త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Seethakka | మ‌హిళా వారోత్స‌వాల్లో వృద్ధులు, దివ్యాంగుల‌ను భాగం చేస్తాం: మంత్రి సీత‌క్క‌

Seethakka | మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా “మహిళా వారోత్సవాలు” నిర్వహించనుందని మంత్రి సీత‌క్క తెలిపారు. వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు ఉంటాయ‌ని చెప్పారు.

S

Telangana | Published On May 21, 2026, 3.51 pm IST

Seethakka | మ‌హిళా వారోత్స‌వాల్లో వృద్ధులు, దివ్యాంగుల‌ను భాగం చేస్తాం: మంత్రి సీత‌క్క‌
Advertisement
  • ఈనెల 25 నుంచి 31 వ‌ర‌కు వారోత్స‌వాలు నిర్వ‌హిస్తాం
  • ఆర్థిక‌, సామాజిక‌, రాజ‌కీయ సాధికార‌త‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తాం
  • అన్ని శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో వారోత్సవాల‌ను విజ‌య‌వంతం చేద్దాం
  • మంత్రి సీత‌క్క పిలుపు

Seethakka | త్రినేత్ర‌.న్యూస్: మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా “మహిళా వారోత్సవాలు” నిర్వహించనుందని మంత్రి సీత‌క్క తెలిపారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, సంస్థలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్దులు తో స‌హా అన్ని వర్గాల వారిని భాగస్వాముల‌ను చేస్తామ‌న్నారు. వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు ఉంటాయ‌ని చెప్పారు. ఈ మేర‌కు గురువారం ఆమె ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఈ కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధుల విస్తరణ, సామాజిక భద్రత, ఆరోగ్యం, భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్, రుణమేళాలు నిర్వ‌హిస్తాం అని చెప్పారు.

ఈనెల 29న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మ‌హిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌ల కోసం ఇంక్యుబేటర్ ప్రోగ్రాం ప్రారంభం ఉంటుంది. జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమం నిర్వహించనుండటం ఈ వారోత్సవాల్లో ప్రధాన ఆకర్షణ. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఆర్థిక అవకాశాలు విస్తరించే దిశగా ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుంది అని సీత‌క్క పేర్కొన్నారు.

మహిళా సంఘాలను కేవలం పొదుపు సమూహాలుగా కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉత్పాదక శక్తులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. మహిళలకు బ్యాంకు రుణాలు, జీవనోపాధి యూనిట్లు, సూక్ష్మ పరిశ్రమలు, వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు వంటి అవకాశాలను గ్రామ స్థాయికే తీసుకెళ్తున్నాం. మహిళల చేతుల్లో ఆదాయం పెరిగితే కుటుంబాలు బలపడటమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మరింత పటిష్టమవుతుంది. మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రతి కార్యక్రమం మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రత, నాయకత్వ వికాసానికి దోహదపడేలా రూపొందించాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలి అని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

రోజువారీ కార్యక్రమాలు ఇలా..

మే 25 - సౌర విద్యుత్ ప్లాంట్లు & ప్రత్యేక సర్వసభ్య సమావేశాలు

  • వికారాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కె.అసిఫాబాద్ ప్రాంతాల్లో 0.5 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ల ప్రారంభం
  • మ‌హిళా సంఘాల‌చే న‌డిచే 450 RTC బస్సుల ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం
  • జిల్లా స్థాయిలో పోషకాహార అవగాహన కార్యక్రమాలు
  • SHGలు, గ్రామ సంఘాల ప్రత్యేక సర్వసభ్య సమావేశాలు
  • మహిళా సంఘాలకు బ్యాంకింగ్ లోన్లు, వ‌డ్డి లేని రుణాలు విడుదల, ఉత్తమ సంఘాల సత్కారం
  • 2026-27 కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన

మే 26 - సామాజిక సమీకరణ దినం..

  • అర్హులైన మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, బాలికల గుర్తింపు
  • మిగిలిన మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చడం
  • దివ్యాంగులు, వృద్ధ మహిళల SHGల ఏర్పాటు
  • టీన్ ఏజ్ బాలిక‌లతో మాక్ పార్లమెంట్ నిర్వహణ

మే 28 - మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమాలు..

  • మహిళా సంఘ భవనాలు, వర్క్ షెడ్లు, మ‌హిళా గోదాముల నిర్మాణాలకు శంకుస్థాపనలు
  •  భూమి పూజలు, ప‌నుల ప్రారంభోత్స‌వాలు

మే 29 - రుణమేళాలు & జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్

  • హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇంక్యుబేటర్ ప్రోగ్రాం ప్రారంభం
  • మండల స్థాయిలో రుణమేళాలు
  • మండల సమాఖ్యల ప్రత్యేక సర్వసభ్య సమావేశాలు
  • కోళ్ల పెంపకం యూనిట్లు-500, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటు
  • బ్యాంక్ లింకేజ్ ద్వారా ఆర్థిక సహాయం
  • కమ్యూనిటీ ఎంటర్‌ప్రైజ్ ఫండ్ మద్దతు
  • ఆయిల్ బండ్లు, నెక్ ఎగ్ కార్ట్స్ పంపిణీ
  • దివ్యాంగులకు బ్యాటరీ వాహనాల పంపిణీ
  • వ్యవసాయ ప్రాసెసింగ్ యూనిట్లు, షేడ్ నెట్లు, 185 గోదాముల నిర్మాణాలకు భూమి పూజ
  • తేనెటీగల పెంపకం యూనిట్లు, బయో ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్ల గ్రౌండింగ్

మే 30, 31- మహిళల భద్రత & మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు

  • జిల్లా మహిళా సమాఖ్య భవనాల ప్రారంభం
  • గుర్తించిన ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల భూమిపూజలు
  • జిల్లా సమాఖ్యల ప్రత్యేక సర్వసభ్య సమావేశాలు
  • టీన్ ఏజ్ బాలిక‌ల‌కు సైకిళ్ల పంపిణీ
  • అమ్మ‌కు అక్ష‌ర‌మాల కార్య‌క్ర‌మంలో భాగంగా చ‌దువు నేర్చుకున్న మ‌హిళ‌ల‌కు స‌త్కారం
  • ఆరోగ్య శిబిరాలు, మహిళలకు ఆరోగ్య పరీక్షలు
  • మహిళల భద్రత కోసం ప్రత్యేక వింగ్ కార్యక్రమాలు
  • పట్టణ ప్రాంతాల్లో ఇందిర‌మ్మ చీరల పంపిణీ

 

Advertisement
Advertisement