త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Transnistria | వరల్డ్ మ్యాప్‌లోనే లేని ఈ దేశం.. ఇప్పుడు టూరిస్ట్‌లకు హాట్ స్పాట్!

Transnistria | వరల్డ్ మ్యాప్‌లో ఈ దేశం కనిపించదు.. ఐక్యరాజ్యసమితి గుర్తింపూ లేదు.. అయినా సరే ఓ ప్రాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అదే ట్రాన్స్‌నిస్ట్రియా. మోల్డోవా, ఉక్రెయిన్ మధ్య ఉండే చిన్న భూభాగం ఇది.

S

Tourism | Published On Dec 27, 2025, 10.24 am IST

Transnistria | వరల్డ్ మ్యాప్‌లోనే లేని ఈ దేశం.. ఇప్పుడు టూరిస్ట్‌లకు హాట్ స్పాట్!
Advertisement

Transnistria | వరల్డ్ మ్యాప్‌లో ఈ దేశం కనిపించదు.. ఐక్యరాజ్యసమితి గుర్తింపూ లేదు.. అయినా సరే ఓ ప్రాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అదే ట్రాన్స్‌నిస్ట్రియా. మోల్డోవా, ఉక్రెయిన్ మధ్య ఉండే చిన్న భూభాగం ఇది. దీన్ని అధికారికంగా ప్రిడ్నెస్ట్రోవియన్ మోల్డావియన్ రిపబ్లిక్ (PMR) అని పిలుస్తారు. ఈ దేశానికి గుర్తింపు లేనప్పటికీ.. ఇక్కడ ప్రత్యేక ప్రభుత్వం, సైన్యం, కరెన్సీ, జెండా కూడా ఉన్నాయి. ట్రావెల్ రీల్స్, వ్లాగ్స్ ద్వారా ఈ దేశం కొంతకాలంగా ప్రపంచం దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది.

ఈ దేశ చరిత్ర ఇదే!

సోవియట్ యూనియన్ పతనం అనంతరం 1990వ దశకంలో ఇక్కడ విబేధాలు వచ్చాయి. ఆ సమయంలో మోల్డోవా రొమేనియాతో కలవాలని ప్రయత్నాలు చేసింది. కానీ డ్నిస్టర్ నదికి తూర్పు ఒడ్డున నివసించే రష్యన్ మాట్లాడే జనాభా మాత్రం దీన్ని వ్యతిరేకించారు. ఈ చర్యతో తమ భాష, సంస్కృతిని కోల్పోతామని భయపడింది. ఈ క్రమంలోనే మోల్డోవా నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకుని, దానికి ట్రాన్స్‌నిస్ట్రియా అని పేరు పెట్టుకుంది. దీంతో 1992లో మోల్డోవా దళాలకు, రష్యన్ 14వ సైన్యం మద్దతు ఉన్న ట్రాన్స్‌నిస్ట్రియా వేర్పాటువాదుల మధ్య చిన్న యుద్ధం జరిగింది. అయితే రఈ పోరాటం కొంతకాలానికి కాల్పుల విరమణతో ముగిసింది. అప్పటి నుంచి ట్రాన్స్‌నిస్ట్రియా స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది. ఈ ప్రాంతం సుమారు 4,163 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.

ఇన్‌స్టా రీల్స్‌తో పాపులర్

ప్రపంచ పటంలో కూడా లేని ట్రాన్స్‌నిస్ట్రియా దేశం గురించి చాలామందికి తెలియదు. కానీ ఇటీవల రీల్స్‌, వీడియోల కారణంగా ఈ దేశం పాపులారిటీ సంపాదించింది. దీంతో ఇక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఇటీవల రెట్టింపయ్యింది. 2020 అంచనాల ప్రకారం ఏటా సుమారు 20 వేల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఎక్కువగా మోల్డావా నుంచి వన్ డే ట్రిప్ కోసం ఎక్కువగా పర్యాటకులు వస్తున్నారు. పర్యాటకులకు రోజురోజుకీ పెరుగుతున్న ఆసక్తి కారణంగా ట్రాన్స్‌నిస్ట్రియా తొలిసారిగా రష్యన్, ఇంగ్లీష్ భాషల్లో ట్రావెల్ గైడ్‌ను కూడా విడుదల చేసింది.

ట్రాన్స్‌నిస్ట్రియాకు వెళ్లడం సురక్షితమేనా?

రష్యన్ సైనికుల ఉనికి ఎక్కువగా ఉన్నందున ట్రాన్స్‌నిస్ట్రియాకు వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలని సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు సూచిస్తున్నారు. ఇది సాధారణంగా సరిహద్దు దాటినట్లు కాదని.. ఒక్క తప్పటి అడుగువ వేసినా పెద్ద సమస్యలు తెచ్చిపెట్టవచ్చని ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ డ్రూ బెన్‌స్కీ హెచ్చరించారు. అందుకే సందర్శకులు అక్కడి నియమాలను గౌరవించాలని, మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.

ఇక్కడ ఏం చూడొచ్చు?

ట్రాన్స్‌నిస్ట్రియా రాజధాని టిరాస్పోల్‌ వెళ్తే సోవియట్ యుగంలోకి అడుగుపెట్టిన ఫీలింగ్ వస్తుంది. విస్తారమైన రహదారులు, లెనిన్ విగ్రహాలు, ఎర్ర నక్షత్ర చిహ్నాలు అన్నీ ఆనాటి కాలాన్ని మనకు పరిచయం చేస్తాయి. ప్రధాన పరేడ్ స్క్వేర్ దగ్గర ఉన్న సోవియట్ ట్యాంక్ స్మారకం రెండో ప్రపంచ యుద్ధ విజయాన్ని గుర్తుచేస్తుంది. 1992లో ట్రాన్స్‌నిస్ట్రియా యుద్ధంలో మరణించిన వారికి నివాళిగా ఏర్పాటు చేసిన స్మారకాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు.

ఏం కొనవచ్చు?

టిరాస్పోల్ స్మారక దుకాణాల్లో పీఎంఆర్‌ లోగోతో ఉన్న పోస్టర్లు, జెండాలు, జాతీయ గీతంతో కూడిన పుస్తకాలు దొరకుతాయి. వరల్డ్ మ్యాప్‌లో లేని దేశం నుంచి తీసుకొచ్చిన జ్ఞాపికగా ఇవి ప్రత్యేకంగా నిలుస్తాయి.

ఏం తినాలి?

ఇక్కడి వంటకాల్లో మోల్డోవా, ఉక్రెయిన్, రష్యన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మామాలిగా (చీజ్‌, సోర్ క్రీమ్, మాంసంతో వడ్డించే మొక్కజొన్న గంజి), సర్మాలే ( పంది లేదా గొడ్డు మాంసంతో నిండిన క్యాబేజీ రోల్స్), శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే బోర్స్ట్ ( బీట్‌రూట్ సూప్) వంటి వంటకాలను తప్పకుండా టేస్ట్ చేయాలని ట్రావెల్ వ్లాగర్స్ సూచిస్తున్నారు. అలాగే టిరాస్పోల్‌లో ప్రత్యేకంగా తయారయ్యే క్వింట్ బ్రాండీ కూడా మస్ట్‌గా టేస్ట్ చేయాల్సిందే అంటున్నారు.

ఎలా వెళ్లాలి?

ముందుగా మోల్డోవా రాజధాని చిసినావ్‌కు వెళ్లాలి. అక్కడి నుంచి బస్సు లేదా షేర్ ట్యాక్సీ ఎక్కితే రెండు గంటల్లో ట్రాన్స్‌నిస్ట్రియాకు చేరుకోవచ్చు. బెండర్ చెక్‌పోస్టు వద్ద పాస్‌పోర్టు ముద్రకు బదులు తాత్కాలిక మైగ్రేషన్ కార్డు ఇస్తారు. తిరిగి వెళ్లేటప్పుడు దాన్ని తప్పనిసరిగా చూపించాలి. చిసినావ్ - టిరాస్పోల్ మధ్య రైలు కూడా నడుస్తుంది. ఇది సోవియట్ కాలం నాటి రైలు ప్రయాణాలను గుర్తుచేస్తాయి. ఉక్రెయిన్ నుంచి కూడా ఇక్కడకు వెళ్లవచ్చు. కానీ రష్యాతో యుద్ధం కారణంగా ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement