త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bharti Airtel | డిసెంబర్‌లో టెలికాం టారిఫ్‌ల పెంపు? 15 శాతం ఛార్జీల మోత‌..?

Bharti Airtel | జియో ఐపీఓ లిస్టింగ్ తర్వాత టెలికాం రంగంలో టారిఫ్‌ల పెంపునకు అవకాశాలు ఉన్నాయని అంబిట్ క్యాపిటల్ అంచనా వేస్తోంది. ధరల విషయంలో కంపెనీలు క్రమశిక్షణ పాటిస్తాయని, దేశంలో మూడు ప్రైవేట్ టెలికాం సంస్థలతో కూడిన పరిశ్రమ నిర్మాణాన్ని కొనసాగించాలని ప్రభుత్వం కోరుకుంటోందని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది.

S

Business | Published On Oct 24, 2026, 3.29 pm IST

Bharti Airtel | డిసెంబర్‌లో టెలికాం టారిఫ్‌ల పెంపు? 15 శాతం ఛార్జీల మోత‌..?
Advertisement

Bharti Airtel | జియో ఐపీఓ లిస్టింగ్ తర్వాత టెలికాం రంగంలో టారిఫ్‌ల పెంపునకు అవకాశాలు ఉన్నాయని అంబిట్ క్యాపిటల్ అంచనా వేస్తోంది. ధరల విషయంలో కంపెనీలు క్రమశిక్షణ పాటిస్తాయని, దేశంలో మూడు ప్రైవేట్ టెలికాం సంస్థలతో కూడిన పరిశ్రమ నిర్మాణాన్ని కొనసాగించాలని ప్రభుత్వం కోరుకుంటోందని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌ను టెలికాం రంగంలో తమ అత్యుత్తమ పెట్టుబడి ఎంపికగా అంబిట్ క్యాపిటల్ అభివర్ణించింది. అంబిట్ క్యాపిటల్ భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ టవర్స్, వోడాఫోన్ ఐడియా, భారతీ హెక్సాకామ్ షేర్లకు బై రేటింగ్ ఇచ్చింది. అంటే ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది.

టారిఫ్‌ల పెంపునకు జియో, ఎయిర్‌టెల్ సంకేతాలు..

జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ప్రారంభించడం కూడా రానున్న నెలల్లో టారిఫ్‌లను పెంచాలనే సంస్థ ఉద్దేశాన్ని సూచిస్తోందని అంబిట్ క్యాపిటల్ తెలిపింది. ఈ సభ్యత్వం ద్వారా ప్లాన్ల ధరలను 2027 సెప్టెంబర్ 5 వరకు స్థిరంగా ఉంచుతున్నట్లు పేర్కొంది. మరోవైపు, ఎయిర్‌టెల్ ఆగస్టులో రోజుకు 1.5 జీబీ డేటా అందించే ప్రారంభ స్థాయి ప్లాన్‌ను తొలగించాలని నిర్ణయించింది. అలాగే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను కూడా పెంచింది. ప్రారంభ స్థాయి ప్లాన్‌ను తొలగించడం వల్ల వినియోగదారుడి నుంచి సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) 4.4 శాతం పెరుగుతుందని అంబిట్ అంచనా వేస్తోంది. టెలికాం రంగంలో అధిక మూలధన వ్యయ అవసరాల కారణంగా ఎయిర్‌టెల్, జియో సంస్థల పెట్టుబడులపై వచ్చే రాబడి వాటి మూలధన వ్యయానికి సమానంగా లేదా అంతకంటే తక్కువగా ఉందని బ్రోకరేజ్ సంస్థ వివరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పన్నులకు ముందు ఎయిర్‌టెల్ పెట్టుబడి మూలధనంపై రాబడి (ఆర్‌ఓసీఈ) 11 శాతంగా ఉండగా, రిలయన్స్ జియోకు ఇది 8 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలు పరిశ్రమలో ఇంకా అధిక లాభదాయకత లేదని సూచిస్తున్నాయని అంబిట్ క్యాపిటల్ పేర్కొంది.

వోడాఫోన్ ఐడియాకు రూ.17,100 కోట్ల ఈబీఐటీడీఏ అంచనా..

డిసెంబర్‌లో టారిఫ్‌లు 15 శాతం పెరుగుతాయనే అంచనాతో, 2027-28 ఆర్థిక సంవత్సరంలో వోడాఫోన్ ఐడియా రూ.17,100 కోట్ల నగదు నిర్వహణ ఆదాయాన్ని (ఈబీఐటీడీఏ) ఆర్జించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంబిట్ క్యాపిటల్ అంచనా వేస్తోంది. అయితే, అదే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ చెల్లించాల్సిన చట్టబద్ధ బకాయిలు రూ.21,600 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. వోడాఫోన్ ఐడియా మనుగడ కొనసాగాలంటే క్రమం తప్పకుండా టారిఫ్‌లను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. గత సంవత్సరాల్లో మాదిరిగా భారీ స్థాయిలో ధరల పెంపు అవసరం లేకపోయినా, నిరంతర పెంపులు మాత్రం కీలకమని వివరించింది.

మూడు ప్ర‌ధాన కార‌ణాలు..

టెలికాం సంస్థలు క్రమానుగతంగా టారిఫ్‌లను సవరిస్తాయ‌న్న అంచనాకు మూడు ప్రధాన కారణాలున్నాయని అంబిట్ క్యాపిటల్ తెలిపింది. వోడాఫోన్ ఐడియా మనుగడకు ధరల పెంపు తప్పనిసరి కావడం, జియోలో పెట్టుబడులు పెట్టిన వారికి మెరుగైన రాబడులు అందించాల్సిన అవసరం, ప్రస్తుతం టెలికాం పరిశ్రమలో నెలకొన్న బలహీనమైన ఆర్థిక పరిస్థితులు ఇందులో కీలకమని వివరించింది. ప్రస్తుతం రూ.177గా ఉన్న వోడాఫోన్ ఐడియా వినియోగదారుడి నుంచి సగటు ఆదాయాన్ని రూ.300కు పైగా పెంచాల్సిన అవసరం ఉందని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. 2025-26 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరాల మధ్య ఎయిర్‌టెల్ ఆదాయం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్) ప్రాతిపదికన 16 శాతం, జియో ఆదాయం 15 శాతం పెరుగుతుంద‌ని అంచనా వేసింది.

నిర్వహణ స్థాయిలో ఆదాయం పెరిగే కొద్దీ వ్యయాలపై నియంత్రణ మెరుగుపడడం వల్ల ఈ సంస్థలు పరిమిత రుణభారంతో కూడిన ఆర్థిక నిర్మాణాన్ని కొనసాగిస్తాయ‌ని అంబిట్ అభిప్రాయపడింది. అదే సమయంలో వాటాదారులకు డివిడెండ్లు చెల్లించే అవకాశం కూడా ఉంటుందని పేర్కొంది. దీనివల్ల పెట్టుబడుల కేటాయింపులో ఉండే రిస్కులు తగ్గి, వినియోగదారుల డిమాండ్‌కు అనుసంధానమైన పెట్టుబడులుగా టెలికాం షేర్లలో సంస్థాగత పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. వోడాఫోన్ ఐడియా, ఇండస్ టవర్స్ షేర్ల పనితీరు టెలికాం రంగంలో మూడు ప్రైవేట్ సంస్థల ఉనికిని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుందని వివరించింది.

టెలికాం రంగంలో కీలక రిస్కులు ఏమిటి?

టెలికాం టవర్ సంస్థలకు సంబంధించి మౌలిక సదుపాయాల ఏర్పాటులో విద్యుత్, నీటి సరఫరా అనుసంధానాలు వంటి అమలు సంబంధిత అంశాలే ప్రధాన రిస్కులని అంబిట్ క్యాపిటల్ పేర్కొంది. టవర్‌ల వినియోగ సామర్థ్యం కంటే ఈ అంశాలే ఎక్కువ ప్రభావం చూపిస్తాయ‌ని తెలిపింది. అలాగే ఉపగ్రహ ఆధారిత టెలికాం సేవలు (శాట్‌కామ్) భవిష్యత్తులో టెలికాం ఆపరేటర్ల అదనపు ఆదాయ అవకాశాలకు ముప్పుగా మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని హెచ్చరించింది. అయితే, నియంత్రణపరమైన రక్షణ చర్యలు, దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాలు సంప్రదాయ టెలికాం సంస్థలకు అనుకూలంగా ఉంటాయ‌ని అంబిట్ క్యాపిటల్ అభిప్రాయపడింది.

Advertisement
Advertisement