త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మీరు వ‌డ్ల బ‌స్తాలు మోస్తుంటే.. రేవంతేమో డ‌బ్బుల బ‌స్తాలు మోస్తుండు

KTR | మీరంతా వ‌డ్ల బ‌స్తాలు మోస్తుంటే రేవంత్‌రెడ్డి మాత్రం డ‌బ్బుల సంచులు మోస్తూ బాగా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అయితే ఆయన ఆ సంచులు ఎక్క‌డికి మోస్తున్నాడో నాకంటే మీకే బాగా తెలుసన్నారు. కేసీఆర్ హ‌యాంలో గోదావరిలో నీళ్లున్న పాయింట్‌ను వెతికి మరీ పట్టుకొని అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు క‌ట్టామ‌న్నారు.

S

Telangana | Published On Jul 6, 2026, 6.49 pm IST

KTR | మీరు వ‌డ్ల బ‌స్తాలు మోస్తుంటే.. రేవంతేమో డ‌బ్బుల బ‌స్తాలు మోస్తుండు
Advertisement
  • అవి ఎక్క‌డికి మోస్తుండో నాకంటే బాగా మీకే తెలుసు
  • నిన్న క‌న్నేపల్లికి పోయి రెండు మోటార్లు ఆన్ చేయ‌మ‌ని చెప్పినం
  • అయినా వింట‌లేడు
  • స‌రిగ్గా నీళ్ల పాయింట్ చూసి కాళేశ్వ‌రం క‌ట్టినం
  • మ‌ళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే సంతోషంగా ఉంటం
  • అధికారం పోయినా బీఆర్ఎస్‌పై మ‌మ‌కారం ద‌గ్గ‌లే
  • మ‌ల్లాపూర్ హ‌మాలీ యూనియ‌న్ స‌భ‌లో కేటీఆర్

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: మీరంతా వ‌డ్ల బ‌స్తాలు మోస్తుంటే రేవంత్‌రెడ్డి మాత్రం డ‌బ్బుల సంచులు మోస్తూ బాగా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అయితే ఆయన ఆ సంచులు ఎక్క‌డికి మోస్తున్నాడో నాకంటే మీకే బాగా తెలుసన్నారు. హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో జరిగిన 18వ హమాలీ యూనియన్ మహాసభకు ఆయ‌న‌ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. నిన్న కాళేశ్వరంలోని కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శించామ‌ని, అక్కడ లక్ష క్యూసెక్కుల నీరు సముద్రంలో వృథాగా కలుస్తోందన్నారు. కేసీఆర్ హ‌యాంలో గోదావరిలో నీళ్లున్న పాయింట్‌ను వెతికి మరీ పట్టుకొని అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు క‌ట్టామ‌న్నారు. మా గుండెల్లో కేసీఆర్‌ను పెట్టుకున్నామని, మీరు ఇక్కడికి రావాలని పిలిచిన హమాలీ కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాన‌న్నారు.

సీఎం రేవంత్‌ ఢిల్లీలో ఉన్న పెద్దల కోసం డబ్బుల మూటలు మోసి మోసి బాగా కష్టపడుతున్నాడు. కాళేశ్వరంలో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్‌లో రెండు పంపులు ఆన్‌ చేస్తే తెలంగాణ మొత్తం సుభిక్షం అవుతుందని చెప్పాం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆ పని చేయడం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడమే ఆయ‌న‌ లక్ష్యం. ఇక ఈ గొడవంతా ఎందుకని.. నీళ్లే ఇవ్వకపోతే ఏ గొడవ ఉండదని, ఇవాళ నీళ్లు ఉన్నా మన పంటలను ఎండబెడుతున్నాడు. రైతులను అరిగోసలు పెడుతున్నాడు. అన్నదాతలను అష్టకష్టాల పాలు చేస్తున్నాడు అని ఆవేద‌న చెందారు.

మీ మీద కేసు పెడితే వీపు సాపైత‌ద‌ని రేవంత్‌కు తెలుసు..

నాడు బీఆర్ఎస్ హయాంలో భూములకు ఉన్న రేట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పడిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రజల కోసం కొట్లాడుతున్న మా మీద ఈ రేవంత్ రెడ్డి రెండు కేసులు పెడతారు, మాకేం పర్వాలేదు. ఒకవేళ మీ మీద కేసులు పెడితే మాత్రం తన వీపు సాపవుతుందని రేవంత్‌కు బాగా తెలుసు. గతంలో హమాలీలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడ్డారు. కేసీఆర్ దయతో 8 రూపాయలు ఉన్న రేట్లను 26 రూపాయలకు పెంచాం. అది కేసీఆర్ ఘనతగా వారు భావించి సంతోషపడ్డారు. 250 శాతం రేట్లు పెంచుకున్నామని హమాలీలు సంబరపడ్డారు. గతంలో ఐదు సంవత్సరాలకోసారి రేట్లు పెరిగితే, కేసీఆర్ వచ్చాక రెండు సంవత్సరాలకోసారి రేట్లు పెంచుకొని చాలా సంతోషంగా ఉన్నామని హమాలీ కార్మికులు చెప్పారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

హ‌మాలీల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే బాధ్య‌త నాది..

హమాలీ కార్మికులకు ఆరోగ్య భద్రతతో పాటు ఏ రకమైన సమస్యలున్నా నెరవేర్చే బాధ్యత మనది. ఈ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరడం తథ్యం. హమాలీల సమస్యలు తీర్చడం సైతం జరుగుతుంది. ఒక్కటి కూడా వదిలి పెట్టకుండా అన్ని తీర్చే బాధ్యత నాది. తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత వడ్లు ఏ ర‌కంగా పండాయో, పంటలు సస్యశ్యామలంగా ఎలా మారాయో మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం సైతం గణనీయంగా పెరిగింది. ప్రజలకు అన్నం పెట్టే విధంగా అటు రైతులు కష్టపడితే, ఇటు బస్తాలు మోసి మోసి హమాలీ కార్మికుల‌కు వీపులు కాయలు కాచిన పరిస్థితి నెలకొంది అని కేటీఆర్ గుర్తు చేశారు.

నీళ్లిస్తే యూరియా నుంచి బోన‌స్ దాకా ఇవ్వాల్సి వ‌స్త‌ద‌ని..

నేడు రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు ఆకాశాన్ని దిగాలుగా చూస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్న మేం క‌న్నేప‌ల్లి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మా పైన ఏమైనా కోపం ఉంటే ఏమైనా కేసులు పెట్టుకోండి, అంతేకానీ మా మీద ఉన్న కోపాన్ని రైతుల మీద తీయొద్దని రిక్వెస్ట్‌ చేయడం జరిగింది. ఇప్పుడు నీళ్లు ఇస్తే యూరియా ఇవ్వాలి, యూరియా ఇస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే మద్దతు ధర ఇవ్వాలి, మద్దతు ధర ఇస్తే మళ్లీ బోనస్ ఇవ్వాలి.. ఇదంతా ఎందుకని నీళ్లు ఇవ్వడం లేదు అని ఆయ‌న ఆరోపించారు.

రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి మంచి బుద్ధి కలిగిన వాడు ఉంటే రాష్ట్రంలో పేదలు, పెద్దలు, హమాలీలు, మిల్లు యజమానులు అందరూ సంతోషంగా ఉంటారు. పది సంవత్సరాల కేసీఆర్ హయాంలో మనం అదే చూసాం. రైతులు బాగున్నారు, పారిశ్రామికవేత్తలు బాగున్నారు, హమాలీలు బాగున్నారు, అందరూ బాగున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం లేకపోయినప్పటికీ ప్రజల్లో మమకారం మాత్రం పోలేదు. ఈ కష్ట సమయంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉన్నారో వారందరినీ కాపాడుకుంటాం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ స్ప‌ష్టం చేశారు.

ఈరోజు 18వ మహాసభలు జరుపుకుంటూ మమ్మల్ని ఆహ్వానించిన హమాలీ సోదరులకు ధన్యవాదాలు. మీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాను. మీ ప్రతి సమస్యను తీర్చే బాధ్యత నాదే. మీరంతా ఐకమత్యంగా, గట్టిగా ఉండాలని కోరుతున్నా. ఇంకా రెండు సంవత్సరాల్లో క‌చ్చితంగా కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం. ఏ చిన్న సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కరించుకుందామని మీ అందరికీ తెలియజేస్తున్నా అని కేటీఆర్ వెల్ల‌డించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు క్యామ మల్లేష్, హమాలీ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement