త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

V Srinivas Goud | తెలంగాణ ఐటీ ఉద్యోగుల‌ను తొల‌గిస్తే ఊరుకోం

V Srinivas Goud | కొన్ని ఐటీ సంస్థలు తెలంగాణకు చెందిన ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతూ అనైతికంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మండిప‌డ్డారు.

S

Telangana | Published On Sep 25, 2026, 3.16 pm IST

V Srinivas Goud | తెలంగాణ ఐటీ ఉద్యోగుల‌ను తొల‌గిస్తే ఊరుకోం
Advertisement
  • వారికి అన్యాయం జ‌రిగితే గ‌ట్టిగా స్పందిస్తాం
  • ఉద్యోగులు, సంఘాలు ఐక్యంగా ప‌ని చేయాలి
  • మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపు

V Srinivas Goud | త్రినేత్ర న్యూస్: కొన్ని ఐటీ సంస్థలు తెలంగాణకు చెందిన ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతూ అనైతికంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మండిప‌డ్డారు. ఇటీవల 20 వేల మంది ఉద్యోగులను తొలగిస్తే వారిలో సుమారు 15 వేల మంది తెలంగాణకు చెందినవారే ఉన్నారని వాపోయారు. తెలంగాణ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని తొలగింపులకు పాల్పడితే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చ‌రించారు. ఉద్యోగులకు అన్యాయం జరిగితే వారి తరఫున పోరాడుతామన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ ఇండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయ‌న‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

దేశవ్యాప్తంగా ఐటీ రంగంపై కోట్లాది మంది ఆధారపడి ఉన్నారని, తెలంగాణలో సుమారు 10 లక్షల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు పరిమితంగా ఉండేవని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో ఐటీ రంగం విస్తరించిందన్నారు. పారిశ్రామిక విధానాల ద్వారా ఐటీ సంస్థలను ప్రోత్సహించడం వల్ల రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు.

మహిళా ఉద్యోగులకు సంస్థలు తగిన భద్రత కల్పించాలని, మహిళలను వేధించే చర్యలను సహించబోమని అన్నారు. ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు, సంఘాలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఉద్యోగులను అన్యాయంగా, అనైతికంగా తొలగిస్తే ఊరుకునేది లేదని, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఐటీ ఉద్యోగులకు అండగా ఉంటామని భ‌రోసా ఇచ్చారు.

ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సౌభిక్ భట్టాచార్య, పి.వి. హరీష్, ఒరాకిల్ మాజీ ఉద్యోగి మెరుగు శ్రీధర్, ఆశా అబ్రహం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement