త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Budget 2026 | నిర్మలమ్మ పద్దుపై పన్ను చెల్లింపుదారుల ఆశలెన్నో..! ట్యాక్స్‌ మినహాయింపులు ఇచ్చేనా..?

Budget 2026 | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన లోక్‌సభలో బడ్జెట్‌ 2026ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను విషయంలో ఏమైనా ఊరట కల్పిస్తారా? అని పన్ను చెల్లింపుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

P

Business | Published On Jan 27, 2026, 12.35 pm IST

Budget 2026 | నిర్మలమ్మ పద్దుపై పన్ను చెల్లింపుదారుల ఆశలెన్నో..! ట్యాక్స్‌ మినహాయింపులు ఇచ్చేనా..?
Advertisement

Budget 2026 | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన లోక్‌సభలో బడ్జెట్‌ 2026ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను విషయంలో ఏమైనా ఊరట కల్పిస్తారా? అని పన్ను చెల్లింపుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం గతేడాది 2025 బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో భాగంగా రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను మినహాయింపు ఇవ్వడంతో మధ్యతరగతికి శుభవార్త చెప్పింది. స్టాండర్డ్ డిడక్షన్‌ను కలుపుకుంటే ఈ పరిమితి రూ.12.75 లక్షలకు చేరింది. ఇదే తరహాలో ఈ సారి బడ్జెట్‌లో కూడా ఏమైనా శుభవార్తలు వినిపిస్తారా? అంటూ ఎదురుచూస్తున్నారు. ఇక 2026 ఏప్రిల్ 1 నుంచి దశాబ్దాలుగా అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం–1961కు బదులుగా ప్రతిపాదిత ఆదాయపు పన్ను చట్టం–2025 ని అమలులోకి తీసుకురానున్నది. పన్ను వ్యవస్థను సులభతరం చేయడమే ఈ కొత్త చట్టం ప్రధాన ఉద్దేశ్యం. ‘వికసిత భారత్–2047’ లక్ష్యాల్లో భాగంగా పారదర్శకతతో కూడిన, సమర్థవంతమైన ట్యాక్స్ వ్యవస్థను రూపొందించాలన్న ప్రభుత్వ ఆలోచనలకు ఈ చట్టం పూర్తిగా అనుగుణంగా ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

డిఫాల్ట్‌ ఆప్షన్‌ నిలిపివేత వైపు..

కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ ఆప్షన్‌గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అడుగులు వేస్తోంది. బడ్జెట్–2026లో ఈ ప్రయత్నం మరింత బలపడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రూ.4లక్షల వరకు ఆదాయంపై ప్రాథమిక మినహాయింపు వర్తిస్తోంది. అయితే, ఈ పరిమితిని రూ.5 లక్షలు.. లేకపోతే రూ.6 లక్షలకు పెంచే అంశంపై చర్చ జరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. గత బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు పన్ను నుంచి ఊరట కల్పించిన నేపథ్యంలో.. ఈ సారి ఆ స్లాబ్‌ను దాదాపు రూ.15లక్షల వరకు విస్తరించే అవకాశం ఉందని అంచనాలున్నాయి. మధ్యతరగతి చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండేలా చేయడం, వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా 5 శాతం, 10 శాతం పన్ను స్లాబ్‌ల పరిధిని పెంచే అంశం కేంద్రం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.

ఇంటి అద్దె భత్యం విషయంలోనూ..

అలాగే, ఇంటి అద్దె భత్యం (HRA) విషయంలోనూ తమకు ఏమైనా ఉపశమనం కల్పించాలని పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై మాత్రమే హెచ్‌ఆర్‌ఏ లెక్కింపులో మెట్రో నగరాలుగా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ నగరాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రాథమిక జీతంలో 50శాతం వరకు మినహాయింపు లభిస్తోంది. అయితే, ఈ బడ్జెట్‌లో బెంగళూరు, హైదరాబాద్‌, పుణే సహా పలు నగరాలను ఈ జాబితాలో చేర్చే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఎంతో మందికి ఊరట దక్కనున్నది. మరోవైపు, కొత్త పన్ను విధానంలో ప్రస్తుతం అందుబాటులో లేని హెచ్‌ఆర్‌ఏ మినహాయింపులను కొంత మేర అనుమతించాలన్న డిమాండ్ సైతం వినిపిస్తోంది. హెచ్‌ఆర్‌ఏను చేర్చితే కొత్త పన్ను విధానాన్ని ఎక్కువ మంది ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని ఆదాయపు పన్ను నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఈ బడ్జెట్‌లో మధ్యతరగతికి ఎలాంటి పన్ను ఉపశమనం లభిస్తుందో.. ఈ బడ్జెట్‌లో ఏ మార్పులు ప్రతిపాదిస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

తాజావార్తలు

Advertisement