త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

U19 Asia Cup 2026 | ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ సంచలన విజయం

U19 Asia Cup 2026 | అండర్‌-19 ఆసియా కప్‌ 2026లో భారత యువ జట్టు అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో అద్భుత పోరాటంతో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. ఒక దశలో ఓటమి ఖాయమనుకున్న పరిస్థితుల నుంచి యువ ఆటగాళ్లు అసాధారణంగా పోరాడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

P

Sports | Published On Nov 14, 2026, 7.08 pm IST

U19 Asia Cup 2026 | ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ సంచలన విజయం
Advertisement
  • చివరి బంతికి బౌండరీ.. ఒక్క వికెట్ తేడాతో అండర్‌-19 ఆసియా కప్ కైవసం
  • జట్టును గెలిపించిన మోహిత్ ఉల్వా.. మనల్ చౌహాన్ అద్భుత పోరాటం

U19 Asia Cup 2026 | అండర్‌-19 ఆసియా కప్‌ 2026లో భారత యువ జట్టు అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో అద్భుత పోరాటంతో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. ఒక దశలో ఓటమి ఖాయమనుకున్న పరిస్థితుల నుంచి యువ ఆటగాళ్లు అసాధారణంగా పోరాడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. చివరి బంతికి బౌండరీ బాది మోహిత్ ఉల్వా భారత్‌ను విజేతగా నిలిపాడు.

చెల‌రేగిన పాక్ బ్యాట్స్‌మెన్‌

ఒమన్‌లోని అల్ అమరత్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు బ్యాటర్లు భారీ స్కోరు సాధించారు. ఉస్మాన్ ఖాన్ (107) శతకంతో చెలరేగగా.. అబ్దుల్ ఖాదిర్ (80) ధాటిగా ఆడాడు. కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ 60 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టు స్కోరు పెరగడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో కావ్య పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. తెలుగు కుర్రాడు చిగురుపాటి వెంకట మూడు వికెట్లతో రాణించాడు.

ఆదిలో అదరగొట్టిన ఓపెనర్లు.. ఆ తర్వాత వరుస వికెట్లు

338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు లక్ష్య రైచందానీ, ఆర్యవీర్ సెహ్వాగ్ శుభారంభం అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించారు. ఆర్యవీర్ 61 బంతుల్లో 58 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వికెట్లు పడటంతో ఒత్తిడి పెరిగింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వీకే వినీత్ 24 పరుగులు చేయగా.. అర్జున్ రాజ్‌పుత్ 16, యశ్వర్ధన్ చౌహాన్ 9 పరుగులకే పరిమితమయ్యారు. దీంతో భారత్ 186 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. మరోవైపు లక్ష్య రైచందానీ మాత్రం పట్టుదలగా ఆడుతూ 80 పరుగులు చేశాడు. అతడికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం ద‌క్క‌లేదు. అన్వయ్ ద్రవిడ్ 19 పరుగులతో క్రీజులో నిలదొక్కుకుంటున్న సమయంలో రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ ఓటమి అంచుల్లోకి వెళ్లింది. 252 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోవడంతో పాకిస్థాన్ విజయం ఖాయ‌మ‌నుకున్నారు.

మోహిత్, మనల్ అద్భుత పోరాటం..

ఈ దశలో క్రీజులోకి వచ్చిన మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా అద్భుత పోరాటం చేశారు. పాకిస్థాన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగుల వేగాన్ని పెంచారు. ఇద్దరూ కలిసి 57 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మనల్ చౌహాన్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును విజయానికి చేరువ చేయగా.. మరోవైపు మోహిత్ ఉల్వా అతడికి అండగా నిలిచాడు. మనల్ ఔటైన తర్వాత బాధ్యతను తన భుజాలపై వేసుకున్న మోహిత్ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా బ్యాటింగ్ చేశాడు. చివరి వరకు క్రీజులో నిలిచి అజేయంగా 49 పరుగులు చేశాడు. చివరి బంతికి బౌండరీ బాది భారత్‌కు విజయాన్ని అందించాడు. దీంతో ఒక్క వికెట్ తేడాతో పాకిస్థాన్‌పై గెలిచిన భారత యువ జట్టు అండర్‌-19 ఆసియా కప్‌ 2026 టైటిల్‌ను కైవసం చేసుకుంది. అసాధ్యం అనుకున్న మ్యాచ్‌ను అద్భుత పోరాటంతో గెలిపించిన మోహిత్ ఉల్వా, మనల్ చౌహాన్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

Advertisement
Advertisement