త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Teenmar Mallanna | మా ద‌ళిత బిడ్డ కూర్చుంటే క‌ళ్లు మండుతున్న‌య్‌: తీన్మార్ మ‌ల్ల‌న్న‌

Teenmar Mallanna | త‌మ‌ ద‌ళిత బిడ్డ కుర్చీలో కూర్చుంటే అగ్ర‌వ‌ర్ణాల‌కు క‌ళ్లు మండుతున్నాయ‌ని.. స్పీక‌ర్ గ‌డ్డ ప్ర‌సాద్‌కుమార్‌పై తాతా మ‌ధు వ్యాఖ్య‌లు తీవ్ర అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న మండిప‌డ్డారు.

S

Telangana | Published On Sep 8, 2026, 1.33 pm IST

Teenmar Mallanna | మా ద‌ళిత బిడ్డ కూర్చుంటే క‌ళ్లు మండుతున్న‌య్‌: తీన్మార్ మ‌ల్ల‌న్న‌
Advertisement
  • తాతా మ‌ధు వ్యాఖ్య‌లు తీవ్ర అభ్యంత‌ర‌కం
  • ఆయ‌న‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి
  • దీనిపై ఈ రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రేంటో చెప్పాలి
  • శాస‌న‌మండ‌లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న డిమాండ్‌

Teenmar Mallanna | త్రినేత్ర‌.న్యూస్: త‌మ‌ ద‌ళిత బిడ్డ కుర్చీలో కూర్చుంటే అగ్ర‌వ‌ర్ణాల‌కు క‌ళ్లు మండుతున్నాయ‌ని.. స్పీక‌ర్ గ‌డ్డ ప్ర‌సాద్‌కుమార్‌పై తాతా మ‌ధు వ్యాఖ్య‌లు తీవ్ర అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న మండిప‌డ్డారు. స‌భ‌కు ఉన్న‌ విస్తృత అధికారాల‌ను ఉప‌యోగించి తాతా మ‌ధుపై చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ వైఖ‌రి ఏంటో చెప్పాల‌న్నారు. కేవలం స్పీక‌ర్‌ను అవమానించడం కాదని.. యావత్ బహుజన, దళిత, బీసీ సమాజాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించడమేన‌ని అభివ‌ర్ణించారు. మంగ‌ళ‌వారం శాస‌న‌మండ‌లిలో మ‌ల్ల‌న్న ప్ర‌సంగిస్తూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యల‌ను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. స్పీకర్ పీఠంపై కూర్చున్న వ్యక్తి కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, అది ఒక అత్యున్నతమైన రాజ్యాంగ స్థానం. కొన్ని శతాబ్దాల పాటు అవమానాలు, అసమానతలు, అణచివేతలకు గురైన వర్గాల నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్ల, ఆయన కల్పించిన హక్కుల వల్ల ఈరోజు మా వర్గానికి చెందిన ఒక బిడ్డ వచ్చి ఆ పీఠం మీద కూర్చున్నాడు. అలాంటి పీఠాన్ని, ఆ పీఠం మీద ఉన్న వ్యక్తిని అంత పరుష పదజాలంతో అవమానిస్తారా?

సంప‌త్‌కుమార్‌ను మెడ‌ప‌ట్టి బ‌య‌ట‌కు గెంటింది నిజం కాదా?

బీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్తేమీ కాదు.. గతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అడిగిన దళిత బిడ్డలను 'కుక్కలు' అని హేళన చేసిన చరిత్ర వీరిది! తాటికొండ రాజయ్య‌ను ఎలాంటి కారణం చెప్పకుండా అర్ధరాత్రి మంత్రివర్గం నుంచి తొలగించి అవమానించలేదా? దళితుడిని మొదటి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేయలేదా? మా వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను కాగితాలు విసిరేశారనే నెపంతో చట్టసభ నుంచి మెడపట్టి బయటకు నెట్టేసింది నిజం కాదా?

క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి..

2025లో బీహార్ శాసన మండలిలో సునీల్ కుమార్ సింగ్ అనే ఎమ్మెల్సీ సభా గౌరవానికి భంగం కలిగిస్తే, ఆయన సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేశారు. ఈరోజు మన సభలో కూడా పీఠాన్ని, సభను అవమానించిన వారిపై కఠిన నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు స్పీక‌ర్‌ పీఠానికే రక్షణ లేకపోతే, ఆ కుర్చీకే విలువ ఇవ్వకపోతే.. ఇక సాధారణ సభ్యులమైన మా పరిస్థితి ఏమిటి అధ్యక్షా? మేం వస్తాం.. మాకు నచ్చినట్లు చేస్తాం అంటే ఈ సభ నడవదు. సభా పీఠం గౌరవాన్ని కాపాడకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. చట్టసభలపై ప్రజలకు నమ్మకం పోతుంది.

మా బహుజన బిడ్డలు కష్టపడి పైకి వచ్చి ఇటువంటి ఉన్నత స్థానాల్లో కూర్చుంటే అగ్రవర్ణాలు ఓర్చుకోలేకపోతున్నారు. ఈ దాష్టీకాలపై వెంటనే సుదీర్ఘ చర్చ జరిపి, తప్పు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై తమ వైఖరి ఏంటో చెప్పాలి. మంత్రులు సమాధానం చెప్పాలి అని మ‌ల్ల‌న్న డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement