త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bengaluru Car Vandalism | కారు పార్క్ చేశాడని రాళ్లతో గీసేశారు.. బానెట్‌పై ‘నో పార్కింగ్’ అని చెక్కిన ఇంటి ఓనర్లు!

బెంగళూరులో రాత్రిపూట కారు పార్క్ చేసిన ఒక వ్యక్తికి మరుసటి రోజు ఉదయం ఊహించని షాక్ తగిలింది. కారును ధ్వంసం చేయడమే కాకుండా, బానెట్‌పై ఏం రాశారంటే..

J

Viral news | Published On Jun 14, 2026, 11.55 pm IST

Bengaluru Car Vandalism | కారు పార్క్ చేశాడని రాళ్లతో గీసేశారు.. బానెట్‌పై ‘నో పార్కింగ్’ అని చెక్కిన ఇంటి ఓనర్లు!
Advertisement
  • బెంగళూరులోని బీటీఎం లేఅవుట్ వద్ద స్నేహితుడిని కలిసేందుకు వెళ్లి రాత్రి కారు పార్క్ చేసిన జాషువా అనే యువకుడు
  • మరుసటి రోజు ఉదయం చూసేసరికి కారు నిండా గీతలు, బానెట్‌పై పదునైన ఆయుధాలతో 'NO PARKING' అని చెక్కిన దుండగులు
  • అక్కడ ఎలాంటి పార్కింగ్ బోర్డు లేకపోయినా, స్థానిక ఇంటి ఓనర్లు (భార్యాభర్తలు) ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితుడి ఆరోపణ
  • ఇదెక్కడి మైండ్‌సెట్ అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు.
  • మదివాళ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

Bengaluru Car Vandalism | త్రినేత్ర.న్యూస్ : బెంగళూరు (Bengaluru) నగరంలో పార్కింగ్ కష్టాలు, స్థానికుల ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. తాజాగా స్నేహితుడిని కలిసేందుకు వెళ్లి, రాత్రిపూట రోడ్డు పక్కన కారు పార్క్ చేసిన ఒక వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. కారు తీద్దామని వచ్చేసరికి.. బానెట్‌పై ఏకంగా రాళ్లు, పదునైన వస్తువులతో 'NO PARKING' అని చెక్కి దారుణంగా ధ్వంసం చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే..

ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) లో బాధితుడు జాషువా పంచుకున్న వీడియో ప్రకారం.. బుధవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో బీటీఎం లేఅవుట్ (BTM Layout) సమీపంలోని ఒక రెసిడెన్షియల్ ఏరియాలో తన కారును పార్క్ చేశాడు. తాను రెగ్యులర్‌గా అక్కడికి వెళ్లే వ్యక్తిని కాదని, కేవలం స్నేహితుడిని కలవడానికే వెళ్లానని తెలిపాడు. ఆ వీధిలో అప్పటికే చాలా వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి, పైగా అక్కడ ఎలాంటి 'నో పార్కింగ్' (No Parking) బోర్డు కూడా లేదు. కానీ మరుసటి రోజు ఉదయం 9 గంటలకు వచ్చి చూసేసరికి తన కారు పరిస్థితి చూసి కంగుతిన్నాడు.

కారు నిండా గీతలే..

కారు డోర్లు, సైడ్ ప్యానెల్స్‌తో పాటు బానెట్‌పై పదునైన వస్తువులతో గీసేశారు. ముఖ్యంగా కారు ముందు భాగంలో పెద్ద అక్షరాలతో 'NO PARKING' అని రాళ్లతో చెక్కేశారు. దీనివల్ల కారు పెయింట్, బాడీకి భారీగా నష్టం వాటిల్లిందని జాషువా వాపోయాడు. పక్కనే ఉన్న భవన యజమానులే (భార్యాభర్తలు) ఈ దారుణానికి ఒడిగట్టారని ఆయన ఆరోపించాడు. ఎవరి గేటుకు లేదా దారికి అడ్డంగా తాను కారు పెట్టలేదని, అయినా వాళ్లు ఇలా ప్రవర్తించడం దారుణమని అసహనం వ్యక్తం చేశాడు.

అదెక్కడి మైండ్‌సెట్ భయ్యా?

"కారు పార్కింగ్ విషయంలో ఏమైనా సమస్య ఉంటే సభ్యతగా కమ్యూనికేట్ చేయొచ్చు. అంతేగానీ ఒకరి ఆస్తిని ఇలా ధ్వంసం చేయడం (Vandalised) ఏమాత్రం కరెక్ట్ కాదు. నేను ఎన్నో ప్రాంతాలు తిరిగాను కానీ, ఎంతో అందమైన బెంగళూరు సిటీలో ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం చాలా బాధాకరం," అని జాషువా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై మదివాళ పోలీస్ స్టేషన్‌లో (Madiwala Police Station) అధికారికంగా ఫిర్యాదు చేశానని, భవిష్యత్తులో తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదనే ఈ వీడియోను షేర్ చేస్తున్నానని ఆయన పేర్కొన్నాడు.

Advertisement
Advertisement