త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | మీరు రాజ‌కీయాల్లోకి రాక‌ముందు ఆస్తులెన్నో ప్ర‌జ‌ల‌కు చెప్పాలి

Ramchandar Rao | కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి రాజ‌కీయాల్లోకి రాక‌ముందు వారికున్న ఆస్తులెన్నో తెలంగాణ‌ ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Sep 18, 2026, 2.32 pm IST

Ramchandar Rao | మీరు రాజ‌కీయాల్లోకి రాక‌ముందు ఆస్తులెన్నో ప్ర‌జ‌ల‌కు చెప్పాలి
Advertisement
  • బీఆర్ఎస్‌, కాంగ్రెస్ హ‌యాంలో జ‌రిగిన భూ కుంభ‌కోణాల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాలి
  • ఢిల్లీలో మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు డిమాండ్

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి రాజ‌కీయాల్లోకి రాక‌ముందు వారికున్న ఆస్తులెన్నో తెలంగాణ‌ ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు డిమాండ్ చేశారు. శుక్ర‌వాంర ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అప్పుడు కేసీఆర్‌, ఇప్పుడు రేవంత్ నిజాం బాట‌లోనే న‌డుస్తున్నార‌ని మండిప‌డ్డారు. దేశంలో ధ‌నిక వ్య‌క్తులుగా మార‌డానికే ఆలోచిస్తున్నార‌ని.. తెలంగాణ ప్ర‌జ‌ల సంక్షేమం గురించి ఆలోచించ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

తెలంగాణ ప్ర‌జ‌లు బీఆర్ఎస్‌, కాంగ్రెస్ నైజాన్ని తెలుసుకోవాలి. గ‌తంలో ఆనాటి సీఎం కేసీఆర్ ప‌దే ప‌దే నిజాంను పొగిడారు. మంచి ప‌నులు చేశార‌ని చెప్తూ ఉంటారు. మొన్న అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి కూడా నిజాంను పొగిడారు. ఈ రెండు పార్టీల వైఖ‌రి మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. నిజాం మ‌హిళ‌ల‌ను బ‌తుక‌మ్మ కూడా ఆడ‌నీయ‌లేదు. తుపాకుల‌తో కాల్చి ప‌ర‌కాల‌లో జ‌లియ‌న్‌వాలా బాగ్ లాంటి న‌ర‌మేధం సృష్టించారు. నిర్మ‌ల్‌, జోడేఘాట్‌లో జ‌రిగిన అనేక సంఘ‌ట‌న‌లను తెలంగాణ ప్ర‌జ‌లు గాధ‌గా చెబుతారు. ఈ రెండు పార్టీలు నిజాంను ఆద‌ర్శంగా తీసుకుంటున్నాయంటే ఒక్క‌సారి మ‌నం ఆలోచించాలి.

ఆనాడు నిజాం ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నికుడుగా ఉన్న‌డు. నిజాం వార‌సులుగా మేం కూడా రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది కంట్రీ కావాలే అనే ఆలోచ‌న‌తో ఈ ఇద్ద‌రు కూడా ఉన్న‌రు. అందుకే దోచే కార్య‌క్ర‌మంల ఉన్న‌రు. అది నేన్ చెప్పే మాట కాదు. నిజాం భూములు, ప్ర‌జ‌ల భూములు దాదాపు 500 ఎక‌రాల వ‌ర‌కు కేసీఆర్ దగ్గ‌రున్న‌య‌ని రేవంత్ అంటున్న‌రు. రేవంత్ కూడా 22ఏ కింద వాళ్ల మంత్రులు ప్రైవేట్ భూములను కూడా ఆక్ర‌మించి క‌బ్జాల‌కు పాల్ప‌డుతున్నారు.

ఈ రెండు పార్టీలకు డిఫ‌రెంట్ ఏంది అని అడుగుతున్నా. బీజేపీ ఒక‌టే డిమాండ్ చేస్తున్న‌ది.. మీరు ఫ‌స్ట్ రాజ‌కీయాల‌కు రాకముందు మీ ద‌గ్గ‌ర ఆస్తులు ఎన్ని ఉన్న‌య్‌.. మీ కుటుంబ ఆస్తులు ఎన్ని ఉన్నాయో తెలంగాణ ప్ర‌జ‌లకు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. అసెంబ్లీలో చేసిన ఆరోప‌ణ‌ల మీద ద‌ర్యాప్తు చేయాలి.

కేసీఆర్ భూ కుంభ‌కోణాల మీద‌నే కాకుండా మూడేళ్ల మీ పాల‌న‌లో జ‌రిగిన కుంభ కోణాల‌పై కూడా, 22ఏ మీద కూడా స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేస్తున్నం. రెండు పార్టీలు ప్ర‌జ‌లను దోచుకునే రీతిలో ఒక‌రిమీద ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణలో ప్ర‌జ‌ల సంక్షేమం కాకుండా వాళ్ల కుటుంబ సంక్షేమం, వ్య‌క్తుల సంక్షేమం కోస‌మే ఆలోచిస్తున్న‌రు.

ఒంట‌రిగానే అధికారంలోకి వ‌స్తాం..

రెండు ప్ర‌భుత్వాల హ‌యాంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాలి. మాకు ఏ పార్టీతో పొత్తు ఉండ‌దు. ఒంటరిగా పోతం. భ‌విష్య‌త్‌లో ఒంట‌రిగానే అధికారంలోకి వ‌స్తం. అధికారంలోకి రాగానే మేం విచార‌ణ జ‌రిపిస్తాం అని రాంచంద‌ర్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement