త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Airtel | డేటా అవసరం లేనివారికి ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.185 నుంచే కొత్త రీఛార్జ్ ప్లాన్లు..

Airtel | టెలికాం రంగంలో కీలక మార్పులకు అనుగుణంగా భారతీ ఎయిర్‌టెల్ మూడు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలు మాత్రమే కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్లను ప్రవేశపెట్టింది.

S

Business | Published On Oct 19, 2026, 12.26 pm IST

Airtel | డేటా అవసరం లేనివారికి ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.185 నుంచే కొత్త రీఛార్జ్ ప్లాన్లు..
Advertisement

Airtel | టెలికాం రంగంలో కీలక మార్పులకు అనుగుణంగా భారతీ ఎయిర్‌టెల్ మూడు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలు మాత్రమే కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటిలో మొబైల్ డేటా ప్రయోజనాలు ఉండవు. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక వాయిస్, ఎస్ఎంఎస్ టారిఫ్‌లను ప్రవేశపెట్టిన తొలి టెలికాం సంస్థగా ఎయిర్‌టెల్ నిలిచింది. ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు మొబైల్ యాప్‌లో ఈ మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. మొత్తం 300 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. అదనంగా హలోట్యూన్స్ సేవను కూడా ఉచితంగా పొందవచ్చు.

రూ.185 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు 300 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. రూ.203 ప్లాన్‌లోనూ ఇవే ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. ఇక రూ.206 ప్లాన్‌లోనూ అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే.. క్యాలెండర్ నెల ప్రాతిపదికన వ్యాలిడిటీ ఉంటుంది. అంటే రీఛార్జ్ చేసిన తేదీకి అనుగుణంగా తదుపరి నెలలో అదే తేదీన వ్యాలిడిటీ ముగుస్తుంది. ఈ మూడు ప్లాన్లలోనూ మొబైల్ ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. సాధారణ ప్రీపెయిడ్ ప్లాన్లలో రోజువారీ లేదా నిర్ణీత పరిమాణంలో డేటా లభిస్తుండగా, ఈ ప్లాన్లు మాత్రం పూర్తిగా కాలింగ్, సందేశాల సేవలకే పరిమితమయ్యాయి.

ట్రాయ్ నిబంధనలతో కొత్త ప్లాన్లు..

టెలికాం వినియోగదారుల పరిరక్షణ నిబంధనల ప్రకారం ట్రాయ్ విధించిన అక్టోబర్ 21 గడువుకు ముందే ఎయిర్‌టెల్ ఈ ప్లాన్లను ప్రవేశపెట్టింది. డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ఇప్పటికే ఉన్న బండిల్ ప్లాన్లకు సమానమైన ప్రత్యేక వాయిస్, ఎస్ఎంఎస్ స్పెషల్ టారిఫ్ వోచర్లను అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం సంస్థలను నియంత్రణ సంస్థ ఆదేశించింది. డేటా ప్రయోజనాలు అవసరం లేని వినియోగదారులకు తగిన ధర తగ్గింపుతో ప్లాన్లు అందించాలని సూచించింది.

ఎవరికి ఎక్కువ ప్రయోజనం?

ఫీచర్ ఫోన్లు ఉపయోగించేవారు, రెండో సిమ్‌ను కలిగి ఉన్నవారు, ఇంటర్నెట్ కోసం ప్రధానంగా వైఫైపై ఆధారపడేవారికి ఈ ప్లాన్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి. గతంలో ఇలాంటి వినియోగదారులు కాల్స్, ఎస్ఎంఎస్‌లు మాత్రమే ఉపయోగించినప్పటికీ, డేటా ప్రయోజనాలు కలిగిన 4జి, 5జి రీఛార్జ్ ప్లాన్ల కోసం కూడా డబ్బు చెల్లించాల్సి వచ్చేది. తాజా ప్లాన్లతో అవసరం లేని డేటా కోసం అదనపు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తగ్గనుంది. ఎయిర్‌టెల్ తరహాలోనే రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ సంస్థలు కూడా ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ఇలాంటి ప్రత్యేక కాలింగ్, ఎస్ఎంఎస్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తాయని అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement