త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttamkumar Reddy | హామీ ఇస్తున్నాం.. ప్ర‌తి గింజ‌నూ కొంటాం: రైతుల‌కు మంత్రి ఉత్త‌మ్ భ‌రోసా

Uttamkumar Reddy | ఇది రైతు పక్షపాత ప్రభుత్వమ‌ని.. ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో రైతులు ఆందోళ‌న చెందొద్దని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు.

S

Telangana | Published On May 28, 2026, 3.00 pm IST

Uttamkumar Reddy | హామీ ఇస్తున్నాం.. ప్ర‌తి గింజ‌నూ కొంటాం: రైతుల‌కు మంత్రి ఉత్త‌మ్ భ‌రోసా
Advertisement
  • ఇప్ప‌టికే 57 లక్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొన్నాం
  • రూ. 10097 కోట్ల రూపాయ‌లు రైతుల ఖాతాల్లో జ‌మ చేశాం
  • రైత‌న్న‌లు ప్ర‌తి ప‌క్షాల ఉచ్చులో ప‌డొద్దు
  • వంగ‌ప‌ల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప‌రిశీల‌న‌లో మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి

Uttamkumar Reddy | త్రినేత్ర‌.న్యూస్: ఇది రైతు పక్షపాత ప్రభుత్వమ‌ని.. ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో రైతులు ఆందోళ‌న చెందొద్దని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. యాదాద్రి భువ‌నగిరి జిల్లా వంగపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయ‌న ఐటీ పరిశ్రమల శాఖామంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్ తో క‌లిసి సందర్శించారు. అనంతరం సమీపంలోని రామాజిపేట వద్ద ప్రభుత్వ గోదాములలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు.

ఆందోళ‌న వ‌ద్దు..

రాష్ట్ర ప్ర‌భుత్వం 10097 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. తెలంగాణా రైతులు ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కొద్దు. రైత‌న్న‌ల‌కు అండగా ఉంటాం. ఆందోళన చెందకండి. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోంది. రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి అని ఉత్త‌మ్ ఫైర‌య్యారు.

ఇంత దిగుబ‌డి రావ‌డం రికార్డ్‌..

రబీ సీజన్లో ఇంతటి దిగుబడి రావడం సరికొత్త రికార్డ్ గా నమోదైంది. కొనుగోళ్లలోనూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డ్ సృష్టిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ‌ అనుకూల విధానాలతోనే ఇంత దిగుబడి సాధ్య‌మైంది. అదే స్థాయిలో కొనుగోళ్లు జ‌రుపుతున్నాం. చివరి గింజవరకు కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ఇందులో ఎటువంటి అపోహలకు ఆస్కారమే లేదు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి సత్వరమే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నాం. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. రైతాంగానికి నష్టం వాటిల్లే ఏ చర్యను ప్రభుత్వం సమర్ధించదు అని మంత్రి ఉత్త‌మ్ వెల్ల‌డించారు.

ఈ కార్యక్రమంలో భువ‌న‌గిరి లోకసభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన సభ్యులు కుంభం అనిల్ రెడ్డి, వేముల వీరశం, పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్, డి.సి.పి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement