త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dragon Fruit on Terrace | టెర్ర‌స్‌పై డ్రాగ‌న్ ఫ్రూట్ సాగు.. నెల‌కు రూ. 4 ల‌క్ష‌లు సంపాదిస్తున్న రిటైర్డ్ ప్ర‌ధానోపాధ్యాయురాలు

Dragon Fruit on Terrace | ఆమె ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ప్ర‌ధానోపాధ్యాయురాలు( Retired Headmistress ). 60 ఏళ్ల వ‌య‌సులో మ‌నువ‌ళ్లు, మ‌నువ‌రాళ్ల‌తో కాల‌క్షేపం చేయాల‌నుకుంటున్నారు. లేదా విశ్రాంతి తీసుకుందామ‌ని అనుకుంటున్నారు. కానీ ఆమె వృత్తిరీత్యా టీచ‌ర్( Teacher ) కావ‌డంతో.. త‌న వృద్ధాప్య జీవితంలో కూడా ఖాళీగా ఉండొద్ద‌నుకున్నారు. నిత్య విద్యార్థి మాదిరి.. ఏదో కొత్త‌గా చేయాల‌న్న ఆలోచ‌న‌తో ఆ రిటైర్డ్ టీచ‌ర్ పండ్ల( Fruits ) తోట‌ల సాగుపై దృష్టి సారించారు. త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌తో పాటు టెర్ర‌స్‌పై డ్రాగ‌న్ ఫ్రూట్( Dragon Fruit on Terrace ) సాగు చేసి నెల‌కు రూ. 4 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదిస్తున్నారు. మ‌రి ఆ రిటైర్డ్ ప్ర‌ధానోపాధ్యాయురాలు రేమాభాయ్( Remabhai ) గురించి తెలుసుకోవాలంటే కేర‌ళ( kerala ) వెళ్ల‌క త‌ప్ప‌దు.

S

Agriculture | Published On Sep 10, 2026, 11.01 pm IST

Dragon Fruit on Terrace | టెర్ర‌స్‌పై డ్రాగ‌న్ ఫ్రూట్ సాగు.. నెల‌కు రూ. 4 ల‌క్ష‌లు సంపాదిస్తున్న రిటైర్డ్ ప్ర‌ధానోపాధ్యాయురాలు
Advertisement

Dragon Fruit on Terrace | కేర‌ళ‌( Kerala )కు చెందిన రేమాభాయ్( Remabhai ) రిటైర్డ్ ప్ర‌ధానోపాధ్యాయురాలు( Retired Headmistress ). 2022 మే 31న ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. ఆమె భ‌ర్త బ్యాంక్ మేనేజ‌ర్‌గా రిటైర్డ్ అయ్యారు. ఆ త‌ర్వాత ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చేరారు. ఇక వీరి కుమారుడు, కోడ‌లు వృత్తిరీత్యా డాక్ట‌ర్లు.. ఢిల్లీలో స‌ర్జ‌న్లుగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.

రేమాభాయ్ ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన త‌ర్వాత ఆమె త‌ల్లి చ‌నిపోయింది. ఏం చేయాలో తోచ‌లేదు.. ఆ స‌మ‌యంలోనే ఇంటి ఆవ‌ర‌ణ‌లోని పెర‌డులో, టెర్ర‌స్‌పై ఏవైనా మొక్క‌లు పెంచాల‌ని నిర్ణ‌యించుకుంది. దీంతో కొల్లాంలోని త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌తో పాటు టెర్ర‌స్‌పై డ్రాగన్ ఫ్రూట్( Dragon Fruit on Terrace ) మొక్క‌లు నాటారు. మొత్తానికి డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రేమాభాయ్ నెల‌కు రూ. 4 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదిస్తున్నారు.

4 సెంట్ల పెర‌డులో డ్రాగ‌న్ ఫ్రూట్ సాగు

త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లోని 4 సెంట్ల పెర‌డులో డ్రాగ‌న్ ఫ్రూట్ సాగును ప్రారంభించారు. అయితే ఈ సాగుకు ముందు.. అనేక పండ్ల తోట‌ల‌పై ఆమె ప‌రిశోధ‌న చేశారు. కానీ చివ‌ర‌కు అత్య‌ధిక డిమాండ్ ఉన్న డ్రాగ‌న్ ఫ్రూట్ మొక్క‌ల‌ను సాగు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దాదాపు 52 విదేశీ పండ్ల‌పై అధ్య‌య‌నం చేసిన‌ట్లు తెలిపారు. పోష‌క విలువ‌లు అధికంగా ఉండే డ్రాగ‌న్ ఫ్రూట్‌నే పెంచాల‌ని నిర్ణ‌యించుకుని ఆ వైపు అడుగులు వేశారు.

మలేషియ‌న్ కింగ్ రెడ్ వెరైటీ ఎంపిక‌

మొత్తానికి రేమాభాయ్ మలేషియ‌న్ కింగ్ రెడ్ వెరైటీని ఎంచుకున్నారు. ఇక త‌న పెర‌ట్లో 90 కాంక్రీట్ స్తంభాల‌ను నాటి ఒక్కో పోల్‌కు నాలుగు మొక్క‌ల చొప్పున నాటారు. అలా త‌క్కువ ప్లేస్‌లోనే 360 మొక్క‌ల‌ను సాగు చేశారు. ఒక్కో కాంక్రీట్ పోల్‌ను రూ. 350కు కొనుగోలు చేశారు. పాత టైర్ల‌ను పోల్‌పై ఏర్పాటు చేసి, మొక్క‌ల‌కు స‌పోర్ట్‌గా పెట్టారు. ప్ర‌తి వ‌రుస‌కు రెండు మీటర్ల గ్యాప్, పోల్‌కు పోల్ మ‌ధ్య‌న 60 సెంటిమీట‌ర్ల గ్యాప్ ఉండేలా జాగ్ర‌త్తలు తీసుకున్నారు.

సేంద్రియ ఎరువుల‌తో సాగు

అయితే డ్రాగ‌న్ ఫ్రూట్ సాగుకు ఆమె కేవ‌లం ఆర్గానిక్ ఫెర్టిలైజ‌ర్స్‌ను మాత్ర‌మే వినియోగిస్తున్నారు. చాలా తోట‌ల్లో డ్రాగ‌న్ ఫ్రూట్స్ అనేవి ఐదారు నెల‌లు మాత్ర‌మే పండుతాయి. కానీ ఈమె ఆర్గానిక్ ఫెర్టిలైజ‌ర్స్ వాడ‌డంతో ఏడాదిలో 10 నెల‌ల పాటు డ్రాగ‌న్ ఫ్రూట్స్ పండుతున్నాయి. ఎలాంటి మ‌ట్టి వినియోగించ‌కుండానే సేంద్రియ ఎరువుల‌తో సాగు చేస్తున్నారామె.

తొలి ఆదాయం రూ. 50 వేల‌కు పైగా

ఇక ఆరు నెల‌ల స‌మ‌యానికే డ్రాగ‌న్ మొక్క‌లు పువ్వులు పూయ‌డం ప్రారంభించాయి. 2023 మార్చి నాటికి మొద‌టి పంట కోత‌కు వ‌చ్చింది. ఈ 360 మొక్క‌లు నెల‌కు రూ. 50 వేల‌కు పైగా ఆదాయం వ‌చ్చింది. మొక్క‌లు పెరిగే కొద్ది.. నెల‌కు రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం స‌మ‌కూరింది. గ‌రిష్టంగా నెల‌కు 750 కిలోల దిగుబ‌డి వ‌చ్చింద‌ని రేమాభాయ్ తెలిపారు. వినియోగ‌దారులు, హోల్ సేల‌ర్స్, ఆర్గానిక్ స్టోర్ య‌జ‌మానులు త‌న‌ను నేరుగా సంప్ర‌దించి, ఇంటి వ‌ద్ద‌కే వ‌చ్చి కేజీ డ్రాగ‌న్ ఫ్రూట్స్‌ను రూ. 175కు కొనుగోలు చేసేవార‌ని పేర్కొన్నారు.

అదే ఫార్ములాతో త‌న ఇంటి టెర్ర‌స్‌పై కూడా

పెర‌ట్లో పెంచిన మొక్క‌ల‌కు మంచి దిగుబ‌డి ఉండ‌డంతో.. అదే ఫార్ములాతో త‌న ఇంటి టెర్ర‌స్‌పై కూడా డ్రాగ‌న్ మొక్క‌ల‌ను సాగు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. టెర్ర‌స్‌పై పెంచ‌డం సాధ్యం కాద‌ని, మ‌ట్టి పైకి తీసుకెళ్ల‌డం క‌ష్ట‌మ‌ని ఆమె కొడుకు అభిప్రాయ‌ప‌డిన‌ప్ప‌టికీ.. వెనుక‌డుగు వేయ‌లేదు. మ‌ట్టి లేకుండా ఎలా సాగు చేయాలో తెలుసుకున్నారు. మొత్తానికి రేమాభాయ్ ప్ర‌యోగానికి పూనుకున్నారు. దీంతో ఇంట్లోనే త‌యారు చేసిన కంపోస్ట్ ఎరువుతో ఒక మొక్క‌ను, సాధార‌ణ మ‌ట్టిలో మ‌రో మొక్క‌ను నాటారు. కంపోస్ట్‌లో నాటిన మొక్క మూడు వార‌ల్లోనే పెరిగి పెద్ద‌దైంది. అదే మ‌ట్టిలో నాటిన మొక్క పెరిగేందుకు 50 రోజుల‌కు పైగా ప‌ట్టింది.

కంపోస్టు ఎరువుతో

దీంతో టెర్ర‌స్‌పై మ‌ట్టితో పెంచ‌డం కంటే కంపోస్టు ఎరువుతో పెంచ‌డం అనుకూల‌మ‌ని రేమాభాయ్ నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో 50 ప్లాస్టిక్ డ్ర‌మ్ముల‌ను కొనుగోలు చేశారు. ఒక్కో డ్ర‌మ్ములో కంపోస్టు ఎరువు, ఆవు పేడ మిశ్ర‌మం క‌లిపారు. అనంత‌రం ఒక్కో డ్ర‌మ్ములో రెండు డ్రాగ‌న్ మొక్క‌ల‌ను నాటారు. ఇలా చేయ‌డం ద్వారా ఐదు నెల‌ల్లోనే డ్రాగ‌న్ ఫ్రూట్స్ పండాయి.

నెల‌కు రూ. 4 ల‌క్ష‌లు ఆదాయం

2023 అక్టోబ‌ర్ నాటికి టెర్ర‌స్ పై నాటి మొక్క‌లు ఉత్ప‌త్తి ప్రారంభించాయి. ఒక్కో మొక్క నుంచి 10 నుంచి 20 వ‌ర‌కు పండ్ల దిగుబ‌డి వ‌చ్చింది. ఇలా నెల‌లో నాలుగు సార్లు ఆమె పండ్ల‌ను కోయ‌డం మొద‌లు పెట్టారు. పెర‌ట్లో, టెర్ర‌స్‌పై పెంచుతున్న డ్రాగ‌న్ మొక్క‌ల నుంచి ఉత్ప‌త్తి అయిన పండ్ల‌ను విక్ర‌యించ‌డంతో నెల‌కు రూ. 4 ల‌క్ష‌లు ఆదాయం రావ‌డం మొద‌లైంది.

2500 మంది రైతులు డ్రాగన్ మొక్క‌ల కొనుగోలు

మ‌ట్టి లేని ప‌ద్ధ‌తుల్లో డ్రాగ‌న్ మొక్క‌లు సాగు చేయ‌డంతో.. రైతుల దృష్టి ఆ మొక్క‌ల‌పై ప‌డింది. ఇంకేముంది.. రేమాభాయ్‌ను సంప్ర‌దించి త‌మ‌కు మొక్క‌లు కావాల‌ని రైతులు అడిగారు. అలా 2,500 మంది రైతుల‌కు ఒక్కో డ్రాగ‌న్ కాండాన్ని రూ. 70 చొప్పున విక్ర‌యించారు. రైతులు ఎవ‌రైతే ఆమె తోట‌లోని కాండాల‌ను తీసుకెళ్లి నాటారో వారంతా.. భారీగా ఆదాయం స‌ముపార్జిస్తున్నారు. దిగుబ‌డి అధికంగా ఉంద‌ని చెబుతున్న‌ట్లు రేమాభాయ్ పేర్కొన్నారు.

ఇండియాలోనే కాదు.. మాల్దీవులు, శ్రీలంక‌లోనూ వినియోగ‌దారులు

రేమాభాయ్ తోట నుంచి డ్రాగ‌న్ కాండాల‌ను కొనుగోలు చేసేవారు ఒక్క ఇండియాలోనే లేరు. మాల్దీవులు, శ్రీలంక‌లోనూ ఉన్నారు. దేశంలో పుణె, హ‌ర్యానా, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌తో పాటు ప‌లు ప్రాంతాల నుంచి రైతులు వెళ్లి ఆమె వ‌ద్ద మొక్క‌ల‌ను కొనుగోలు చేస్తున్నారు.

కొరియ‌ర్ ద్వారా కూడా స‌ర‌ఫ‌రా

రైతులు కొల్లాం వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. మొబైల్ ద్వారా రేమాభాయ్‌ను సంప్ర‌దిస్తే చాలు.. డీటీడీసీ వంటి కొరియ‌ర్ సేవ‌ల ద్వారా కూడా పంపిస్తారామె. ఒక్క రోజులోనే తెలంగాణ‌కు సుమారు 5,500 కాండాలు పంపించిన‌ట్లు ఆమె పేర్కొన్నారు.

రేమాభాయ్ మొబైల్ నంబ‌ర్ : +91 9349937641

Advertisement
Advertisement