IRCTC Tour | ఐదు రోజులు ప్రకృతి ఒడిలో.. చలికాలంలో దండకారణ్య అందాలు చూసొద్దామా..?
IRCTC Tour | చలికాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దట్టమైన అడవులు.. ఎత్తైన కొండలు.. జలపాతాలు.. చారిత్రక కట్టడాలు.. ఆధ్యాత్మిక ప్రదేశాల సమాహారమైన ఛత్తీస్‌గఢ్ దండకారణ్య ప్రాంతాన్ని సందర్శించేలా ‘డిస్కవర్ దండకారణ్య’ పేరుతో ఐదు రోజుల పర్యటనను రూపొందించింది.
- ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
- హైదరాబాద్ నుంచే ఎయిర్ ప్యాకేజీ
- రాయ్‌పూర్, సిర్పూర్, జగదల్‌పూర్, చిత్రకూట్ సందర్శనకు ఛాన్స్
IRCTC Tour | చలికాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దట్టమైన అడవులు.. ఎత్తైన కొండలు.. జలపాతాలు.. చారిత్రక కట్టడాలు.. ఆధ్యాత్మిక ప్రదేశాల సమాహారమైన ఛత్తీస్‌గఢ్ దండకారణ్య ప్రాంతాన్ని సందర్శించేలా ‘డిస్కవర్ దండకారణ్య’ పేరుతో ఐదు రోజుల పర్యటనను రూపొందించింది. హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణంతో పాటు హోటల్ వసతి, స్థానిక సందర్శనలకు రవాణా సదుపాయం కల్పిస్తోంది. డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు ఈ టూర్ కొనసాగనుంది.
చలికాలంలో ఆహ్లాదకరమైన ప్రయాణం
డిసెంబర్ నెలలో ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో చలికాలం కొనసాగుతుంది. వేసవి ఎండలు, వర్షాకాలపు ఇబ్బందులు లేకుండా పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. రాయ్‌పూర్‌తో పాటు జగదల్‌పూర్ పరిసరాల్లో ఉదయం, రాత్రి వేళల్లో చల్లని వాతావరణం, పగటిపూట సాధారణంగా ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. ముఖ్యంగా అడవులు, కొండలు, జలపాతాల పరిసరాల్లో ప్రకృతి అందాలను ప్రశాంతంగా ఆస్వాదించవచ్చు. ఉదయం, సాయంత్రం వేళల్లో తేలికపాటి చలిని ఆస్వాదిస్తూ పర్యటన సాగించొచ్చు.
రాయ్‌పూర్.. ఆధ్యాత్మికతకు, ఆహ్లాదానికి నెలవు
టూర్ తొలి మజిలీ ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్. హైదరాబాద్ నుంచి విమానంలో చేరుకున్న అనంతరం ముక్తాంగన్ కల్చరల్ గార్డెన్, కౌసల్య మాత మందిరం, రామ్ మందిరం, వివేకానంద సరోవర్‌ను సందర్శిస్తారు. ఉద్యానవనాల ప్రశాంత వాతావరణం, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనతో పర్యటన ప్రారంభమవుతుంది. నగర సందడికి దూరంగా సాయంత్రం వేళ సరస్సు పరిసరాల్లో గడపడం ప్రత్యేక అనుభూతినిస్తుంది.
సిర్పూర్.. చరిత్రను పలకరించే ప్రాచీన నగరం
రెండో రోజు రాయ్‌పూర్ నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని సిర్పూర్‌కు పయనం. మహానది తీరాన ఉన్న ఈ ప్రాచీన ప్రాంతం చారిత్రక, పురావస్తు సంపదకు ప్రసిద్ధి. ఇక్కడి లక్ష్మణ ఆలయం ప్రత్యేక ఆకర్షణ. పురాతన ఇటుక నిర్మాణ శైలి, శిల్పకళ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాలకు సంబంధించిన పురాతన కట్టడాలు ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యతను చాటిచెబుతాయి. అనంతరం చంపారణ్‌లోని వల్లభాచార్య మందిరాన్ని సందర్శించి తిరిగి రాయ్‌పూర్ చేరుకుంటారు.
జగదల్‌పూర్.. గిరిజన సంస్కృతికి కేరాఫ్ అడ్రస్
మూడో రోజు సుమారు 300 కిలోమీటర్ల ప్రయాణంతో జగదల్‌పూర్‌కు చేరుకుంటారు. బస్తర్ ప్రాంతానికి ప్రధాన కేంద్రంగా ఉన్న జగదల్‌పూర్ ప్రకృతి సౌందర్యం, గిరిజన సంస్కృతి, కళలకు ప్రసిద్ధి. దట్టమైన అడవులు, కొండలు, జలపాతాలు, గిరిజన జీవనశైలి ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. మార్గమధ్యంలో గంగ్రేల్ డ్యామ్‌ను సందర్శించే అవకాశం ఉంటుంది. ప్రకృతి ఒడిలో సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది.
చిత్రకూట్ జలపాతం.. దండకారణ్యానికి ప్రత్యేక ఆకర్షణ..
ఈ పర్యటనలో నాలుగో రోజు ప్రత్యేక ఆకర్షణ చిత్రకూట్ జలపాతం. జగదల్‌పూర్‌కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రావతి నదిపై ఈ జలపాతం ఉంది. గుర్రపునాడా ఆకారంలో విస్తరించి ఉండటంతో దీనిని ‘భారత నయాగరా’గా పిలుస్తారు. సుమారు 90 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలధారలు, చుట్టూ విస్తరించిన పచ్చని అడవులు పర్యాటకులను కట్టిపడేస్తాయి. వర్షాకాలంలో జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తూ కనువిందు చేస్తుంది. డిసెంబర్‌లో నీటి ప్రవాహం తగ్గినా, ప్రకృతి అందాలను ప్రశాంతంగా ఆస్వాదించేందుకు అవకాశం ఉంటుంది. సాయంత్రం వేళ జలపాతం పరిసరాల్లో గడిపి తిరిగి జగదల్‌పూర్ చేరుకుంటారు.
బస్తర్ ప్యాలెస్, దంతేశ్వరి ఆలయ సందర్శన
చివరి రోజు బస్తర్ ప్యాలెస్, దంతేశ్వరి మందిరాన్ని సందర్శిస్తారు. బస్తర్ రాజవంశ చరిత్రకు ప్రతీకగా నిలిచే ప్యాలెస్ నిర్మాణశైలి, కళాత్మక అలంకరణలు ప్రత్యేక ఆకర్షణ. బస్తర్ ప్రాంత ప్రజల ఆరాధ్యదైవమైన దంతేశ్వరి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్శన అనంతరం జగదల్‌పూర్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరడంతో ఐదు రోజుల పర్యటన ముగుస్తుంది.
ప్యాకేజీ వివరాలు..
‘డిస్కవర్ దండకారణ్య’ పేరుతో SHA59 కోడ్‌పై ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీని అందిస్తోంది. 2026 డిసెంబర్ 2న ఉదయం 9.05 గంటలకు హైదరాబాద్ నుంచి 6E 192 విమానంలో బయలుదేరి 10.30 గంటలకు రాయ్‌పూర్ చేరుకుంటారు. డిసెంబర్ 6న సాయంత్రం 4 గంటలకు జగదల్‌పూర్ నుంచి 6E 7105 విమానంలో బయలుదేరి 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ప్యాకేజీ వివరాల విషయానికి వస్తే.. కంఫర్ట్ క్లాస్‌లో ఒక్కొక్కరికి సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.44వేలు చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.35,850.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.34,800 చార్జీగా నిర్ణయించారు. 5–11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ.30,400.. బెడ్ లేకుండా రూ.29,950, 2–4 ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా రూ.22,300 చెల్లించాల్సి రానుంది.
ప్యాకేజీలో ఏమేం కవర్ అవుతాయంటే..?
హైదరాబాద్–రాయ్‌పూర్, జగదల్‌పూర్–హైదరాబాద్ విమాన టికెట్లు, రాయ్‌పూర్‌లో రెండు రాత్రులు, జగదల్‌పూర్‌లో రెండు రాత్రుల హోటల్ వసతి కల్పిస్తారు. నాలుగు బ్రేక్‌ఫాస్ట్‌లు, ఒక లంచ్, నాలుగు డిన్నర్లు అందిస్తారు. పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఏసీ 25 సీట్ల బస్సు, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఐఆర్‌సీటీసీ టూర్ ఎస్కార్ట్ సేవలు అన్నీ వర్తిస్తాయి. అదనపు భోజనం, స్థానిక రవాణా, విమానాశ్రయానికి పికప్–డ్రాప్, సందర్శన ప్రాంతాల్లో ప్రవేశ, దర్శన టికెట్లు, టూర్ గైడ్ సేవలు, వ్యక్తిగత ఖర్చులు ప్యాకేజీలో ఉండవు. వీటికి పర్యాటకులే అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. ఈ ప్యాకేజీకి సంబంధించి 19 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. రాయ్‌పూర్‌లో గ్రాండ్ రాజ్‌పుతానా, అదే స్థాయి హోటల్‌లో, జగదల్‌పూర్‌లో అవినాష్ ఇంటర్నేషనల్ లేకపోతే అదే స్థాయి హోటల్‌లో వసతి కల్పిస్తారు. ఆలయాల్లో పూజలు, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే వారు అదనంగా సమయం కేటాయించాల్సి ఉంటుంది. కొన్ని ఆలయాలకు పెద్ద బస్సులు వెళ్లలేని పరిస్థితుల్లో స్థానిక ఆటోరిక్షాలను వినియోగించుకోవాల్సి రావచ్చని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. విమాన సమయాలు, పర్యటన షెడ్యూల్ విమానయాన సంస్థల నిర్వహణ పరిస్థితులకు అనుగుణంగా మారుతుందని స్పష్టం చేసింది.
ప్యాకేజీ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Also :
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి
- ●Bharat Summit Hyderabad Visa Row | అప్పుడు రేవంత్ టూర్.. ఇప్పుడు హైదరాబాద్ 'భారత్ సమ్మిట్'! మళ్లీ తెరపైకి వీసా వివాదం
- ●Sreeleela | సాయిపల్లవి వర్సెస్ శ్రీలీల - "ఓం" సినిమా కోసం ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువంటే?
- ●FAA Flight Outage | అమెరికా విమానాలకు సడెన్ బ్రేక్: రోజుకు 44,000 ఫ్లైట్స్, గాల్లో 5,500.. అసలు యూఎస్ గగనతలం ఎలా పనిచేస్తుందంటే?
- ●Mirnalini Ravi | ప్రియుడిని పెళ్లిచేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్ - మెహందీ వేడుకల ఫొటోలు వైరల్
- ●School Bus | డ్రైవర్‌కు ఫిట్స్.. 40 మంది స్కూల్ విద్యార్థులు సురక్షితం

IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Bharat Summit Hyderabad Visa Row | అప్పుడు రేవంత్ టూర్.. ఇప్పుడు హైదరాబాద్ 'భారత్ సమ్మిట్'! మళ్లీ తెరపైకి వీసా వివాదం

Sreeleela | సాయిపల్లవి వర్సెస్ శ్రీలీల - "ఓం" సినిమా కోసం ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువంటే?

FAA Flight Outage | అమెరికా విమానాలకు సడెన్ బ్రేక్: రోజుకు 44,000 ఫ్లైట్స్, గాల్లో 5,500.. అసలు యూఎస్ గగనతలం ఎలా పనిచేస్తుందంటే?






