త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SpaceX | స్పేస్‌ఎక్స్ ఐపీఓలో భారతీయులు కూడా పెట్టుబడి పెట్టొచ్చా?

SpaceX | అమెరికాలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ చరిత్రాత్మక ఐపీఓతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. జూన్ 11న షేర్‌కు 135 డాలర్ల ధరతో ప్రారంభమైన ఈ ఐపీఓ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచింది. మొత్తం 555.56 మిలియన్ షేర్ల విక్రయం ద్వారా 75 బిలియన్ డాలర్లు సమీకరించిన స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరింది.

S

Business | Published On Jun 12, 2026, 2.47 pm IST

SpaceX | స్పేస్‌ఎక్స్ ఐపీఓలో భారతీయులు కూడా పెట్టుబడి పెట్టొచ్చా?
Advertisement

SpaceX | అమెరికాలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ చరిత్రాత్మక ఐపీఓతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. జూన్ 11న షేర్‌కు 135 డాలర్ల ధరతో ప్రారంభమైన ఈ ఐపీఓ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచింది. మొత్తం 555.56 మిలియన్ షేర్ల విక్రయం ద్వారా 75 బిలియన్ డాలర్లు సమీకరించిన స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ భారీ లిస్టింగ్‌తో ఎలాన్ మస్క్ సంపద 1.1 ట్రిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి. దీంతో ఆయన ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా నిలవబోతున్నారని అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే భారతీయులు అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్ట‌వ‌చ్చా..? అంటే.. అవును, పెట్ట‌వ‌చ్చు. భారతీయులు అమెరికా స్టాక్ మార్కెట్లలో నేరుగా లేదా పరోక్షంగా పెట్టుబడులు పెట్టవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల డాలర్ల వరకు విదేశాలకు నిధులు పంపించి పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఉంది.

రెండు మార్గాల్లో చాన్స్‌..

ఈ పరిమితిని మించిన మొత్తాలపై ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్ (టీసీఎస్) వర్తిస్తుంది. అయితే ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను రిటర్నుల్లో సర్దుబాటు చేసుకోవచ్చు. అలాగే క్యాపిటల్ గెయిన్స్, డివిడెండ్ ఆదాయాలపై భారతీయ పన్ను నిబంధనలు కూడా వర్తిస్తాయి. భారతీయ పెట్టుబడిదారులు రెండు మార్గాల్లో అమెరికా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అంతర్జాతీయ బ్రోకరేజ్ ఖాతా తెరవాలి. ఇందుకు రెండు ఎంపికలు ఉన్నాయి. అమెరికా బ్రోకర్లతో భాగస్వామ్యం ఉన్న భారతీయ బ్రోకర్ల సేవలు వినియోగించడం లేదా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే గ్లోబల్ బ్రోకర్ల ద్వారా ఖాతా తెరవడం. మొదటి విధానంలో ట్రేడింగ్ అవకాశాలు కొంత పరిమితంగా ఉంటాయి. రెండో విధానంలో అదనపు ఫీజులు, ఛార్జీలు ఉండే అవకాశం ఉంటుంది. ఇక అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్లు, గ్లోబల్ ఈటీఎఫ్‌లు, గిఫ్ట్ సిటీ ఆధారిత పెట్టుబడి వేదికల ద్వారా కూడా అమెరికా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు.

ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం..

స్పేస్‌ఎక్స్ ప్రస్తుత విలువ దాని ఆదాయాలతో పోలిస్తే చాలా అధికంగా ఉందని భావిస్తున్నారు. 2025లో కంపెనీ ఆదాయం 18.67 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తే, ప్రస్తుత విలువ దాదాపు 95 రెట్లు ప్రైస్-టు-సేల్స్ నిష్పత్తికి సమానంగా ఉంటుంది. కంపెనీ ఐపీఓలో మొత్తం షేర్లలో 5 శాతం కంటే తక్కువ మాత్రమే విక్రయించింది. అందులో కూడా 30 శాతం రిటైల్ పెట్టుబడిదారుల కోసం కేటాయించింది. దీంతో ఎలాన్ మస్క్ వద్ద 82 శాతం ఓటింగ్ హక్కులు కొనసాగనున్నాయి. లిస్టింగ్ తర్వాత షేరు ధర వేగంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, కొంతకాలం తర్వాత లాభాల బుకింగ్ కారణంగా ధరలు స‌వ‌ర‌ణ‌కు గ‌ర‌వుతాయి. అంచనాల ప్రకారం 2026లో స్పేస్‌ఎక్స్ ఆదాయం 24.3 బిలియన్ డాలర్లకు, 2027లో 31.5 బిలియన్ డాలర్లకు పెరిగినా, మార్కెట్ కంపెనీకి 50 రెట్లు ప్రైస్-టు-సేల్స్ విలువ మాత్రమే ఇస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.58 ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది. ఇది ప్రస్తుత లక్ష్య విలువ కంటే సుమారు 11 శాతం తక్కువ.

క్యాపిట‌ల్ త‌గ్గే చాన్స్‌..

ఈ పరిస్థితిలో ప్రస్తుతం 10వేల డాలర్లు పెట్టుబడి పెట్టిన వ్యక్తి పెట్టుబడి విలువ ఏడాది లోపే 5వేల డాలర్ల కంటే తక్కువకు పడిపోవచ్చని నివేదిక హెచ్చరించింది. మధ్యలో తాత్కాలికంగా భారీ పెరుగుదలలు కనిపించినా, భవిష్యత్ వృద్ధి అంచనాలు ఇప్పటికే షేరు ధరలో ప్రతిబింబించాయని విశ్లేషకులు పేర్కొన్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఐపీఓ తర్వాత తొలి ట్రేడింగ్ రోజుల్లోనే తీవ్ర ధరల హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. పెద్ద సంస్థాగత పెట్టుబడిదారులు భారీ నష్టాలను భరించే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, సాధారణ రిటైల్ పెట్టుబడిదారులకు అదే స్థాయి రిస్క్ ను భరించడం కష్టమవుతుంది. అయితే ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. నేరుగా లేదా పరోక్ష పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవాలి. సెబీ లేదా ఐఎఫ్‌ఎస్‌సీఏ నియంత్రిత బ్రోకర్‌ను ఎంపిక చేసుకోవాలి. కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. డబ్ల్యూ-8బెన్ ఫామ్ సమర్పించాలి. ఎల్ఆర్ఎస్ ద్వారా నిధులను అమెరికా డాలర్లుగా మార్చి పంపాలి. మొదట చిన్న మొత్తంతో పెట్టుబడి ప్రారంభించడం మంచిది. విదేశీ ఆదాయం, డివిడెండ్, వడ్డీ, క్యాపిటల్ గెయిన్స్‌ను ఆదాయపు పన్ను రిటర్నుల్లో సక్రమంగా ప్రకటించాలి. ఇండియా-అమెరికా డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ప్రయోజనాలు పొందవచ్చు.

Advertisement
Advertisement