త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adani Group | పశ్చిమ బెంగాల్‌పై అదానీ మెగా ప్లాన్.. రూ.లక్ష కోట్ల పెట్టుబడులు..

Adani Group | పశ్చిమ బెంగాల్‌లో తమ కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైంది. 2035 నాటికి రాష్ట్రంలోని కీలక రంగాల్లో రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌ అన్ని అవకాశాలను పునర్నిర్వచించే స్థాయికి ఎదిగి, దేశ ఆర్థిక పురోగతికి కీలకంగా మారుతుందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ విశ్వాసం వ్యక్తం చేశారు.

S

Business | Published On Sep 24, 2026, 2.35 pm IST

Adani Group | పశ్చిమ బెంగాల్‌పై అదానీ మెగా ప్లాన్.. రూ.లక్ష కోట్ల పెట్టుబడులు..
Advertisement

Adani Group | పశ్చిమ బెంగాల్‌లో తమ కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైంది. 2035 నాటికి రాష్ట్రంలోని కీలక రంగాల్లో రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌ అన్ని అవకాశాలను పునర్నిర్వచించే స్థాయికి ఎదిగి, దేశ ఆర్థిక పురోగతికి కీలకంగా మారుతుందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ విశ్వాసం వ్యక్తం చేశారు. కోల్‌కతాలో ప్రతిపాదిత అదానీ ఆరోగ్య మందిర్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. బెంగాల్ తన చారిత్రక పారిశ్రామిక, మేధో శక్తిని తిరిగి పొందేందుకు దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తోందని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌కు ఉన్న ప్రత్యేక భౌగోళిక ప్రాధాన్యతను గౌతమ్ అదానీ ప్రస్తావించారు. ఆగ్నేయాసియా, అంతర్జాతీయ జల మార్గాలతో భారత్‌ను అనుసంధానించే సముద్ర వాణిజ్య మార్గాలకు బెంగాల్ కీలక కేంద్రంగా మారే సామర్థ్యం కలిగి ఉందన్నారు. రూ.1 లక్ష కోట్లకు పైగా ఉండే ప్రతిపాదిత మూలధన వ్యయాన్ని కీలక మౌలిక రంగాల్లో వినియోగించనున్నట్లు తెలిపారు.

పోర్టులు, సముద్ర రవాణా రంగంలో రాష్ట్రంలోని తీరప్రాంతాన్ని ఉపయోగించుకుని నౌకాశ్రయాల నిర్వహణ సామర్థ్యాన్ని, తీరప్రాంత వాణిజ్య నెట్‌వర్క్‌లను విస్తరించనున్నారు. విద్యుత్, ఇంధన రంగాల్లో ప్రసార, ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను ఆధునీకరించి పారిశ్రామిక క్లస్టర్లకు అవసరమైన విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేయనున్నారు. అలాగే లాజిస్టిక్స్ పార్కులు, రహదారులు, ఆధునిక అనుసంధాన మార్గాల విస్తరణ ద్వారా రాష్ట్రంలోని మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయనున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నాణ్యమైన ఉద్యోగాల కల్పనకు పశ్చిమ బెంగాల్‌లో అత్యధిక అవకాశాలు ఉన్నాయని గౌతమ్ అదానీ అన్నారు. నిరంతర పెట్టుబడులు, అత్యాధునిక మౌలిక వసతులతో తూర్పు భారత్‌లో అదానీ గ్రూప్‌కు బెంగాల్ రెండో కర్మభూమిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రూ.4వేల కోట్లతో అదానీ ఆరోగ్య మందిర్..

ఈ భారీ పెట్టుబడి ప్రణాళికలో తొలి దశగా కోల్‌కతాలోని న్యూ టౌన్‌లో అదానీ ఆరోగ్య మందిర్‌ను ఏర్పాటు చేయడానికి రూ.4వేల కోట్ల పెట్టుబడిని గ్రూప్ ప్రకటించింది. పూర్తిగా లాభాపేక్ష లేకుండా పనిచేసే సంస్థగా దీనిని రూపొందించనున్నారు. ఇందులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఆధునిక వైద్య కళాశాల, ప్రత్యేక క్లినికల్ పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయనున్నారు. విజ్ఞానం, సంస్కృతికి నిలయమైన భూమిగా పశ్చిమ బెంగాల్‌కు ఉన్న వారసత్వాన్ని ప్రస్తావించిన గౌతమ్ అదానీ, అందుబాటులో ఉండే ప్రపంచస్థాయి వైద్య సేవలను అత్యున్నత స్థాయి వైద్య పరిశోధనతో అనుసంధానించడం ద్వారా స్థానిక ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. అదే సమయంలో ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతంలో వేలాది ప్రత్యక్ష, పరోక్ష వైద్య రంగ ఉద్యోగాలు కూడా ఏర్పడతాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement