త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | సెప్టెంబర్‌ 7న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తాం

KTR | కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా పాలన పేరుతో తొండి మాటలు, మొండి చేతులు చూపించారని విమర్శించారు. ‘‘ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన’’ అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని, వెయ్యి రోజుల పాలన క్రిమినల్‌ వెస్ట్‌ అని వ్యాఖ్యానించారు.

P

Telangana | Published On Sep 2, 2026, 6.10 pm IST

KTR | సెప్టెంబర్‌ 7న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తాం
Advertisement
  • ప్ర‌జాపాల‌న కాదు.. ప్ర‌జాపీడ‌న‌
  • బూతులు త‌ప్ప రేవంత్‌రెడ్డికి తెలుగు రాదు
  • కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం
  • వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన క్రిమినల్ వెస్ట్
  • బీఆర్‌స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

KTR | కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా పాలన పేరుతో తొండి మాటలు, మొండి చేతులు చూపించారని విమర్శించారు. ‘‘ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన’’ అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని, వెయ్యి రోజుల పాలన క్రిమినల్‌ వెస్ట్‌ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అనుముల నాగుపాము బుసలు కొడుతోందని, అనుముల బ్రదర్స్‌ అనకొండలుగా మారారని ఆరోపించారు. ఎక్కడ భూమిని వదలడం లేదని అన్నారు. ‘‘రాష్ట్రంలో అనుముల బ్రదర్స్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుయాయులు 30 శాతం కమీషన్‌ వసూలు చేస్తున్నారు’’ అని ఆరోపించారు. కాంట్రాక్టులన్నీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మెగా కృష్ణారెడ్డికి దక్కుతున్నాయని విమర్శించారు.

గురువుకు చెంచాగిరి..

‘‘గురువుకు చెంచాగిరి చేసి గోదావరి, కృష్ణా జలాలను గురుదక్షిణ చెల్లిస్తున్నారు. ఉగ్రవాదుల్లా మూడు చెక్‌డ్యామ్‌లను పేల్చివేశారు. పెద్దవాగు, సుంకేశుల కూలిపోతే ఎన్‌డీఎస్‌ఏ రాదు. చంద్రబాబు తొత్తును ఇరిగేషన్‌ సలహాదారుగా పెట్టుకుంటే న్యాయం ఎలా జరుగుతుంది’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష గట్టిందని ఆరోపించారు. రిటైర్డ్‌ ఇంజనీర్లను బెదిరిస్తున్నారని, ‘‘బెల్టు ట్రీట్‌మెంట్‌ ఇస్తాం.. జైల్లో వేస్తాం’’ అని హెచ్చరించిన చిల్లర ప్రభుత్వం ఇదని వ్యాఖ్యానించారు. వెయ్యి రోజుల పాలనలో రూ.4.50 లక్షల కోట్ల అప్పులు చేశారని కేటీఆర్‌ ఆరోపించారు. రుణమాఫీ రూ.50 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు వచ్చిందని విమర్శించారు. బోనస్‌ను బోగస్‌ చేశారని అన్నారు. ‘‘మోటార్లకు మీటర్లు పెట్టడానికి రైతు డిస్కం కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి మూటలు పంపి రాహుల్‌ గాంధీ జేబులు నింపుతున్న జేబు దొంగ రేవంత్‌రెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్‌. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి కీలు బొమ్మ లాంటివారని ఆరోపించారు.

ఉద్యోగులు డిమాండ్ల కోసం రోడ్డెక్కారు..

సెక్రటేరియట్‌లో వేలాది మంది ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కారని కేటీఆర్‌ అన్నారు. ఉద్యోగులకు ఉత్త చేతులు చూపించి, బహుజనులను మోసం చేసిన బడుద్దాయిలని విమర్శించారు. లగచర్లలో రైతులకు సంకెళ్లు వేశారని ఆరోపించారు. ‘జాబ్‌లు లేని జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ చచ్చాయి. రాహుల్‌ గాంధీ ఎక్కడ చచ్చారు’ అని ప్రశ్నించారు. సెప్టెంబర్‌ 7న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తామని ప్రకటించారు. గురుకులాల్లో ఇప్పటి వరకు 150 మంది విద్యార్థులను చంపారని కేటీఆర్‌ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పాలిటెక్నిక్‌ విద్యార్థుల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ సీఎం పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాంగ్రెస్‌ సీఎం నిర్వీర్యం చేశారని అన్నారు. హెచ్‌సీయూలో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పిందని, దీనిపై ఈడీ విచారణ చేయాలని సూచించిందని తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేయడం లేదని విమర్శించారు.

ఇంత కండ‌కావ‌రం ఉన్న సీఎంను చూడ‌లే..

రాష్ట్రంలో బీసీలకు అతి పెద్ద ద్రోహం చేశారని కేటీఆర్‌ ఆరోపించారు. 51 శాతం ఉన్న బీసీలను తక్కువ చేసి చూపించారని అన్నారు. వెయ్యి రోజుల్లో బీసీలకు రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని విమర్శించారు. కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ‘ఇంత అహంకారం, కండకావరం ఉన్న ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. బీసీలను అవమానించిన సీఎం రేవంత్‌రెడ్డికి బీసీలు బుద్ధి చెప్పాలి’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ శతాబ్దపు అతిపెద్ద మోసం అభయహస్తం మ్యానిఫెస్టో అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై పిటిషన్లు వేసిందే కాంగ్రెస్‌ ప్రభుత్వమని ఆరోపించారు. ‘కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయండి. కోటి 67 లక్షల మంది ఆడబిడ్డల ఖాతాల్లో లక్షా 50 వేల రూపాయలు వేస్తే రేవంత్‌రెడ్డి కోరుకున్న విధంగా మేం రాజీనామా చేస్తాం’ అని కేటీఆర్‌ సవాల్‌ చేశారు.

ఆవేద‌న క‌నిపించ‌డం లేదా?

పక్క రాష్ట్రంలో చంద్రబాబు రూ.4 వేల పింఛన్‌ ఇస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. ‘‘భోదీ ప్యాలెస్‌లో కూర్చున్న కబోధికి అభాగ్యుల ఆవేదన కనపడటం లేదా’’ అని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్‌గౌడ్‌ ఆత్మహత్య చేసుకున్నారని, కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. రిటైర్డ్‌ ఉద్యోగులు, పెన్షనర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని కేటీఆర్‌ ఆరోపించారు. ‘‘ఫోక్సో నిందితులను తొమ్మిది రోజులు సీఎం కాపాడతారు. బీజేపీ నేత కుమారుడిపై ఆరోపణలు వస్తే కాంగ్రెస్‌ సీఎం కాపాడారు’’ అని వ్యాఖ్యానించారు. సీఎం ఇళ్లు సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారాయని, సీఎం ఇంటి వెనుక తుపాకులు పెట్టి సెటిల్‌మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోనూ సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌కు మహారాష్ట్ర పోలీసులు వచ్చి డ్రగ్స్‌ పట్టుకున్నారని, తెలంగాణలో నేరస్థులు, సీఎం దోస్తులు స్వేచ్ఛగా ఉన్నారని విమర్శించారు. ‘తెలంగాణ క్రైమ్‌ రేట్‌లో రైజింగ్‌’ అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు కేటీఆర్‌.

Image

సీఎం బ్ర‌ద‌ర్స్ అవినీతి బ‌య‌ట‌పెట్టారు..

సింగరేణిలో నల్లబంగారాన్ని డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. సీఎం బామ్మర్ది నేరుగా ఫోన్లు చేసి సింగరేణిలో టెండర్లు ఫిక్స్‌ చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చోటే భాయ్‌ను కాపాడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో కుంభకోణాల కుంభమేళా జరుగుతోందని కేటీఆర్‌ అన్నారు. లిక్కర్‌ బాటిళ్ల నుంచి మేడారం గద్దెల వరకు టెండర్ల గోల ఉందని ఆరోపించారు. ‘వీళ్ల బాధ పడలేక ఐఏఎస్‌ అధికారి రాజీనామా చేశారు’ అని వ్యాఖ్యానించారు. సీఎం సోదరుల అవినీతిని కొండా సురేఖ కుమార్తె బయటపెట్టిందని కేటీఆర్‌ అన్నారు. సీఎం, మంత్రులు పేచీలు పెట్టుకుంటున్నారని, అనుముల బ్రదర్స్‌ అనకొండలుగా మారారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు సంవత్సరంలోనే రూ.400 కోట్ల అప్పు కట్టారని వ్యాఖ్యానించారు.

Image

రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు

‘బూతులు తప్ప రేవంత్‌రెడ్డికి తెలుగు రాదు. సీఎం రేవంత్‌రెడ్డికి చదువు రాదు. సంస్కారం అంతకంటే లేదు’ అని కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిట్లర్‌ ఆదర్శం అని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని ఆరోపించారు. హైడ్రా కమిషనర్‌ను ఆర్మీతో లోపల వేస్తామని హైకోర్టు చెప్పిందని వ్యాఖ్యానించారు. ‘రేవంత్‌రెడ్డి తప్పులు లేకుండా ఒక్క పేజీ రాస్తే మేం అందరం రాజీనామాలు చేసి పోతాం’ అని సవాల్‌ చేశారు. ‘జెన్‌ జీతో పెట్టుకుంటే మోదీకే ముచ్చెమటలు పట్టాయి.. నీలాంటి కేడీ ఎంత’ అని అన్నారు.

Image

కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తారు

తెలంగాణలో జరిగిన విధ్వంసం, వినాశనానికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని కేటీఆర్‌ విమర్శించారు. ‘కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ ఎక్కడిది? కేసీఆర్‌ లేకుంటే రేవంత్‌రెడ్డికి సీఎం పదవి ఎక్కడిది?’ అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజీనామాలు కొత్త కాదని, ఆయన రాజీనామా చేస్తే సోనియాగాంధీ గజగజ వణికిపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. ‘సీఎంకు హుందాతనం లేదు.. మొత్తం అజ్ఞానం ఉంది’ అని అన్నారు. కేసీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తప్పకుండా అసెంబ్లీకి వస్తారని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement