త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tourism | చలికాలంలో మంచు అందాలను ఆస్వాదించాలా.. ఇండియాలోని ఈ 5 ప్రదేశాలు బెస్ట్ చాయిస్!

Tourism | మంచు కురుస్తున్నప్పుడు చూడాలని.. ఆ మంచులో ఆడాలని చాలామంది ఆశపడుతుంటారు.. ఆ ఆశ తీరాలంటే విదేశాలకే వెళ్లాల్సిన అవసరం లేదు.. మన ఇండియాలోనే అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి.

S

Tourism | Published On Dec 23, 2025, 10.30 pm IST

Tourism | చలికాలంలో మంచు అందాలను ఆస్వాదించాలా.. ఇండియాలోని ఈ 5 ప్రదేశాలు బెస్ట్ చాయిస్!
Advertisement

Tourism | మంచు కురుస్తున్నప్పుడు చూడాలని.. ఆ మంచులో ఆడాలని చాలామంది ఆశపడుతుంటారు.. ఆ ఆశ తీరాలంటే విదేశాలకే వెళ్లాల్సిన అవసరం లేదు.. మన ఇండియాలోనే అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఉత్తర, ఈశాన్య భారతదేశంలో నవంబర్, డిసెంబర్ నుంచే మంచు దృశ్యాలు దర్శనమిస్తుంటాయి. మంచుతో కప్పబడిన కొండలు, చల్లటి సూర్యాస్తమయాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. మరి వాటిలో ఐదు అద్భుతమైన లొకేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఔలి, ఉత్తరాఖండ్

భారతదేశానికి స్కీయింగ్ రాజధానిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లోని ఔలిలో డిసెంబర్‌లో మంచు సీజన్ ప్రారంభమవుతుంది. సముద్రమట్టానికి 8 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ పట్టణం శీతాకాలంలో మంచు దుప్పటి పరిచినట్లుగా అయిపోతుంది. ఓక్ అడవులు, మంచుతో ఉన్న జారువాలులు నందాదేవి, కామెట్ వంటి శిఖరాలను అద్భుతంగా మార్చేస్తాయి. కొండల మధ్య నుంచి వచ్చే చల్లటి గాలి, బంగారు వర్ణపు కాంతి, హిమాలయాల నిశ్శబ్ధం అంతా కలిసి ఔలి పట్టణాన్ని అత్యంత రమణీయంగా కనిపిస్తాయి. మంచు కురవడం ప్రారంభమవ్వగానే ఇక్కడ స్కీయింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తారు. ప్రాశ్చాత్య దేశాల్లో ట్రిప్‌లకు వెళ్లలేని వారికి ఇక్కడ అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు. అలాగే ఆసియాలోనే అతి పొడవైన కేబుల్ కార్లలో ఒకటి ఈ కొండ శ్రేణుల మీదుగానే సాగుతుంది.

మనాలి ( హిమాచల్ ప్రదేశ్)

చలికాలంలో మంచు అందాలను ఆస్వాదించాలని అనుకునేవాళ్లకు మనాలీ కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది. డిసెంబర్ నెలలో ఇక్కడ మంచు కురవడం మొదలవుతుంది. అప్పర్ మనాలీ, ఓల్డ్ మనాలీ, ముఖ్యంగా సోలాంగ్ వ్యాలీలో నిరంతరంగా మంచు పడుతూ ఉంటుంది. స్కీయింగ్, ట్యూబింగ్, స్నో బోర్డింగ్, స్నో మొబైల్ రైడ్ వంటి అడ్వెంచర్ గేమ్స్ కోసం పర్యాటకులు ఇక్కడికి భారీగా తరలివస్తుంటారు. అడ్వెంచర్స్‌ మాత్రమే కాకుండా మంచుతో కప్పబడిన యాపిల్ తోటలు, మంచు దుప్పటి కప్పినట్లుగా ఉండే భూబాగం మధ్యగా ప్రవహించే బియాస్ నది, సాయంకాలంపూట దొరికే మొమోస్ మనాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.

గుల్మర్గ్ (జమ్ము కశ్మీర్)

భారత్‌లో అత్యధికంగా మంచు కురిసే పట్టణాల్లో జమ్ముకశ్మీర్‌లోని గుల్మర్గ్ ఒకటి. డిసెంబర్ నెలలో ఇక్కడి దట్టమైన పైన్ అడవులో మంచుతో నిండిపోతుంటాయి. స్కీయింగ్, స్నో బోర్డింగ్, మంచుతో కప్పబడిన మార్గాల్లో ట్రెక్కింగ్ ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న కేబుల్ కార్లలో ఒకటి గుల్మర్గ్‌లోనే ఉంది. గోండోలాలోని కేబుల్ కారు పర్యాటకులను సుమారు 14 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్తుంది. అంత ఎత్తు నుంచి చూస్తుంటే కనుచూపు మేర మొత్తం తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లుగా రమణీయంగా కనిపిస్తుంది. ఆ మంచు అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తుంటారు.

టవాంగ్ (అరుణాచల్ ప్రదేశ్)

చలికాలంలో విభిన్న అనుభవం కోరుకునేవారికి అరుణాచల్ ప్రదేశ్‌లోని టవాంగ్ బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఈశాన్య పట్టణంలో డిసెంబర్ నెలలో భారీగా మంచు పడుతుంది. దీంతో మఠాలు, సరస్సులు, పర్వత మార్గాలు మంచుతో కప్పబడి అద్భుతంగా కనిపిస్తాయి. 17వ శతాబ్దానికి చెందిన టవాంగ్ మఠం ఆసియాలోనే రెండో అతిపెద్ద మఠం. ఇది ఈ డిసెంబర్‌లో మంచుతో కప్పబడి అద్భుతంగా కనిపిస్తుంది. ఈ కాలంలో చలి తీవ్రంగా ఉన్నప్పటికీ మోన్ఫా ప్రజల ఆతిథ్యం, ప్రశాంతమైన వాతావరణం టవాంగ్ ప్రయాణాన్ని మరుపురాని అనుభవంగా మలుస్తుంది.

పహల్గామ్ (జమ్ముకశ్మీర్)

గుల్మర్గ్‌ తర్వాత జమ్ముకశ్మీర్‌లో అత్యధిక మంచు కురిసే ప్రాంతాల్లో ఒకటి పహల్గామ్. లిద్దర్ లోయలోని ఈ పట్టణం డిసెంబర్‌లో పూర్తిగా మంచుతో కప్పబడుతుంది. పైన్ అడవులు, గడ్డకట్టిన నదులు, తెల్లటి మైదానాలు ఈ సమయంలో మంచుతో మెరిసిపోయి అందంగా కనిపిస్తాయి. పహల్గామ్ సమీపంలోని ఆరు లోయ, బీటాబ్ లోయలు కూడా ప్రకృతి రమణీయతతో మంచి అనుభూతిని కలిగిస్తాయి. వాకింగ్, గుర్రపు స్వారీలు, ఫొటోగ్రఫీని ఇష్టపడే వారిని ఈ పట్టణం విశేషంగా ఆకట్టుకుంటుంది. జనసందడి కంటే నిశ్శబ్దాన్ని కోరుకునే వారికి ఇది బెస్ట్ డెస్టినేషన్.

Advertisement

తాజావార్తలు

Advertisement