదు. తెలంగాణలో గరీబోళ్లు, రైతులు సంతోషంగా ఉండాలంటే, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నరు అని కేటీఆర్ తెలిపారు.

Advertisement
Advertisement