త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Adluri | దివ్యాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

Minister Adluri | రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం, వారి విద్యాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. నల్లగొండ ఎక్స్‌రోడ్స్‌లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం, ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహం, పాఠశాలను గురువారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

P

Telangana | Published On Jul 16, 2026, 6.21 pm IST

Minister Adluri | దివ్యాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
Advertisement

Minister Adluri | రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం, వారి విద్యాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. నల్లగొండ ఎక్స్‌రోడ్స్‌లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం, ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహం, పాఠశాలను గురువారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని విద్యార్థులతో మంత్రి మాట్లాడారు. మూగ–చెవిటి విద్యార్థులు సంకేత భాష ద్వారా తమ సమస్యలను వివరించగా.. మంత్రి ఆసక్తిగా విన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. విద్యార్థుల అవసరాలకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు.

విద్యాసంస్థలో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంత్రి ఆరా తీశారు. ఖాళీ పోస్టుల వివరాలు, అవసరమైన బోధనా సిబ్బంది, ఇతర సౌకర్యాలపై తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు, పాఠశాల ప్రిన్సిపాల్‌కు సూచించారు. దివ్యాంగ విద్యార్థుల విషయంలో విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. వసతి గృహంలోని ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, వైద్య సేవలు, తరగతి గదులు, బోధనా వసతులు, విద్యార్థుల భద్రత వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సేవలు, సామాజిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాల కల్పనతో పాటు సంక్షేమ పథకాల సమర్థ అమలుపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు. ప్రతి దివ్యాంగ విద్యార్థికి నాణ్యమైన విద్య, మెరుగైన వసతి, అవసరమైన సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలను మానవీయ దృక్పథంతో పరిష్కరించాలని, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రతిపాదనలను ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రభుత్వానికి పంపాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అర్హులందరికీ చేరేలా సమన్వయంతో పనిచేయాలని కోరారు.

Advertisement
Advertisement