త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anthropic IPO | ఆంథ్రోపిక్ షేర్లలో భారీ పతనం.. ఇప్పుడు కొనొచ్చా?

Anthropic IPO | కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఆంథ్రోపిక్ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ తర్వాత సాధించిన లాభాలను దాదాపుగా కోల్పోయాయి. ఐపీఓ ధర 83 డాలర్లకు పడిపోయిన ఈ షేరు, ఆ తర్వాత కొంత కోలుకున్నప్పటికీ ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. భారత రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు ఈ షేర్లలో పెట్టుబడులు పెట్టాలా? లేక మరికొంత కాలం వేచి చూడాలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

S

Business | Published On Nov 23, 2026, 5.37 pm IST

Anthropic IPO | ఆంథ్రోపిక్ షేర్లలో భారీ పతనం.. ఇప్పుడు కొనొచ్చా?
Advertisement

Anthropic IPO | కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఆంథ్రోపిక్ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ తర్వాత సాధించిన లాభాలను దాదాపుగా కోల్పోయాయి. ఐపీఓ ధర 83 డాలర్లకు పడిపోయిన ఈ షేరు, ఆ తర్వాత కొంత కోలుకున్నప్పటికీ ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. భారత రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు ఈ షేర్లలో పెట్టుబడులు పెట్టాలా? లేక మరికొంత కాలం వేచి చూడాలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఐపీఓ ధ‌ర‌కు దిగి వ‌చ్చిన షేర్‌..

ఆంథ్రోపిక్ సంస్థ షేర్లు ఐపీఓ తర్వాత తొలి పూర్తిస్థాయి ట్రేడింగ్ రోజైన నవంబర్ 20, శుక్రవారం భారీ ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో ఏకంగా 14 శాతం వరకు పడిపోయి, ఒక్కో షేరు ఐపీఓ ధర 83 డాలర్ల స్థాయిని తాకాయి. చివరకు 88.19 నుంచి 88.91 డాలర్ల పరిధిలో ట్రేడింగ్ ముగిసింది. ఈ ఐపీఓ ద్వారా సంస్థ రికార్డు స్థాయిలో 93.5 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించగా, టెక్నాలజీ దిగ్గజాలు కూడా ఐపీఓ ధర వద్ద మరో 26 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా అందించాయి. గత గురువారం నాస్‌డాక్‌లో లిస్టింగ్ అయిన రోజునే షేర్లు 83 డాలర్ల ఐపీఓ ధర నుంచి 111.50 డాలర్లకు చేరి 34 శాతం ప్రీమియంతో ప్రారంభమయ్యాయి. తొలిరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 17 శాతం లాభంతో నిలిచాయి. అయితే ఆ తర్వాతి రోజే భారీగా పడిపోవడంతో తొలి రోజు వచ్చిన లాభాల్లో దాదాపు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. మూడో ట్రేడింగ్ రోజుకు ముందు షేరు 4.47 శాతం మేర కోలుకున్నట్లు బ్లూమ్‌బ‌ర్గ్‌ కథనం వెల్లడించింది.

ఏఐ షేర్ల‌లో అమ్మ‌కాల ఒత్తిడి..

గత వారం అంతర్జాతీయ టెక్నాలజీ, ఏఐ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడం ఆంథ్రోపిక్ షేర్లపై కూడా ప్రభావం చూపింది. నాస్‌డాక్ కాంపోజిట్, డౌ జోన్స్ సూచీలు ఆరేళ్లకు పైగా కాలంలో అత్యంత భారీ వారపు పతనాన్ని నమోదు చేయగా, ఎస్‌అండ్‌పీ 500 ఏప్రిల్ 2025 తర్వాత అతిపెద్ద వారపు నష్టాన్ని చవిచూసింది. ఈ పరిణామాలతో మూడు ప్రధాన అమెరికా మార్కెట్ సూచీలు కరెక్షన్ జోన్‌లోకి వెళ్లాయి. నాస్‌డాక్ సూచీ ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన లాభాలను కూడా కోల్పోయింది. అక్టోబర్ 6న నమోదైన గరిష్ఠ స్థాయి నుంచి నాస్‌డాక్ 100 సూచీ కూడా బేర్ మార్కెట్ స్థాయికి చేరువైంది. ఏఐ కంపెనీల అధిక విలువలు, వాటిలోకి ప్రవహిస్తున్న భారీ పెట్టుబడులపై ఇన్వెస్టర్లు మరోసారి సమీక్ష ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆంథ్రోపిక్ ఐపీఓ విజయవంతమైనప్పటికీ, అది మొత్తం ఏఐ రంగానికి సానుకూల సంకేతంగా మారలేదని మార్కెట్ పరిణామాలు సూచిస్తున్నాయి.

పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చా..?

భారత రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ ఐపీఓ ద్వారా గతంలో ప్రైవేట్ మార్కెట్లకే పరిమితమైన ఆంథ్రోపిక్ సంస్థలో పెట్టుబడి పెట్టేందుకు కొత్త అవకాశం ఏర్పడిందని మడ్రెక్స్ బిజినెస్ హెడ్ ప్రతీక్ గుప్తా తెలిపారు. అయితే ప్రారంభ లిస్టింగ్ లాభాలను చూసి పెట్టుబడి నిర్ణయం తీసుకోకూడదని, సంస్థ వ్యాపార ప్రాథమిక అంశాలు, భవిష్యత్తు వృద్ధి అవకాశాలు, షేరు విలువను పరిశీలించాలని సూచించారు. ఆంథ్రోపిక్ ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్లకు 20 శాతం కంటే తక్కువ షేర్లను మాత్రమే కేటాయించినట్లు సంస్థ వెల్లడించింది. మరోవైపు, లిస్టింగ్ తర్వాత షేరు ధరకు మద్దతుగా వ్యవహరించేందుకు మోర్గాన్ స్టాన్లీని ఐపీఓ స్టెబిలైజేషన్ ఏజెంట్‌గా నియమించింది. ఈ ప్రక్రియలో భాగంగా అండర్‌రైటింగ్ సంస్థల తరఫున ఆంథ్రోపిక్ నుంచి అదనంగా 147 మిలియన్ షేర్లను కొనుగోలు చేసే గ్రీన్‌షూ ఆప్షన్‌ను మోర్గాన్ స్టాన్లీకి కల్పించారు. ఐపీఓ తర్వాత వచ్చిన ప్రారంభ ఉత్సాహం కంటే కంపెనీ వాస్తవ వ్యాపార పనితీరు, ఆదాయ వృద్ధి, భవిష్యత్తు అంచనాలే దీర్ఘకాలిక పెట్టుబడులకు కీలకంగా మారనున్నాయి.

Advertisement
Advertisement