త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medaram Maha Jatara 2026 | మేడారం మహా జాతర గ్రాండ్ సక్సెస్.. 200 ఏళ్లు నిలిచిపోయేలా అభివృద్ధి పనులు: మంత్రి పొంగులేటి

చరిత్రలో తొలిసారిగా జాతర ముగిసిన తర్వాత కూడా అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేడారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం "రెండో మాస్టర్ ప్లాన్" సిద్ధం చేస్తోందన్నారు.

J

Telangana | Published On Feb 28, 2026, 11.26 pm IST

Medaram Maha Jatara 2026 | మేడారం మహా జాతర గ్రాండ్ సక్సెస్.. 200 ఏళ్లు నిలిచిపోయేలా అభివృద్ధి పనులు: మంత్రి పొంగులేటి

సంక్షిప్త సారాంశం

ఇటీవల ముగిసిన మేడారం మహా జాతర విజయవంతం కావడం పట్ల రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ (సీతక్క) హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కృషితో 200 ఏళ్లు నిలిచిపోయేలా రూ.251 కోట్లతో మేడారంలో అభివృద్ధి పనులు చేశామని, మిగిలిన 5 శాతం పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జంపన్న వాగులో 365 రోజులు నీరు ఉండేలా గోదావరి జలాలను మళ్లించి, 5 చెక్ డ్యామ్‌లు నిర్మిస్తామని మంత్రులు ప్రకటించారు.

Advertisement

Medaram Maha Jatara 2026 | ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర (2026) అంగరంగ వైభవంగా ముగిసింది. సుమారు 1 కోటి 55 లక్షల మంది భక్తులు వన దేవతలను దర్శించుకున్నారు. జాతర విజయవంతం కావడం పట్ల రాష్ట్ర మంత్రులు అధికారులను అభినందించారు. శనివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారానికి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) లు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. వీరికి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు వన దేవతలను దర్శించుకుని, అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

200 ఏళ్లు చెక్కుచెదరని నిర్మాణాలు: మంత్రి పొంగులేటి

సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ చేపట్టిన రాతి నిర్మాణాలు, ప్రధాన ఆర్చిలు, ప్రహరీ చిత్రాలు, మీడియా టవర్, డ్రైనేజీ వ్యవస్థను మంత్రులు పరిశీలించారు. అనంతరం హరిత హోటల్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

రూ. 251 కోట్లతో నిధులు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో మేడారం జాతరను చరిత్రాత్మకంగా మార్చారని, ఇందుకోసం రూ.251 కోట్లు కేటాయించారని తెలిపారు.

95 శాతం పనులు పూర్తి: జాతరకు ముందే 95 శాతం పనులు పూర్తయ్యాయని, భక్తుల రద్దీ వల్ల మిగిలిపోయిన 5 శాతం పనులను వెంటనే, నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.

బాసర టు భద్రాచలం: గోదావరి పరివాహక ప్రాంతంలోని బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న అన్ని దేవాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

జంపన్న వాగుకు గోదావరి జలాలు.. 5 చెక్ డ్యామ్‌ల నిర్మాణం

భక్తుల పుణ్యస్నానాల కోసం జంపన్న వాగులో 365 రోజులు నీరు ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారని మంత్రి తెలిపారు. గోదావరి నది జలాలను జంపన్న వాగుకు మళ్లించనున్నారు. వాగులో ఎల్లప్పుడూ రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తులో నీరు నిల్వ ఉండేలా ఐదు చెక్ డ్యామ్‌లను నిర్మించనున్నారు. మేడారం ప్రాంతంలోని రెండు చెరువులను సుందరీకరించాలని అధికారులకు సూచించారు.

రెండో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం: మంత్రి సీతక్క

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. చరిత్రలో తొలిసారిగా జాతర ముగిసిన తర్వాత కూడా అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేడారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం "రెండో మాస్టర్ ప్లాన్" సిద్ధం చేస్తోందన్నారు.

ఇందులో భాగంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, మీడియా భవన్ వంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. జాతర నిర్వహణపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఆర్అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్, అదనపు కలెక్టర్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఈవో వీరస్వామి, పూజారులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement