త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cash At Home | దేశంలోని ప్ర‌తి వ్య‌క్తి త‌న ఇంట్లో ఎంత మొత్తం న‌గ‌దును ఉంచుకోవ‌చ్చు..? ప‌రిమితి ఉందా..?

Cash At Home | డిజిటలైజేషన్ యుగంలో కొనుగోళ్ల నుంచి చెల్లింపుల వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది నగదును ఇంట్లో ఉంచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజువారీ అవసరాలు, చిన్న లావాదేవీలు లేదా అత్యవసర పరిస్థితుల కోసం ఇంట్లో కొంత మొత్తాన్ని దాచుకోవడం చాలా మందికి అలవాటే.

S

Business | Published On Jan 23, 2026, 8.24 am IST

Cash At Home | దేశంలోని ప్ర‌తి వ్య‌క్తి త‌న ఇంట్లో ఎంత మొత్తం న‌గ‌దును ఉంచుకోవ‌చ్చు..? ప‌రిమితి ఉందా..?
Advertisement

Cash At Home | డిజిటలైజేషన్ యుగంలో కొనుగోళ్ల నుంచి చెల్లింపుల వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది నగదును ఇంట్లో ఉంచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజువారీ అవసరాలు, చిన్న లావాదేవీలు లేదా అత్యవసర పరిస్థితుల కోసం ఇంట్లో కొంత మొత్తాన్ని దాచుకోవడం చాలా మందికి అలవాటే. ఇదే సమయంలో ఆదాయపు పన్ను శాఖ దాడుల వార్తలు తరచూ వినిపిస్తుండటంతో, ఇంట్లో అస‌లు ఎంత నగదు ఉంచుకోవచ్చు? దానికి ఏమైనా చట్టపరమైన పరిమితి ఉందా? అనే సందేహం సహజంగా తలెత్తుతుంది. నిజానికి, ఆదాయపు పన్ను శాఖ ఇంట్లో ఉంచుకునే నగదు మొత్తానికి సంబంధించి ఎలాంటి గరిష్ట పరిమితిని నిర్ణయించలేదు. తక్కువ మొత్తమైనా, ఎక్కువ మొత్తమైనా నగదును ఇంట్లో ఉంచుకోవడం చట్టవిరుద్ధం కాదు. అయితే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని స్పష్టంగా చూపించగలగడం అత్యంత ముఖ్యమైన అంశం.

ఆదాయ వ‌న‌రు చెప్పాలి..

జీతం, వ్యాపార ఆదాయం లేదా చట్టబద్ధమైన లావాదేవీల ద్వారా వచ్చిన డబ్బు అని నిరూపించగలిగితే, ఎంత మొత్తమైనా ఇంట్లో ఉంచుకోవచ్చు. కానీ ఆదాయ వనరు చెప్పలేకపోతే సమస్యలు మొదలవుతాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌లు 68 నుంచి 69B వరకు నగదు, ఆస్తులకు సంబంధించిన నిబంధనలను స్పష్టంగా పేర్కొన్నాయి. సెక్షన్ 68 ప్రకారం, మీ ఖాతా పుస్తకాల్లో లేదా క్యాష్ బుక్‌లో చూపిన మొత్తం మూలాన్ని వివరించలేకపోతే, అది తెలియని ఆదాయంగా పరిగణిస్తారు. సెక్షన్ 69 ప్రకారం, మీ వద్ద ఉన్న నగదు లేదా పెట్టుబడులకు సరైన లెక్కలు చూపించలేకపోతే, అవి గోప్య ఆదాయంగా గుర్తిస్తారు. అలాగే సెక్షన్ 69B ప్రకారం, మీరు ప్రకటించిన ఆదాయానికి మించిన నగదు లేదా ఆస్తులు ఉన్నా, వాటి మూలాన్ని వెల్లడించకపోతే పన్నుతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది.

వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోతే..

ఏదైనా తనిఖీ లేదా దాడి సమయంలో మీ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు లభించి, దానికి సరైన వివరణ ఇవ్వలేకపోతే, ఆ మొత్తం గోప్య ఆదాయంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో భారీ పన్నులు విధించడమే కాకుండా, స్వాధీనం చేసుకున్న మొత్తంపై సుమారు 78 శాతం వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, పన్ను ఎగవేత అనుమానం ఉంటే క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశమూ ఉంటుంది. అందువల్ల, ఇంట్లో నగదు ఉంచుకోవడం చట్టవిరుద్ధం కాకపోయినా, దాని మూలం స్పష్టంగా ఉండేలా సరైన రికార్డులు, ఆధారాలు ఉంచుకోవడం అత్యంత అవసరం. అలా ఉంటే ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.

Advertisement

తాజావార్తలు

Advertisement