త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్

ఎండ తీవ్రతకు అల్లాడిపోయి తీవ్రమైన దాహంతో ఉన్న ఓ కోతి రోడ్డు మీద వెళ్తున్న బస్సును ఆపింది. ప్రయాణికులు నీళ్లు ఇవ్వగానే అడవిలోంచి మరిన్ని కోతులు రావడం కంటతడి పెట్టిస్తోంది.

J

Viral news | Published On May 21, 2026, 5.56 pm IST

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
Advertisement

Thirsty Monkey Viral Video | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్ర (Maharashtra) లోని విదర్భ ప్రాంతంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు మనుషులతో పాటు మూగజీవాలు కూడా అల్లాడిపోతున్నాయి. తాజాగా యవత్మాల్ జిల్లాలోని ఖండాలా ఘాట్ వద్ద బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగిన ఓ గుండెను పిండేసే ఘటన (Heartbreaking incident) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తీవ్రమైన దాహంతో ఉన్న ఓ కోతి ఏకంగా రోడ్డు మీద వెళ్తున్న బస్సును ఆపేసింది.

నీళ్ల కోసం తపన.. చలించిపోయిన ప్రయాణికులు

వాషిమ్ నుంచి పుసాద్ వెళ్తున్న ఎంఎస్‌ఆర్‌టీసీ (MSRTC) బస్సు ఖండాలా ఘాట్ అటవీ ప్రాంతానికి చేరుకోగానే, సడెన్‌గా ఓ కోతి బస్సు ముందుకు వచ్చి నిలబడింది. డ్రైవర్ బస్సును ఆపి దాన్ని తరిమేందుకు ప్రయత్నించినా అది కదలలేదు. ఎండకు నీరసించిపోయి దాహంతోనే అది బస్సును ఆపిందని గ్రహించిన కొందరు ప్రయాణికులు.. వెంటనే కిందకు దిగి తమ వద్ద ఉన్న వాటర్ బాటిళ్లతో (Water bottles) ఆ కోతికి నీళ్లు తాగించారు.

అడవిలో నుంచి వచ్చిన మరిన్ని కోతులు

అది నీళ్లు తాగడం చూసి క్షణాల్లో అడవిలో నుంచి మరిన్ని కోతులు బస్సు దగ్గరకు చేరుకున్నాయి. అవి కూడా దాహంతో అల్లాడిపోతూ గుక్కెడు నీళ్ల కోసం ఎగబడటం చూసి ప్రయాణికులు కంటతడి పెట్టుకున్నారు. వెంటనే బస్సులోని ప్రయాణికులంతా ముందుకు వచ్చి తమ బాటిళ్లలో ఉన్న నీటిని ఆ మూగజీవాలకు ఇచ్చి దాహం తీర్చారు. బస్సులో ఉన్న లతా శ్రీవాస్ అనే ప్రయాణికురాలు ఈ దృశ్యాలను వీడియో తీయగా, ఇప్పుడు నెట్టింట వైరల్ (Viral video) అవుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు

విదర్భ లాంటి కరువు ప్రాంతాల్లో వేసవి తీవ్రత ఎలా ఉందో ఈ వీడియో కళ్లకు కడుతోంది. సాధారణంగా ఎండాకాలంలో వన్యప్రాణుల కోసం అటవీశాఖ (Forest department) అడవుల్లో కృత్రిమ నీటి కుంటలు, ట్యాంకులు ఏర్పాటు చేయాలి. కానీ జంతువులు ఇలా రోడ్ల పైకి వస్తున్నాయంటే అధికారుల నిర్లక్ష్యం ఎంతుందో అర్థమవుతోందని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

"ఈ వీడియో చూస్తుంటే మనసు తరుక్కుపోతోంది.. మహారాష్ట్రలో ఈ ఏడాది ఎండలు దారుణంగా ఉన్నాయి. వన్యప్రాణుల కోసం అధికారులు, స్థానికులు వెంటనే వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేయాలి" అని ఎక్స్ వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
Advertisement