త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Rakesh Reddy | 3 జిల్లాల‌కే అభివృద్ధి ప‌రిమిత‌మైంది.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్

MLA Rakesh Reddy | నీళ్లు, నిధులు, నియామ‌కాల మీద ఏర్ప‌డ్డ తెలంగాణ రాష్ట్రంలో కేవ‌లం 3 జిల్లాల‌కే అభివృద్ధి ప‌రిమిత‌మైంద‌ని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. మ‌రి మిగ‌తా 30 జిల్లాల ప‌రిస్థితి ఏంట‌ని శాస‌న‌స‌భా వేదిక‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఆయ‌న నిల‌దీశారు.

S

Telangana | Published On Sep 18, 2026, 1.48 pm IST

MLA Rakesh Reddy | 3 జిల్లాల‌కే అభివృద్ధి ప‌రిమిత‌మైంది.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్
Advertisement

MLA Rakesh Reddy | త్రినేత్ర‌.న్యూస్ : నీళ్లు, నిధులు, నియామ‌కాల మీద ఏర్ప‌డ్డ తెలంగాణ రాష్ట్రంలో కేవ‌లం 3 జిల్లాల‌కే అభివృద్ధి ప‌రిమిత‌మైంద‌ని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. మ‌రి మిగ‌తా 30 జిల్లాల ప‌రిస్థితి ఏంట‌ని శాస‌న‌స‌భా వేదిక‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఆయ‌న నిల‌దీశారు. శాస‌న‌స‌భ‌లో జీరో అవ‌ర్ సంద‌ర్భంగా రాకేశ్ రెడ్డి ర‌గిలిపోయారు.

రాష్ట్రంలో రాజ‌కీయాలంటే న‌వ్వులాట అయిపోయింది. నీళ్లు, నిధులు, నియామ‌కాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది. కానీ ప్ర‌స్తుతం నీళ్లు, నిధులు, నియామ‌కాల్లేవు. ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సాగునీటికి తీవ్ర ఇబ్బందులున్న‌య్. కాలువ‌లు క‌బ్జా అయ్యాయి. నీళ్లు ఇంకిపోయాయి. గుత్ప రాజ‌న్న చెరువును ఒక టీఎంసీకి పెంచ‌మంటున్నాం. దాని వ‌ల్ల 20 వేల ఎక‌రాల‌కు ఆయ‌క‌ట్టు వ‌స్త‌ది. వేల్పూరు, బాల్కొండ వ‌ర‌కు నీళ్లు వెళ్తాయి. అలీసాగ‌ర్ లిఫ్ట్ ఇరిగేష‌న్ వాట‌ర్ రావ‌డం లేదు. కాలువ‌లు పూడుకుపోయాయి. మా నియోజ‌క‌వ‌ర్గంలోని రైతుల‌కు వంద‌ల, వేలాది ఎక‌రాలు లేవు. ఎక‌రం, అర ఎక‌రం లోపు రైతులు ఉన్నారు. మాదాపూర్ పెద్ద చెరువును 0.8 నుంచి 1 టీఎంసీల‌కు పెంచితే ప‌ది వేల ఎక‌రాలు పారుతుది. మేం ఫ్యూచ‌ర్ సిటీని అడ‌గ‌డం లేదు.. నీళ్లు ఇవ్వ‌మంటున్నామ‌ని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.

సీఎం మాకు ఆద‌ర్శం..

అంద‌రూ క‌లిసి మాకు అన్యాయం చేశారు. నా ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం మీద రివ్యూ చేసి.. నిధులు కేటాయించాలి అని సీఎంను కోరుతున్నాం. సీఎం మాకు ఆద‌ర్శం.. ఎందుకంటే ప్ర‌జ‌ల కోసం ఎలా కొట్లాడాలో తెలుసుకున్నాం. సీఎం కాగానే ఒక‌టే నెల‌లో 2900 కోట్లు, త‌ర్వాత 4600 కోట్లు ఆయ‌న సొంత నియోజ‌వ‌ర్గానికి కేట‌యించారు. కొడంగ‌ల్, మ‌ధిర‌నే మాకు ఆద‌ర్శం అని రాకేశ్ రెడ్డి అన్నారు.

వివ‌క్ష వ‌ల్ల ఏర్ప‌డ్డ రాష్ట్రంలో మ‌ళ్లీ వివ‌క్ష ఎందుకు..?

ఇవాళ మూడు జిల్లాల‌కే అభివృద్ధి ప‌రిమిత‌మైంది. ఈ విష‌యం అధికార ప‌క్ష స‌భ్యుల‌కు కూడా తెలుసు. కానీ వాళ్లు చెప్ప‌లేరు.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నందుకు గొంతు విప్పి మాట్లాడుతున్నా. 3 జిల్లాల‌కే అభివృద్ధి ప‌ర‌మిత‌మైంది. వివ‌క్ష వ‌ల్ల ఏర్ప‌డ్డ రాష్ట్రంలో మ‌ళ్లీ వివ‌క్ష ఎందుకు..? నిధులు ఒక‌టే ప్రాంతానికి పోతున్నాయి.. మూడు జిల్లాల‌తో పాటు మిగ‌తా జిల్లాల‌ను కూడా స‌మానంగా చూడండి అని రాకేశ్ రెడ్డి ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement