త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

YTPS | 15 రోజులుగా ష‌ట్‌డౌన్‌.. వైటీపీఎస్ చీఫ్ ఇంజినీర్‌పై వేటు

YTPS | న‌ల్ల‌గొండ జిల్లా దామ‌ర‌చ‌ర్ల‌లోని యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ స్టేష‌న్ (YTPS) స్టేజ్‌-1 చీఫ్ ఇంజినీర్ సురేశ్ నాయ‌క్‌పై (Suresh Nayak) వేటు ప‌డింది. 800 మెగావాట్ల యూనిట్‌-1ను గ‌త 15 రోజులుగా ష‌ట్‌డౌన్‌లో ఉంచినందుకు గాను ఆయ‌న‌ను ప్ర‌భుత్వం స‌స్పెండ్ (Suspend) చేసింది.

G

Telangana | Published On Oct 15, 2026, 10.56 am IST

YTPS | 15 రోజులుగా ష‌ట్‌డౌన్‌.. వైటీపీఎస్ చీఫ్ ఇంజినీర్‌పై వేటు
Advertisement

YTPS | త్రినేత్ర న్యూస్‌: న‌ల్ల‌గొండ జిల్లా దామ‌ర‌చ‌ర్ల‌లోని యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ స్టేష‌న్ (YTPS) స్టేజ్‌-1 చీఫ్ ఇంజినీర్ సురేశ్ నాయ‌క్‌పై (Suresh Nayak) వేటు ప‌డింది. 800 మెగావాట్ల యూనిట్‌-1ను గ‌త 15 రోజులుగా ష‌ట్‌డౌన్‌లో ఉంచినందుకు గాను ఆయ‌న‌ను ప్ర‌భుత్వం స‌స్పెండ్ (Suspend) చేసింది. సిబ్బంది నిర్వ‌హ‌ణ‌, సాంకేతిక స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో నిర్ల‌క్ష్యం, విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో జనరేషన్ లాస్‌కు కారణమయ్యారని ఆయ‌న‌పై ఆరోపణలు వ‌చ్చాయి. దీంతో జెన్‌కో సీఎండీ, ఎనర్జీ సెక్రటరీ ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు వేసింది. రాష్ట్రంలో ఇటీవల ఎదురవుతున్న విద్యుత్ అంతరాయాలు, యాదాద్రి ప్లాంట్‌లో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి వైఫల్యాలపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే వైటీపీఎస్ స్టేజ్‌-1 చీఫ్ ఇంజినీర్‌పై వేటు ప‌డ‌టం గ‌మ‌నార్హం.

నైనీ, మహానది కోల్ బ్లాకుల (Naini Coal block) నుండి బొగ్గు సరఫరా లింకేజీ ఉన్నప్పటికీ, యాదాద్రి పవర్ ప్లాంట్‌లో పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి (Power Generation) జరగకపోవడంపై ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులను సీఎం నిలదీశారు. రాష్ట్రంలో పంటల కోతల సమయం కావడం, సాగునీటికి విద్యుత్ సరఫరా కీలకమైన తరుణంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. విద్యుత్ సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని పలుమార్లు ఆదేశించినా పరిస్థితిలో మార్పు ఎందుకు రావడం లేదని అధికారులను నిలదీశారు.

రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ ఉత్పత్తిని పెంచేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు లింకేజీ ఏర్పాట్లు చేసినా యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌లో (Yadadri Power Plant) పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించేది లేద‌ని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేద‌ని హెచ్చరించారు. అవసరమైతే విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్, జెన్‌కో సీఎండీ.. సంబంధిత విభాగపు ఐఏఎస్‌లను సస్పెండ్ చేస్తానని మండిపడ్డారు.

Advertisement
Advertisement