త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Credit Card | క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకుంటే లాభమేనా? నష్టాలేమైనా ఉంటాయా?

Credit Card | క్రెడిట్ కార్డు వినియోగదారులకు రెగ్యులర్‌గా లిమిట్ పెంచుకునేందుకు ఆఫర్స్ వస్తుంటాయి. అలా ఆప్షన్‌ రాగానే చాలామంది వచ్చిందే ఛాన్స్ అని లిమిట్ పెంచేసుకుంటారు.. కానీ కొంతమంది మాత్రం లిమిట్ పెంచుకుంటే లాభమా? నష్టమా? అనేది అర్థం కాక అయోమయంలో ఉండిపోతారు.

S

Business | Published On Dec 6, 2025, 7.01 am IST

Credit Card | క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకుంటే లాభమేనా? నష్టాలేమైనా ఉంటాయా?
Advertisement

Credit Card | క్రెడిట్ కార్డు వినియోగదారులకు రెగ్యులర్‌గా లిమిట్ పెంచుకునేందుకు ఆఫర్స్ వస్తుంటాయి. అలా ఆప్షన్‌ రాగానే చాలామంది వచ్చిందే ఛాన్స్ అని లిమిట్ పెంచేసుకుంటారు.. కానీ కొంతమంది మాత్రం లిమిట్ పెంచుకుంటే లాభమా? నష్టమా? అనేది అర్థం కాక అయోమయంలో ఉండిపోతారు. అసలు ఇలా బ్యాంకులు ఆఫర్ చేసే లిమిట్ పెంచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఇబ్బందులేమైనా వస్తాయా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లిమిట్ పెంచుకుంటే కలిగే లాభాలేంటి?

క్రెడిట్ కార్డు లిమిట్ పెరిగితే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR) చాలావరకు తగ్గుతుంది. దీని ద్వారా సిబిల్ స్కోర్ పెంచుకునే అవకాశం ఉంటుంది. అదెలా అంటే.. క్రెడిట్ కార్డు పరిమితిలో ఎంతశాతం వాడుకున్నామో దాన్నే సీయూఆర్ అని పిలుస్తారు. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్ లక్ష రూపాయలు అనుకుందాం.. అందులో మీరు నెలకు రూ.30వేలు వాడారని అనుకుందాం.. అప్పుడు మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియా 30 శాతం అవుతుంది. ఒకవేళ మీ బ్యాంకు క్రెడిట్ లిమిట్‌ను 2 లక్షలకు పెంచితే.. మీ సీయూఆర్ 15 శాతానికి పడిపోతుంది. అది మీ క్రెడిట్ స్కోర్ పెరగడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా సీయూఆర్ నిష్పత్తి 30 శాతంలోపు ఉండాలని నిపుణులు చెబుతుంటారు. దీనివల్ల హోమ్ లోన్, పర్సనల్‌ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు తక్కువ వడ్డీ రేటుతో ఎక్కువ రుణాలు పొందవచ్చు.

ఇలా చేస్తే అప్పులే..

మనలో చాలామందికి ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల క్రెడిట్ కార్డు లిమిట్ పెరిగినప్పుడు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అదెలా అంటే.. క్రెడిట్ కార్డు ఉంది కదా అని చాలామంది ఖర్చులు చేసే దగ్గర ఆలోచించరు. ఏదైనా కావాలనుకుంటే క్రెడిట్ కార్డు ఉంది కదా అని కొనేస్తుంటారు.. తీరా బిల్లులు కట్టే సమయం వచ్చినప్పుడు వాటిని కట్టలేక కొత్తగా అప్పులు చేస్తుంటారు.. ఇలా మన ఆర్థిక పరిస్థితి అదుపుతప్పుతున్న సమయంలో క్రెడిట్ లిమిట్ పెరిగితే.. ఆ అమౌంట్‌ను కూడా అప్పులు చెల్లించడానికే ఉపయోగిస్తారు.. లేదంటే కొత్త ఖర్చులు చేస్తుంటారు.. దీనివల్ల అప్పుల ఊబిలో మరింత కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది.

అందుకే క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలని బ్యాంకులు ఆఫర్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఖర్చుల విషయంలో నియంత్రణ ఉండటంతో పాటు సరైన సమయంలో పేమెంట్లు చేయగలిగే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే బ్యాంకులు ఇచ్చే ఆఫర్‌ను యుటిలైజ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఆ ఆఫర్‌ను తిరస్కరించడమే బెటర్ అని సలహాలిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement